Sunday, December 22, 2024

ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌దే హవా

పీపుల్స్ పల్స్ సర్వే

          ఛత్తీస్‌గఢ్‌లో ముఖ్యమంత్రి భూపేష్‌ భఘేల్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం వరుసగా రెండోసారి  అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం పనితీరుతో రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉండడంతో పాటు భూపేష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్మాణాత్మక పాత్ర పోషించడంలో బీజేపీ విఫలమవడంతో రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్‌ సర్కారు ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది.

          బీజేపీలో అంతర్గత కలహాలు, భూపేష్‌కు ప్రత్యామ్నాయంగా పార్టీ నాయకుడిని తెరమీదకు తేవడంలో కేంద్ర బీజేపీ విఫలమవడంతోపాటు రాష్ట్ర పార్టీపై అధిష్టానానికి  పట్టు సడలడం వంటి కారణాలతో రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ ఆశలు అడియాశలవుతున్నాయి. అయితే 2018 ఎన్నికలతో పోలిస్తే బీజేపీ రెండింతలు స్థానాలు అధికంగా సాధించవచ్చు.

          ఛత్తీస్‌గఢ్‌లో పీపుల్స్‌ పల్స్‌ సంస్థ నిర్వహించిన ‘ప్రీ పోల్‌ సర్వే’లో కాంగ్రెస్‌ 55`60, బీజేపీ 28`34, బీఎస్పీ, ఇండిపెండెంట్లు రెండు స్థానాలు గెలిచే అవకాశాలున్నాయని తేలింది. 90 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో మ్యాజిక్‌ ఫిగర్‌ 46. రాబోయే ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్‌, బీజేపీ మధ్య ఉన్నా కాంగ్రెస్‌ సొంతంగా మెజార్టీ సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

          కాంగ్రెస్‌, బీజేపీలే కాకుండా గోండ్‌వాన్‌ గణతంత్ర పరిషత్‌, సర్వ్‌ ఆదివాసీ సమాజ్‌ మద్దతిస్తున్న హమారా రాజ్‌ పార్టీ, ఛత్తీస్‌గఢ్‌ క్రాంతి సేనా పార్టీలు కూడా ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. అయితే వాటి ప్రభావం తక్కువగానే ఉంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి అజిత్‌జోగి స్థాపించిన జనతా కాంగ్రెస్‌ ఛత్తీస్‌గఢ్‌ (జోగీ) పార్టీ బీఎస్పీతో కలిసి 2018 ఎన్నికల్లో పోటీ చేయగా, ఆ కూటమి 7 స్థానాలు (జేసీసీ 5, బీఎస్పీ 2) పొందింది. రాబోయే ఎన్నికల్లో  బీఎస్పీ 0 – 2 సీట్లు పొందవచ్చు. జేసీసీ, ఆప్‌ ఒక్క స్థానంలో కూడా గెలిచే అవకాశాలు లేవు.

          2018లో 43% ఓట్లు పొందిన కాంగ్రెస్‌ ఈసారి 47%, 33% ఓట్లు పొందిన బీజేపీ ఈసారి 42% పొందే అవకాశాలున్నాయని సర్వేలో తేలింది. బీజేపీ 2018 కంటే 9% ఓట్లు అధికంగా పొందనుంది. ఏ సర్వేలో అయినా మూడు శాతం మార్జిన్‌ వ్యత్యాసం ఉండే అవకాశాలుంటాయనేది ఇక్కడ గమనార్హం.

           పీపుల్స్‌ పల్స్‌ బృందం జూన్‌ 2023లో రాష్ట్రంలో నిర్వహించిన సర్వేలో వెలువడిన ప్రభుత్వ అనుకూలత ఫలితాలే ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, సామాజిక సమీకరణాలు, ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం, పార్టీ పనితీరు మొదలైన అంశాలలో కాంగ్రెస్‌ ఇతర పార్టీల కంటే ముందంజలో ఉండడంతో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ సరైన పాత్ర పోషించడంలో విఫలం చెందిందని సర్వేలో స్పష్టమైంది.

