కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ (71) కన్నుమూశారు. నెల రోజుల క్రితం కోవిడ్ బారిన పడిన ఆయనకు ఇతరత్రా ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో చికిత్స పొందుతూ ఈ వేకువజామున మరణించారు. ఆయన మృతితో మంచి సహోద్యోగిని,స్నహితుడిని కోల్పోయామని కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తనకు రాజకీయ సలహాదారుగా అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు.
అహ్మద్ పటేల్ నిరంతరం ప్రజాసేవలో ఉండేవారని ప్రధాని నరేంద్రమోదీ నివాళులు అర్పించారు. పార్టీలో కీలకపాత్ర పోషించిన అహ్మద్ పార్టీకి అత్యంత క్లిష్ట సమయం లోనూ వెన్నంటే ఉన్నారని ఎంపీ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అహ్మద్ పటేల్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సంతాపం, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. 1949 ఆగస్టు 21 జన్మించిన అహ్మద్ పటేల్ అనేకసార్లు గుజరాత్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు.
అహ్మద్ పటేల్ తొమ్మిది సార్లు పార్లమెంట్ కు ఎన్నికైనారు. నాలుగు విడతల లోక్ సభ సభ్యుడిగానూ, అయిదు సార్లు రాజ్యసభ సభ్యుడుగానూ పని చేశారు. గుజరాత్ లో బరూచ్ జిల్లాకు చెందిన పటేల్ ను రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉండగా 1985లో పార్లమెంటరీ కార్యదర్శిగా నియమించారు. అప్పటి నుంచి ఆయన కాంగ్రెస్ లో వివిధ హోదాలలో అహరహం పరిశ్రమించారు. రాజీవ్ హత్య అనంతరం సోనియాగాంధీకి ఆత్మీయ సలహాదారుగా, ట్రబుల్ షూటర్ గా, పార్టీ కోశాధికారిగా పని చేశారు. కాంగ్రెస్ పార్టీతో ఇతర పార్టీలకు సత్సంబంధాలు నెలకొల్పడంలో, కూటములు కట్టడంలో సిద్ధహస్తుడుగా పేరు తెచ్చుకున్నారు.
అహ్మద్ పటేల్ కుమారుడు ఫైజల్ పటేల్ తండ్రి మరణవార్తను ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ సంతాపం తెలిపే సమయంలో కోవిద్ నిబంధనలు పాటించవలసిందిగా తన తండ్రి అభిమానులకు విజ్ఞప్తి చేశారు. కోవిద్ లక్షణాల కనిపించగానే గురుగ్రాంలోని మెదాంత ఆస్పత్రిలో చేర్పించామనీ, కోవిద్ తాలూకు ఇతర సమస్యలు తలెత్తడంతో బుధవారం తెల్లవారుజామున గం. 3.30లకు తుది శ్వాస వదిలారనీ ఆయన తెలియజేశారు.