- పార్టీ మనుగడను కాపాడుకునేందుకు కాంగ్రెస్ యత్నాలు
- వామపక్షాలతో పొత్తుకు రంగం సిద్ధం
ఎన్నికల్లో వరుస ఓటములతో కుదేలవుతున్న కాంగ్రెస్ పార్టీ రాబోయే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి పోటీచేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ మేరకు బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదురి ట్విటర్ లో తెలిపారు. అధికార తృణమూల్ కాంగ్రెస్, దూకుడు మీదున్న బీజేపీని అడ్డుకునేందుకు కూటమిగా ఎన్నికల్లో పోటీ చేయాలని ఇరు పార్టీలు నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
మనుగడ కోసం పోరాటం
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షలు తమ మనుగడ కోసం పోరాడాల్సిన పరిస్థితి నెలకొంది. సీట్ల సర్దుబాటుపై ఇంకా చర్చలు జరపాల్సి ఉందని తెలిపారు. 2016 అసెంబ్లీ ఎన్నికల తరువాత కాంగ్రెస్ వామపక్షాల ఓట్ల శాతంలో భారీగా కోతపడింది. ఇరు పార్టీల ఓటర్లు తృణమూల్ వైపు మొగ్గుచూపినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అటు తర్వాత కాంగ్రెస్ వామపక్షాలు లోక్ సభ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడంతో భారీ నష్టాన్ని చవిచూశాయి.
తృణమూల్, బీజేపీలపై రంజన్ విమర్శలు
వాస్తవానికి బెంగాల్లో కాంగ్రెస్, వామపక్షాలు బలంగానే ఉన్నాయని, తృణమూల్, బీజేపీలది ప్రచార ఆర్భాటమేనని చౌదురి అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడలేని పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపాయని విమర్శించారు. ఇతర పార్టీల నేతలను ప్రలోభాలకు గురిచేసి పార్టీలో చేర్చుకుంటున్నాయని తృణమూల్, బీజేపీలపై రంజన్ చౌదురి విమర్శలు కురిపించారు.
ఇదీ చదవండి: తృణమూల్ కాంగ్రెస్ లో భారీ కుదుపు
2016 ఎన్నికల్లో కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు 294 నియోజకవర్గాల్లో పోటీ చేసి 38 శాతం ఓట్లతో 76 చోట్ల విజయం సాధించాయి. లెఫ్ట్ ఫ్రంట్ 26 శాతం ఓట్లు, కాంగ్రెస్ పార్టీ 12 శాతం ఓట్లతో 44 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. లెఫ్ట్ పార్టీలు 32 శాతం ఓట్లతో 26 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. ఆర్ఎస్పీ 3 చోట్ల, సీపీఐ ఒక్క స్థానం, ఫార్వార్డ్ బ్లాక్ రెండు చోట్ల విజయం సాధించాయి. తృణమూల్ కాంగ్రెస్ 44.9 శాతం ఓట్లతో 211 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో 10.16 శాతం ఓట్లతో 3 చోట్ల విజయం సాధించిన బీజేపీ 2019 లోక్ సభ ఎన్నికల నాటికి 40.64 శాతం ఓట్లతో 18 ఎంపీ స్థానాలలో పాగా వేసింది. తృణమూల్ కాంగ్రెస్ 43.69 శాతం ఓట్లతో 22 లోక్ సభ నియోజక వర్గాలలో విజయం సాధించింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో లెఫ్ట్ ఫ్రంట్ ఒక్క చోట కూడా విజయం సాధించలేకపోయింది. 6.34 శాతం ఓట్లతో 39 నియోజకవర్గాలలో డిపాజిట్లు కోల్పోయింది. కాంగ్రెస్ 2 చోట్ల విజయం సాధించి ఉనికిని కాపాడుకుంది.
ఇదీ చదవండి :చిక్కుల్లో మమత