          భౌగోళికంగా ఛత్తీస్‌గఢ్‌ ఉత్తర, మధ్య, దక్షిణ ప్రాంతాలుగా ఉంది. ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ను సర్గుజ డివిజన్‌గా కూడా పిలుస్తారు.   బార్లాపూర్‌, సూరజ్‌పూర్‌, మానేంద్రఘర్‌`చిర్మిరి`భరత్‌పూర్‌, కోరియా, కోర్బా, రాయగఢ్‌, సర్గుజ్‌ జిల్లాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఈ డివిజన్‌లో ఎస్టీ, ఓబీసీ ఓటర్లు అధికం. ఎస్టీలలో కాన్వర్‌, ఖైర్వార్‌, కోర్బా, గోండ్‌, ఓరాన్‌, ఓబీసీలలో సాహు, రౌత్‌, రాజ్వాడే, ఎస్సీలలో హరిజనులు ఈ ప్రాంతంలో కీలకం. ఇక్కడ 23 స్థానాలుండగా 2018లో కాంగ్రెస్‌ మెరుగైన ఫలితాలు సాధించింది. కాంగ్రెస్‌ ఉప ముఖ్యమంత్రి  సింగ్‌దేవ్, రాష్ట్ర మంత్రి జైసింగ్‌ అగర్వాల్‌, బీజేపీ ఎంపీలు రామ్‌విచార్‌ నేతం, గోమతి సాయి, రేణుకా సింగ్‌ ఇక్కడ ప్రముఖ నేతలు. 2018లో సింగ్‌దేవ్ కాబోయే సీఎం అనే ప్రచారంతో కాంగ్రెస్‌ ఇక్కడ మెరుగైన ఫలితాలు పొందింది. ఇక్కడ ప్రస్తుత రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే సింగ్‌దేవ్ ప్రభావం తగ్గింది. ముగ్గురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు పార్టీ టికెట్‌ తిరస్కరించడం కాంగ్రెస్‌కు ఇబ్బందులు కలిగిస్తోంది. మరోవైపు బీజేపీ రేణుకా సింగ్‌, గోమతి సాయి, రామ్‌విచార్‌ నేతం ముగ్గురు ఎంపీలను అసెంబ్లీ బరిలోకి దింపడం వల్ల రాబోయే ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలున్నాయి. సుర్గుజ్‌లోని 14 స్థానాల్లో గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా పొందని బీజేపీ ఈ ఎన్నికల్లో 4 నుండి 7 సీట్లు పొందే అవకాశాలున్నాయి.

          మధ్య ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతంలో రాయ్‌పూర్‌, బిలాస్‌పూర్‌, దుర్గ్‌ వంటి ప్రధాన పట్టణ ప్రాంతాలున్నాయి. ఈ డివిజన్‌లో అధిక జనాభాతో 55 అసెంబ్లీ స్థానాలున్నాయి. రాష్ట్రంలోని దాదాపు అన్ని ఎస్సీ రిజర్వ్ డ్‌ స్థానాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఎస్టీలలో గోండ్లు, కాన్వర్‌, ఓబీసీలో కుర్మి, మారర్‌, కాలర్‌, సాహు, దేవాంగన్‌, యాదవ్‌, ఎస్సీలలో సాత్నామి, హరిజనులు ప్రధానంగా ఉన్నారు. సింధి, రాజ్‌పుత్‌, పంజాబీ, బ్రాహ్మిణ్‌, ముస్లిం ఓటర్ల ప్రభావం కూడా ఉంది.  ముఖ్యమంత్రి భూపేష్‌ భఘేల్‌, మాజీ ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అరుణ్‌ సావో వంటి ప్రధాన నేతలు ఈ ప్రాంతానికి చెందిన వారే.

          ఇక్కడ 2018లో విఫలమైన బీజేపీ ఈ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు పొందే అవకాశాలున్నాయి. జేసీసీ బలహీనపడడంతో ఆ ఓట్లు కాంగ్రెస్‌కు మళ్లే అవకాశాలున్నాయి. మరోవైపు ప్రభుత్వ వ్యవసాయ అనుకూల నిర్ణయాలు కాంగ్రెస్‌కు లబ్ది చేకూర్చవచ్చు. పనితీరు సరిగ్గాలేని ఎమ్మెల్యేలకు కాంగ్రెస్‌ టికెట్‌ నిరాకరించింది. ఈ ప్రాంతంలోని ముంగేలి, బాలోడా బజార్‌, జాంగీర్‌ చాంపా జిల్లాల్లో బీజేపీకి, మిగతా జిల్లాలో కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయి. బీఎస్పీకి ఇక్కడ ఒక స్థానం రావచ్చని సర్వేలో వెల్లడయ్యింది.

