హైదరాబాద్: ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారన్న సామెత సీఎం కేసీఆర్ గారికి సరిగ్గా వర్తించే సమయం సమీపించిందని కాంగ్రెస్ నాయకురాలు, సినీ నటి విజయశాంతి వ్యాఖ్యానించారు. ‘‘కాంగ్రెస్ నేతలు కొందరిని ప్రలోభపెట్టి, ఇంకొందరిని భయపెట్టి, ఒత్తిళ్ళతో ఎమ్మెల్యేలను పార్టీ మార్పించారు. కాంగ్రెస్‌ను బలహీనపరిచే ప్రక్రియ వల్ల ఇప్పుడు మరో జాతీయ పార్టీ బీజేపీ తెలంగాణలో సవాలు విసిరే స్థాయికి వచ్చింది. మరికొంత ముందుగానే మాణిక్యం టాగోర్ గారు రాష్ట్రానికి వచ్చి ఉంటే పరిస్థితులు మెరుగ్గా ఉండేవి కావచ్చు. ఇప్పుడిక కాలము, ప్రజలే నిర్ణయించాలి,’’ అంటూ విజయశాంతి అన్నారు.
విజయశాంతి ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి. కిషన్ రెడ్డితో భేటీ అయ్యారనీ, బీజేపీలో తిరిగి చేరడానికి సూత్రప్రాయంగా అంగీకారం కుదిరిందనీ వార్తలు వచ్చాయి. ఇందుకు అనుగుణంగానే ఆమె టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ స్థానాన్ని బీజేపీ ఆక్రమించినట్టు వ్యాఖ్యానించారు. ఆమె బీజేపీ ప్రవేశానికి రంగం సిధ్దమైనట్టు రాజకీయ పరిశీలకులు అంటున్నారు.