హైదరాబాద్ : తెలంగాణ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడుగా టి. జీవన్ రెడ్డిని నియమించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానవర్గం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై మంగళవారంనాడు ఉదయం పదకొండు గంటల ప్రాంతాల్లో పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఖరారు నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. జీవన్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడుగా, రేవంత్ రెడ్డిని పీసీసీ ప్రచారకమిటీ అధ్యక్షుడుగా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయం జీవన్ రెడ్డి కానీ, ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి కానీ ధ్రువీకరించడం లేదు.
రేవంత్ రెడ్డికి ప్రచార బాధ్యతలు
రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించాలని పార్టీలో అత్యధికులు కోరుతున్నారు. కానీ కొందరు సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డి పేరును గట్టిగా ప్రతిఘటిస్తున్నారు. పైగా ‘నోటుకు ఓటు’ కేసు విచారణ వేగవంతం కావడంతో పీసీసీ అధ్యక్షుడిగా కాకుండా మరో విధంగా పార్టీకి రేవంత్ రెడ్డి సేవలు వినియోగించుకోవాలని తెలంగాణలో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ఏఐసీసీ ప్రతినిధి మణిక్కం టాగూర్ సలహా చెప్పినట్టు తెలుస్తున్నది. మంచి వక్తగా, చురుకైన నాయకుడిగా పేరు తెచ్చుకున్న రేవంత్ ను ప్రచారకమిటీకి అధ్యక్షుడిగా నియమించాలనే సిఫార్సు సోనియా పరిశీలనలో ఉంది.
Also Read : రేవంత్ చుట్టూ తిరుగుతున్న కాంగ్రెస్ రాజకీయం
దిగువ స్థాయి నుంచి ఎదిగి వచ్చిన ప్రజానాయకుడు
తాటిపర్తి జీవన్ రెడ్డి కరీంనగర్ నుండి శాసనమండలి కి ఎన్నికైనారు. పంచాయతీ సర్పంచ్ పదవి నుంచి రాజకీయాలలో ఎదిగిన నాయకుడు. ఆ తర్వాత సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. అనంతరం ఎంఎల్ఏగా ఎన్నికైనారు. ప్రజలతో మంచి సంబంధాలు కలిగిన నాయకుడిగా ఆయనకు పేరున్నది. జగిత్యాలనుంచి ఆరు విడతల శాసనసభ్యుడిగా జీవన్ రెడ్డి గెలుపొందారు. తెలుగుదేశం నాయకుడు ఎల్ రమణ చేతిలో 2009లో మాత్రం ఓడిపోయారు. ప్రస్తుతం కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఉపనాయకుడిగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్)పైన కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా రెండు సార్లు – 2006లో, 2008లో పోటీ చేశారు. 2008లో కేవలం 14 వేల తేడాతో ఓడిపోయారు. 2007 నుంచి 2009 వరకూ వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. 2009లో అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఎన్నికైనారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది జీవన్ రెడ్డి సీటైన జగిత్యాల ఒక్కటే.
Also Read : ఓటుకు నోటు కేసు : స్టీవెన్సన్ కి మొత్తం 3 కోట్లు ఇస్తామని చంద్రబాబు చెప్పారు: మత్తయ్య
న్యాయశాస్త్రంలో పట్టభద్రుడు
జీవన్ రెడ్డి కరీంనగర్ మల్టీపర్పస్ స్కూల్ లో 12వ తరగతి వరకూ చదివారు. నిజాంకాలేజిలో బేఏ చదివారు. ఉస్మానియా లా కాలేజీలో ఎల్ఎల్ బీ చదివారు. 1983లో మొట్టమొదటిసారిగా జగిత్యాల నుంచి టీడీపీ టిక్కెట్టుపైన గెలిచారు. ఎన్ టి రామారావు మంత్రివర్గంలో ఎక్సైజ్ మంత్రిగా పనిచేశారు. ఎన్ టి రామారావుతో విభేదాలు వచ్చిన కారణంగా 1984లోనే రాజీవ్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరారు.
మంచి నిర్ణయం
టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించడానికి పూర్తి అర్హతలు జీవన్ రెడ్డికి ఉన్నాయి. క్షేత్రస్థాయి పరిజ్ఞానం కలిగిన సీనియర్ రాజకీయవేత్తగా, అవినీతికి ఆమడ దూరంలో ఉండే విద్యాధికుడిగా, ప్రజలతో మమేకమయ్యే లక్షణం కలిగిన నేతగా జీవన్ రెడ్డికి మంచి పేరుప్రఖ్యాతులు ఉన్నాయి. ఉన్న పరిస్థితులలో కాంగ్రెస్ అధిష్ఠానవర్గం సముచితమైన నిర్ణయం తీసుకున్నదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
Also Read : కమలంగూటికి కోమటిరెడ్డి