          ఎస్టీ సామాజిక వర్గం ఆధిపత్యం ఉన్న  ఛత్తీస్‌గఢ్‌ దక్షిణ ప్రాంతాన్ని బస్తర్‌ అని కూడా పిలుస్తారు. ఇక్కడ 12 స్థానాల్లో 11 ఎస్టీ రిజర్వ్‌డ్‌గా ఉన్నాయి. ఇక్కడ ఒక్క జగదల్‌పూర్‌ మాత్రమే మున్సిపల్‌ కార్పొరేషన్‌గా ఉంది. బస్తర్‌, దంతేవాడ, సుక్మ, కాన్కేర్‌, కోండాగావ్‌ జిల్లాలున్నాయి. ఇది మావోయిస్ట్‌ ప్రభావిత ప్రాంతం. గతంలో ఇది  బీజేపీకి పట్టున్న ప్రాంతం. అయితే 2018లో 11 స్థానాలు గెలిచిన కాంగ్రెస్‌ అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో మరోస్థానం గెలిచి మొత్తం 12 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది.

          ఎస్టీలలో గోండ్‌, మారియా, మురియా, భాత్ర హల్బీట్‌ సామాజిక వర్గాల ప్రభావం ఉంది. ఇక్కడ ఓబీసీలతో పాటు ఇతర సామాజిక వర్గాల ప్రభావం తక్కువ. కాంగ్రెస్‌ నుండి ఎక్సైజ్‌ మంత్రి కవాసీ లాక్మా, డిప్యూటీ స్పీకర్‌ సంత్‌రామ్‌ నేతం, పీసీసీ అధ్యక్షులు మోహన్‌ మార్కమ్‌, లాకేశ్వర్‌ భాగేల్‌, ఎంపీ దిపాక్‌ బాయిక్‌, బీజేపీ నుండి కేదర్‌ కష్యప్‌, మాజీ మంత్రి లతా ఉసేంది, మాజీ ఎంపీ దినేష్‌ కశ్యప్‌ ఈ ప్రాంత ప్రముఖ నేతలు. సుక్మా జిల్లాలో  సీపీఐ ప్రభావం కొంత ఉంది. సర్వ్‌ ఆదివాసీ సమాజ్‌ ప్రభావం కూడా ఈ ప్రాంతంలో కనపడుతోంది.

          ఈ ప్రాంతంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితిని పరిశీలిస్తే కాంగ్రెస్‌ గతంలో కంటే కొన్ని స్థానాలు కోల్పోయినా అధిక స్థానాలు మాత్రం పొందవచ్చు. పంటలకు మద్దతు ధర, పేదలకు పట్టా భూముల పంపిణీ కాంగ్రెస్‌కు లబ్ది చేకూరుస్తున్నాయి.2018లో ఒక్క సీటు సాధించిన బీజేపీ ఈ ఎన్నికల్లో 3 నుండి 4 స్థానాలు పొందే అవకాశాలున్నాయని పీపుల్స్‌ పల్స్‌ సర్వేలో తేలింది.

వివిధ సామాజిక వర్గాల ప్రభావం

          రాయ్‌పూర్‌, బిలాస్‌పూర్‌, జగదల్‌పూర్‌, అంబిక్‌పూర్‌, కోబ్రా, రాయిగఢ్‌ మొదలగు నగరాల్లో రాజపూత్‌, బ్రాహ్మిణ్‌, సింధీ, పంజాబీ, మార్వాడీ, బనియా సామాజిక వర్గాల ప్రభావం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఓడియా, బెంగాలీల ప్రభావం కూడా ఉంది. ఈ సామాజిక వర్గాలలో బీజేపీ పట్ల కొంత మొగ్గు కనిపిస్తోంది.

          రాష్ట్ర వ్యాప్తంగా ఓబీసీల ఓటింగ్‌ బ్యాంక్‌ అధికం. ఓబీసీలలో అధికంగా ఉండే సాహు సామాజిక వర్గం  బీజేపీ పట్ల కొంత మొగ్గు చూపిస్తోంది. ఓబీసీలో రెండో పెద్ద సామాజికవర్గం కుర్మీలది. వీరు సెంట్రల్‌ రీజియన్‌లో అధికంగా ఉన్నారు. ముఖ్యమంత్రి భూపేష్‌ కుర్మీ కావడంతో వీరు కాంగ్రెస్‌ వైపు ఉన్నారు. చేనేతకు చెందిన పానికాస్‌ వర్గం కాంగ్రెస్‌ వైపు ఉంది. చిన్న తరహా సాగు చేసుకునే అఘరియా వర్గం కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంది. వ్యవసాయ రంగానికి చెందిన మారర్‌ సామాజిక వర్గం కాంగ్రెస్‌ పట్ల అనుకూలంగా ఉంది. సెంట్రల్‌ ప్రాంతంలో అధికంగా ఉండే కాలర్‌ సామాజిక వర్గం బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య చీలిపోయింది.  దేవాంగన్‌ సామాజిక వర్గంతోపాటు మధ్య ఛత్తీస్‌గఢ్‌లో ప్రాబల్యం ఉన్న యాదవ్‌ సామాజిక వర్గం కూడా బీజేపీకి అనుకూలంగా ఉంది.

          ఎస్సీలు ఛత్తీస్‌గఢ్‌ మధ్య ప్రాంతంలో అధికంగా ఉన్నారు. ఎస్సీల్లో అధికంగా ఉన్న సాతనమీ, హరిజన, మహార్‌ సామాజిక వర్గాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయి.

          ఎస్టీల ప్రభావం ఉత్తర, దక్షిణ ప్రాంతాలలో ఉంది. ఎస్టీల్లో అధికంగా ఉండే గోండులు కాంగ్రెస్‌, బీజేపీ, సర్వ్‌ ఆదివాసీ పార్టీల మధ్య చీలిపోయారు. ఎస్టీలలో రెండో పెద్ద సామాజిక వర్గమైన కన్వార్‌ బీజేపీకి, ఉత్తర ప్రాంతంలో ఉన్న ఖైర్వార్‌, ఓరాన్‌ సామాజిక వర్గాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయి. పహాడి కోబ్ర సామాజిక వర్గం బీజేపీకి, హల్బా సామాజిక వర్గం కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయి. మరియా`మురియా, భాట్రా సామాజిక వర్గాలు కాంగ్రెస్‌, బీజేపీ మధ్య చీలి ఉన్నాయి. రాష్ట్ర జనాభాలో రెండు శాతానికి పైగా ఉన్న ముస్లింలు, దాదాపు రెండు శాతం ఉన్న క్రిస్టియన్లు కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతున్నారు.

 ముఖ్యమంత్రికి ప్రజాదరణ

           ముఖ్యమంత్రి భూపేష్‌  సంతృప్తికరమైన పనితీరుతోపాటు ఛత్తీస్‌గఢ్‌ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తుండడంతో జనాకర్షణ నేతగా ఎదిగారు. కోవిడ్‌ సమయంలో మినహాయించి మిగతా కాలంలో ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారు. మరోవైపు పార్టీలో ఆయన ప్రత్యర్థి సింగ్‌దేవ్ సొంత ప్రాంతంలోనే బలహీనపడడం కూడా భూపేష్‌కు కలిసివస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయనకు సరితూగే మరో నాయకులు ఎవరూ లేరని పీపుల్స్‌ పల్స్‌ సర్వేలో ప్రజలు అభిప్రాయపడ్డారు. 

          ముఖ్యమంత్రి భూపేశ్‌కు పోటీగా బీజేపీలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఉన్నారా అని పీపుల్స్‌పల్స్‌ ప్రజలను ప్రశ్నించగా స్పందనే రాలేదు. 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న రమణ్‌సింగ్‌ను భూపేష్‌కు సరైన ప్రత్యామ్నాయంగా ప్రజలు భావించకపోవడం గమనార్హం.

ఎన్నికల్లో ప్రభావిత అంశాలు

          2018లో రైతులకు రుణమాఫీతో పాటు ధాన్యం సేకరణ, మద్దతు ధరపై ఇచ్చిన హామీని భూపేష్‌ ప్రభుత్వం నిలబెట్టుకుంది. వరికి మద్దతు ధరను క్వింటాల్‌కు 3200 రూపాయలుగా ప్రకటించింది. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజనపై వస్తున్న విమర్శలకు దీటుగా 7 లక్షల ఉచిత గృహ నిర్మాణాలు చేపడుతామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది.  ఎల్పీజీ సిలిండర్లపై సబ్సిడీ, శ్రామికుల సంక్షేమం కోసం ప్రతి సంవత్సరం ఇచ్చే 7000 రూపాయలను 10000కు పెంచుతామని ప్రకటించింది. కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన ఆత్మానంద్‌ స్కూల్స్‌ విజయవంతం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలను ఈ స్థాయికి తీసుకొస్తామని ప్రకటించింది. ఈ పథకాలు, వరాలు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అనుకూలంగా మారనున్నాయని సర్వేలో వెల్లడైంది.

          ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద చేపట్టిన పనులకు సంబంధించి కేంద్రం నిధులు ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను చెల్లించకపోవడంతో పనులు ఆగిపోయాయనే ఆరోపణలు రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నాయి.  దీనిపై బీజేపీ ‘మోర్‌ ఆవాజ్‌ మోర్‌ అధికార్‌’ పేరిట నిరసన కార్యక్రమాలు చేపట్టి 2023 మార్చిలో బడ్జెట్‌ సమావేశాల్లో అసెంబ్లీని ముట్టడిరచింది. బీజేపీ పరివర్తన యాత్రలో, ఎన్నికల ప్రచారంలో ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తోంది.  మైనింగ్‌ రంగంలో, పీఎస్‌సీ నియామకాల్లో, మద్యం అమ్మకాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతికి పాల్పడిరదని ఆరోపిస్తూ బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తోంది. కాంగ్రెస్‌, బీజేపీ, జేసీసీ పార్టీలు వ్యతిరేకత ఉన్న సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లను నిరాకరించాయి. దీంతో ఈ పార్టీలకు రెబల్‌ అభ్యర్థుల బెడద తప్పలేదు. 

          బస్తర్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో క్రిస్టియన్‌ మిషనరీలు డబ్బు ప్రలోభాలతో గిరిజనులలో మత మార్పిడిని ప్రోత్సాహిస్తున్నాయని బీజేపీ విమర్శిస్తోంది. ఈ పరిణామాలు బీజేపీని సమర్థించే గిరిజనులు, క్రిస్టియన్లుగా మారిన గిరిజనుల మధ్య ఘర్షణలకు దారితీశాయి. బీమేతెరా, కావార్థా జిల్లాల్లో కూడా హిందూ ముస్లిం మతకలహాలు జరిగాయి.  కావార్దాలో బజరంగ్‌ దళ్‌ నేత విజయ్‌ శర్మకు, సాజాలో ఈశ్వర్‌సాహు (మతకలహాలలో మృతి చెందిన సాహు తండ్రి)కు బీజేపీ అసెంబ్లీ టికెట్లు ఇచ్చింది. ఈ ప్రభావం అరడజను స్థానాలకు మించి ఉండక పోవచ్చు.           హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే పీపుల్స్‌పల్స్ సంస్థ ఛత్తీస్‌గఢ్‌లో 2023 అక్టోబర్‌ 15 నుండి 31వ తేదీ వరకు మొత్తం 90 నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించింది. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో నాలుగు పోలింగ్‌ స్టేషన్‌లను ఎంపిక చేసుకొని, ఓటర్లను కలుసుకొని ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ నుండి 15`20 శాంపిల్స్‌ను శాస్త్రీయ పద్ధతిలో  సేకరించింది. కులం, ప్రాంతం, స్త్రీలు, పురుషులు, అన్ని వయసుల వారికి సమప్రాధాన్యతిస్తూ మొత్తం 6120 శాంపిల్స్‌ సేకరించి సర్వే నిర్వహించింది. పీపుల్స్‌ పల్స్‌ సర్వేలో డేటా విశ్లేషణకు ‘పొలిటికోస్‌’ బృందం సహాయసహకారాలు అందించింది. ఈ సర్వే నిర్వహించిన సమయానికి ప్రధాన పార్టీలు 90 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించినా రెండో దశ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి కాలేదు.

          ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేకపోవడంతోపాటు బీజేపీ నుండి సరైన ప్రత్యామ్నాయ నేతలు కూడా లేకపోవడంతో రాబోయే ఎన్నికల్లో మరోమారు విజయఢంకా మోగించి కాంగ్రెస్‌ అధికారం నిలుపుకునే అవకశాలు ఉన్నాయని పీపుల్స్‌పల్స్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడయ్యింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles