* బిజెపి ఫిరాయింపులను ప్రోత్సహించవద్దు
* ద్విపార్టీ విధానం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాణం
* సోనియాకు వ్యతిరేకంగా 23 మంది నాయకులు
దేశంలో ఇపుడు కాంగ్రెస్ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది. ఒకప్పుడు ఇందిరా గాంధీ ఉన్నపుడు కాంగ్రెస్ లో భారీ ప్రకంపనలు వచ్చాయి. అప్పటి దిగ్గజాలు ఇందిరా గాంధీ ని వ్యతిరేకించి కాంగ్రెస్ ను చీల్చినా ఏకంగా ఇందిరా కాంగ్రెస్ ను స్థాపించి సరికొత్త హస్తం గుర్తుతో ఇండిరాగాంధీ మెజారిటీ రాష్ట్రాల్లో అధికారాన్ని హస్తగతం చేసుకుంది. తరువాత రాజీవ్ గాంధీ కూడా తన పరిపాలన చాతుర్యం తో కాంగ్రెస్ లో జవసత్వాలు నింపగాలిగాడు.
పీవీ తర్వాత కాంగ్రెస్ పేలవం
పీవీ గారి హయం తర్వాత కాంగ్రెస్ కుక్కలు చింపిన విస్తరి అయింది. నెహ్రూ వారసత్వ నీడ పడకుండా ఆయన కొంత కాలం పార్టీని నడిపించగలిగాడు. ఇక సోనియా, రాహుల్ , ప్రియాంక మునిగిపోతున్న కాంగ్రెస్ నౌకను ఒడ్డుకు చేర్చాలని ఎంతగా ప్రయత్నిస్తున్న నీళ్లలో దూకి గట్టుకు చేరుతున్న వారు ఒకరైతే, నీళ్లలో దూకి చచ్చే వారు మరొకరు. ఏకంగా మరో రక్షణ నౌక లోకి దూకుతున్న వారు మరికొందరు. ఇలా ఫిరాయింపులతో బలహీనపడిన కాంగ్రెస్ లో జవాసత్వాలు నింపలేక అవస్థలు పడుతూ ఆసుపత్రి పాలవుతున్న సోనియా కూడా కాంగ్రెస్ పార్టీని కాపాడలేక పోతున్నారు.
Also Read : బీజేపీలోకి మెట్రో శ్రీధరన్
విభజనలు, తర్జనభర్జనలు
వృద్ధ నాయకుల మాట వినని యువతరం రాహుల్ పంచన చేరితే సీనియర్లు కూడా రాహుల్ మాట వినకుండా తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్న చందంగా వ్యవహరించడంతో కాంగ్రెస్ లో ఎన్నో విభజనలు, తర్జనభర్జనలు జరుగుతూనే ఉన్నాయి. ఒక దశలో రాహుల్ అస్త్ర సన్యాసం చేసి విదేశాలకు చెక్కేశారు. ఇంత భారీ ప్రకంపనలు కాంగ్రెస్ చరిత్రలో ఏనాడు జరగలేదు. ఇక మాతృ సంస్థను వీడి ఎన్ని కాంగ్రెస్ లు ఉద్భవించినా అవి కూడా వ్యక్తి ఆరాధన మూసలో రాష్ట్రాల్లో కొంత ఉనికిని చాటు కుంటున్నాయి తప్ప దేశ రాజకీయ వ్యవస్థపైన తమ ప్రభావం వేయలేకపోతున్నాయి.
ప్రియాంక వచ్చినా ఫలితం ఉండదు
ప్రియాంకా వచ్చినా, ప్రియమణులు వచ్చినా దేశ రాజకీయ చిత్రంలో కాంగ్రెస్ ఇక పూర్వ వైభవం చూపడం కష్టమే. సోనియా గాంధీని దేశంలో ప్రముఖులుగా భావించే 23 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. విదేశీ వనితగా ముద్ర వేసి ఆమెను కాంగ్రెస్ పార్టీలోనే వేరు చేసేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇటీవల సీనియర్ నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. కొనసాగుతున్న రైతుల ఆందోళనలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై పార్టీ వ్యూహాన్ని రూపొందించడం ఎజెండాలో భాగంగా ఆమె జరిపిన సమావేశంలో పెద్దగా స్పందన రాలేదు.
Also Read : ఆనందం ఆరోగ్యానికి దివ్య ఔషధం
ఆ అయిదుగురూ తిరుగుబాటు నాయకులు
గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, శశి థరూర్ వంటి తిరుగుబాటు నాయకులను సమావేశానికి ఆహ్వానించి సోనియా గాంధీ కాంగ్రెస్ లో అసమ్మతి లేదని చెప్పే ప్రయత్నం చేశారు…దేశంలో జరుగుతున్న ఎన్నికల్లో వరుస ఓటములు గాంధీ కుటుంబం వల్లే కొనసాగుతున్నాయని అసమ్మతి వాదులు దండోరా వేస్తున్నారు. ఇటీవలి ఎన్నికల తిరోగమనాల స్ట్రింగ్ గాంధీలను వెనుకకు నెట్టివేసింది.
అవమానకరమైన ఓటములు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుండి కీలక రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు, ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ కు అవమానకరమైన ఓటములు సంభవించాయి, ఇక్కడ కాంగ్రెస్ పాలిత రాజస్థాన్లో ఓటమితో పాటు పార్టీ తిరోగమన దశ వైపు మరిలింది. అట్టడుగు కాంగ్రెస్ కార్యకర్తల చైతన్యం చేయడంలో అగ్ర నాయకత్వం ఘోరంగా విఫలమైంది. ఏమైనా ఆశజనకంగా ఉన్న రాష్ట్రం పంజాబ్. అది కూడా కెప్టెన్ అమరీందర్ గ్ సామర్థ్యం వల్ల పంజాబ్ లో కాంగ్రెస్ బలంగా ఉంది. వివిధ రాష్ట్ర నాయకులకు దిశానిర్దేశం చేయడంలో గాంధీ కుటుంబం ప్రదర్శిస్తున్న నిరాసక్త వైఖరి వల్ల తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నది. తిరుగుబాటు నాయకులను ఆహ్వానించడం ద్వారా, గాంధీ కుటుంబం తన విధేయులను గౌరవిస్తోందనీ, సీనియారిటీని గౌరవిస్తుందనీ ఒక సందేశాన్ని పంపాలని సోనియా గాంధీ భావించారు. ఈ సమావేశం ద్వారా అసమ్మతివాదులను బుజ్జగించే ప్రయత్నం చేశారు.
Also Read : ఆందోళన కలిగిస్తున్న నేరం నేపథ్యం
జీ-23 దగ్గజాలు
‘గ్రూప్ ఆఫ్ 23’ లేదా ‘జి 23’ గా పిలువబడే కాంగ్రెస్ దిగ్గజాలు గాంధీ కుటుంబం పై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. అంతర్గత ప్రజాస్వామ్యం కోరుతూ ఆ నాయకులు ఒక లేఖను సోనియాకు పంపి ప్రకంపనలు సృష్టించారు. ఆ బృందంలో సోనియాకు కంటికి నిద్ర లేకుండా చేస్తున్నది ఐదుగురు. గులాంనబీ ఆజాద్, ఆనంద్ శర్మ, కపిల్ శిబ్బల్, మనీష్ తివారీ, శశి థరూర్ ఇప్పుడు సోనియా ఉనికిని సహించడం లేదు. ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో సీనియర్ నాయకులను ఒక వేదికపై తెచ్చి బిజెపికి ఒక సందేశం ఇద్దామని సోనియా భావించారు. సోనియా నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకుంటారనే నిందను మోపుతూ, కాంగ్రెస్ “గాంధీ” ల పార్టీగా ఉండడానికి సీనియర్లు ససేమిరా అంటున్నారు. ప్రజాస్వామ్య పార్టీలో ఏకాభిప్రాయ సాధన ఉందని చెప్పే ప్రయత్నం సోనియా చేస్తున్నారు.
సంస్థాగత ఎన్నికలకు సన్నాహం
ఈ సమావేశం ద్వారా రాబోయే సంస్థాగత ఎన్నికలకు ఒక దిశానిర్దేశం చేయాలని కూడా ఆమె భావిస్తున్నారు. ఈ సమావేశం ద్వారా రాబోయే సంస్థాగత ఎన్నికలకు జవసత్వాలు నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఆగస్టులో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సందర్భంగా ఆరు నెలల వ్యవధిలో అంతర్గత ఎన్నికలు నిర్వహిస్తామని ఆమె ఇచ్చిన హామీని గౌరవించమని సీనియర్ లకు సోనియా గాంధీ మొండిగా జవాబిచ్చారని వినికిడి. కొత్త కాంగ్రెస్ అధ్యక్షుడిని ఎన్నుకోవటానికి ప్లీనరీ సమావేశానికి తేదీలను కాంగ్రెస్ త్వరలో ప్రకటించనుంది. రాహుల్ గాంధీ 2021 మొదటి అర్ధభాగంలో జరగబోయే ఐదు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో పార్టీని నడిపించడానికి వస్తారని పరోక్షంగా సోనియా సీనియర్లకు చెప్పారట!
Also Read : రాజకీయ పునరావాస కేంద్రాలుగా శాసన మండళ్లు
మోదీ, అమిత్ షా జోరు తగ్గాలి
నూటాముప్పయ్ ఆరు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు భారీ కుదుపు ఎదుర్కొంటుంది. నిజానికి బిజెపి ఇప్పుడు సమన్వయం పాటించాలి. ప్రజా స్వామ్యం బ్రతకాలి అంటే ద్విపక్ష విధానం ఉండాలి. లేదంటే బీజేపీకే నష్టం. బెంగాల్ లో బిజెపి లేదా ఇతర రాష్ట్రాల్లో ఫిరాయింపులను బిజెపి ప్రోత్సాహం ఇవ్వడం వల్ల వ్యక్తులు పార్టీ మార్చి కండువాలు కప్పుకోవచ్చు గానీ ప్రజా స్వామ్యం ప్రమాదంలో పడుతోందనే సత్యాన్ని మోడీ టీం గుర్తించాలి. అమిత్ షా దూకుడుకు కాస్త కళ్లెం వేయాలి. ఆయన వ్యక్తులు ముఖ్యం అనుకుంటున్నారు. కానీ వీరే కాంగ్రెస్ సంస్కృతి నుండి వచ్చే వారనే సత్యాన్ని షా మరవద్దు. తెలుగులో సుమతీ శతకం పద్యం గుర్తుకు తెచ్చుకోవాలి! ఇప్పుడు బిజెపి పరిస్థితికి సరిగ్గా సరిపోతుంది..
ఎప్పుడు సంపద కలిగిన
అప్పుడె బంధువులు వత్తురది యెట్లన్నన్
దెప్పలుగ జెరువునిండిన
గప్పలు పదివేలు చేరు గదరా సుమతీ!
తాత్పర్యం: చెరువు నిండా నీరు చేరగానే వేలకొద్దీ కప్పలు అందులో చేరునట్లే సంపద కలిగిన వారి వద్దకే బంధువులు ఎక్కువగా జేరుకొందురు.
Also Read : స్త్రీవాదం ఇంట్లోనే.. బయట ప్రపంచంలో కీలు బొమ్మలు