Sunday, December 22, 2024

కాంగ్రెస్ కు కాయకల్ప చికిత్స ఎప్పుడు?

దశాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ కాలపరీక్షలో నిలిచేనా? గెలిచేనా? అనే ప్రశ్నలు సర్వత్రా ఉత్పన్నమవుతున్నాయి. ప్రస్తుతం పార్టీకి పెద్దదిక్కులుగా ఉన్న సోనియాగాంధీ, రాహుల్ గాంధీ కాలయాపన చేస్తున్నారు తప్ప, పార్టీని నిలబెట్టడానికి పటిష్ఠమైన చర్యలు చేపట్టడం లేదు. ఇంతవరకూ సంస్థాగతమైన ఎన్నికలనే నిర్వహించలేదు. పార్టీ అధ్యక్షుడి ఎంపిక ఇంతవరకూ జరుగలేదు. రేపుమాపు అంటూ కాలక్షేపం చేస్తున్నారు. రాహుల్ గాంధీని అధ్యక్షుడుగా ఎంచుకుంటారని పలుమార్లు ప్రచారం చేశారు.

Also read: తెలంగాణలో మళ్ళీ లాక్ డౌన్

అనవసరమైన కాలయాపన

అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన వెంటనే చేస్తారంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి.తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరాజయాన్నే మూటగట్టుకుంది. ఆ పార్టీకి కంచుకోట వంటి రాష్ట్రాల్లోనూ అధికారాన్ని నిలబెట్టుకోలేక పోయింది. అస్సాంలో వరుసగా రెండవసారి కూడా బిజెపి చేతుల్లో ఓడిపోయి ఆ రాష్ట్రంలో పరపతిని కోల్పోయింది. పుదుచ్చేరిలో చేతులారా అధికారాన్ని పోగొట్టుకుంది. పశ్చిమ బెంగాల్ లో పార్టీ పూర్తిగా తుడుచుపెట్టుకు పోయింది. కేరళలో కాస్త పరువు నిలబెట్టుకుంది. తమిళనాడులో డిఎంకె దయాదాక్షిణ్యాలపై ఆధారపడి, 25సీట్లలో అభ్యర్థులను నిలబెట్టుకొనే అవకాశాన్ని పొంది, 17స్థానాల్లో గెలుపును నమోదు చేసుకుంది.

Also read: పాలస్తీనా – ఇజ్రాయిల్ ఘర్షణ

పార్టీ ప్రక్షాలన కోరుతూ లేఖాస్త్రం

పార్టీ ప్రక్షాళన దిశగా 23మంది సీనియర్లు సంధించిన లేఖాస్త్రాలు, జరిపిన సమాలోచనలు గాలికి కొట్టుకుపోయాయి తప్ప ఎటువంటి ఫలితాలను ఇవ్వలేదు. అహ్మద్ పటేల్ వంటి ట్రబుల్ షూటర్లు ఒక్కొక్కరూ కాలధర్మం చెందుతున్నారు. కపిల్ సిబల్, చిందంబరం వంటివారు సోనియా, రాహుల్ విషయంలో అంత తృప్తిగా లేరు. చాలామంది కీలకనేతలు, పెద్ద నాయకులు అసంతృప్తిలో జీవిస్తున్నారు. కేంద్రంలో అధికారానికి దూరమై ఏడేళ్లయింది. రెండు సార్లు సార్వత్రిక ఎన్నికలు వచ్చి వెళ్లాయి.రెండుసార్లూ పరాజయమే ఎదురైంది. 2014తో పోల్చుకుంటే 2019లో మరింత ఘోరంగా ఓడిపోయింది.

Also read: పాకిస్తాన్ కొత్త పాచిక?

సమరోత్సాహంలో బీజేపీ

హెచ్చిన ఫలితాలతో, రెట్టింపు సమరోత్సాహంతో బిజెపి ముందుకు వెళ్తోంది. నరేంద్రమోదీ గ్రాఫ్ పడిపోతోందని ప్రచారం జరుగుతున్నా, అది ఫలితాల్లో ఎక్కడా ప్రతిస్పందించడం లేదు. వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి వరుస విజయాలతో దూసుకు వెళ్తోంది. ఫలితాల గ్రాఫ్ బాగానే సాగుతోంది. నరేంద్రమోదీ దూకుడుకు ఎదురోడ్డే ప్రతినాయకుడు కాంగ్రెస్ పార్టీలో దివిటీ వేసి వెతికినా ఒక్కడూ కనిపించడం లేదు. కాస్తోకూస్తో రాహుల్ గాంధీపైన ఆశలు పెట్టుకున్నారు. ట్విట్టర్ లోనూ, సోషల్ మీడియాలోనూ ఆయన చేసే విమర్శల్లో ఉన్న జోరు కార్యక్షేత్రంలో ఎక్కడా కనిపించడం లేదు. ఆయన తీరు సీజనల్ పొలిటీసియన్ లాగానే వుంది. సీజన్డ్ పోలిటీషియన్ గా లేదు.

Also read: స్టాలిన్ కు శుభాకాంక్షలు

పొత్తుల్లో తప్పులు

అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంటున్న తీరులోనూ అనాలోచిత నిర్ణయాలు కనిపిస్తున్నాయి. తమ వాటా సీట్ల ఎంపికలోనూ క్షేత్రస్థాయి వాస్తవికతకు దూరంగా వెళ్తున్నారు. బీహార్ లో పొందిన చేదుఫలితాలు తాజా ఉదాహరణ. పశ్చిమ బెంగాల్ లో నిన్న జరిగిన ఎన్నికల సమయంలో వామపక్షాలతో జతకట్టి, కనీసం ఒక్క సీటు కూడా దక్కించుకోలేక అక్కడ తుడిచిపెట్టుకు పోయారు. నిన్నటి విజయంతో, మమతా బెనర్జీకి జాతీయ స్థాయి ప్రతినాయిక గుర్తింపు గొప్పగా వచ్చింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆమె తోడ్పాటును కాంగ్రెస్ వారు ఏ మేరకు పొందుతారన్నది అనుమానమే. సోనియాగాంధీ విషయంలో ఎలా ఉన్నా, రాజీవ్ గాంధీ అంటే మమతా బెనర్జీకి ఎంతో గౌరవాభిమానాలు ఉన్నాయి.

Also read: భారత్-బ్రిటన్ మధ్య గాఢమైన మైత్రి

రాహుల్ పట్ల మమత సానుకూలత

ఈ నేపథ్యంలో రాహుల్ పై కూడా ఆమెకు వాత్సల్యం వుంటుంది. వీటిని ఒడిసిపట్టుకోవడంలో రాహుల్ సైతం విఫలమవుతున్నాడు. పార్టీలోని అగ్రనేతలతో పాటు, దేశంలోని ప్రతిపక్ష నాయకులతోనూ కాంగ్రెస్ చేసే ప్రయాణం ఏమాత్రం ప్రభావశీలంగా లేదు. కొన్ని నెలల్లో మరికొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ముందుగా, 2022 ఫిబ్రవరి/మార్చిలో గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో జరుగుతాయి. అక్టోబర్, డిసెంబర్ లో హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ లో ఎన్నికలు జరగాల్సి వుంది. 2022లో ఎన్నికలు జరుగనున్న 7 రాష్ట్రాల్లో ఒక్క పంజాబ్ తప్ప, ఇంకెక్కడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. అన్నిచోట్ల బిజెపియే అధికారంలో ఉంది.

Also read: అనివార్యమైన లాక్ డౌన్

కాంగ్రెస్ నిష్క్రియాపరత్వం

ఇప్పటి వరకూ జరిగిన ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లోనూ అధికారం దక్కుతుందనే ఆశలు పెట్టుకోవడం తప్ప, క్రియాశూన్యంగా కాంగ్రెస్ వ్యవహరించింది. రేపు ఈ ఏడు రాష్ట్రాల్లో జరుగబోయే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలుస్తుందనే శకునాలు ఎక్కడా కనిపించడం లేదు. ప్రస్తుతం, కాంగ్రెస్ అధికారంలో లేని రాష్ట్రాలలో ఆయా అధికార పార్టీల పట్ల ప్రజలందరూ అచంచలమైన విశ్వాసంతో ఉన్నారన్నది సత్యదూరమైన విషయం. కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ ప్రతిపక్ష పార్టీగా తన పాత్రను సమర్ధవంతంగా పోషించడంలో కాంగ్రెస్ ఘోరంగా వైఫల్యం చెందిన్నది కఠోరమైన నిజం. అది పూర్తిగా అధినాయకత్వ వైఫల్యమే. దేశవ్యాప్తంగా ” చింతన్ బైటక్ ” నిర్వహిస్తామని ఆ మధ్య కాంగ్రెస్ ప్రకటించింది.

Also read: పాలకపక్షాలకే మళ్ళీ పల్లకీ

చింతన లేదు, బైటక్ లేదు

ఏ బైటక్ లూ జరిగిన దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. కనీసం జాతీయ అధ్యక్షుని ఎంపిక లేదు, సంస్థాగత ఎన్నికలు లేవు, ఆత్మసమీక్షలు, పరీక్షలు లేవు, సాధించిన విజయాలు లేవు. సుదీర్ఘమైన,ఘనచరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ కాలపరీక్షలో నిలిచేనా, పూర్వ వైభవం పొందేనా అనే అనుమానాలు బలంగా అలుముకుంటున్నాయి. పార్టీలకు రాజకీయ ప్రయాణంలో గెలుపు ఓటములు, చీకటి వెలుగులు సాధారణమైన అంశాలే అయినప్పటికీ, పార్టీ ఉనికిని కాపాడుకొని, ఖ్యాతిని, ప్రగతిని సాధించడంలో శక్తివంతమైన అడుగులు వెయ్యకపోతే కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉంది. దేశంలోని వివిధ ప్రాంతీయ పార్టీలు దూసుకెళ్ళిపోతున్నాయి.

Also read: భారత్ – రష్యా సంబంధాలలో మలుపు

బలమైన ప్రతిపక్షం అవసరం

అదే సమయంలో కాంగ్రెస్, కమ్యూనిస్ట్ వంటి జాతీయ పార్టీల స్థాయి ప్రాంతీయ పార్టీల కంటే ఇంకా తక్కువ స్థాయికి పడిపోతోంది. రాష్ట్రాల్లోనైనా, కేంద్రంలోనైనా బలమైన ప్రతిపక్షం లేకపోవడం, ప్రశ్నించే బలమైన గొంతులు ఆరిపోవడం , ప్రజల పక్షాన పోరాడగలిగే ప్రాతినిధ్యం కనుమరుగవడం ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదని అంబేద్కర్ వంటి మహనీయులు పదేపదే చెప్పారు. బిజెపి పదేపదే చెబుతున్న ” కాంగ్రెస్ ముక్త్ భారత్ ” వచ్చేకాలం ఆసన్నమవుతోందా అనిపిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ కు అధినేత్రిగా ఉన్న సోనియాగాంధీ ఆరోగ్యం కూడా అంతంతమాత్రంగానే ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆరోగ్యం ఇంకా అధ్వాన్నంగా ఉంది. ఇప్పటికైనా కాంగ్రెస్ మేలుకుంటుందా? భవిష్యత్ లో కోలుకుంటుందా? కాలపరీక్షలోనే తేలాల్సివుంది.

Also read: ఉక్రెయిన్ పై ఆధిపత్యానికి రష్యా ఆరాటం

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles