నిర్ణయం తీసుకోకపోవడం కూడా ఒక నిర్ణయమేనని మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అనేవారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కొత్త అధ్యక్షుడి నియామకంపైన కేంద్ర నాయకత్వం ఒక నిర్ణయం తీసుకోకపోవడం మంచి నిర్ణయం. మాజీ మంత్రి కె. జానారెడ్డిని నాగార్జునసాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పార్టీ అధిష్ఠానం నిర్ణయించడం, ఆయన పోటీ చేయడానికి అంగీకరించడం కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తున్నాయని చెప్పడానికి నిదర్శనం. సాగర్ ఉపఎన్నికలో పార్టీ అభ్యర్థిగా కె. జానారెడ్డిని నిర్ణయించామనీ, ఆ ఉపఎన్నికల తర్వాతనే టీపీసీసీ అధ్యక్షుడి నియామకం జరుగుతుంనీ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ పార్టీ వ్యవహారాల పర్యవేక్షకుడు మాణిక్కం టారూర్ గురువారంనాడు ప్రకటించారు. నాగార్జనసాగర్ ఉపఎన్నికలో జానారెడ్డి వజయావకాశాలు పుష్కలంగా ఉన్నాయనీ, కాంగ్రెస్ నాయకులందరూ కలసికట్టుగా పని చేస్తే ఆయన విజయం నల్లేరుపైన బండిలాగానే ఉంటుందనీ పరిశీలకుల అభిప్రాయం.
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో జానారెడ్డికి తిరుగులేని పట్టు ఉంది. దివంగత ఎంఎల్ఏ నరసింహయ్య సైతం జానారెడ్డి శిష్యుడే. జానారెడ్డి కాకుండా కొడుకు రఘువీర్ ని నిలబెట్టాలని నిర్ణయిస్తే అది తప్పుడు నిర్ణయమై ఉండేది. జానారెడ్డికి ఉన్న ప్రాబల్యం రఘువీర్ కు లేదు. రఘువీర్ ఎన్నికల బరిలో దిగి తన సత్తా నిరూపించుకోవాలని తహతహలాడటం సహజం. వీలైతే టీఆర్ఎస్ లోకి దూకాలని అనుకోవడం కూడా తప్పులేదు. కానీ కాంగ్రెస్ లో ఉంటేనే తన కుటుంబానికి భవిష్యత్తు ఉంటుందని జానారెడ్డి భావించడం సమంజసమైన ఆలోచన. రఘువీర్ కి భవిష్యత్తు చాలా ఉంది.
కాంగ్రెస్ పార్టీ మనుగడ అవసరం:
కాంగ్రెస్ పార్టీ మనుగడ ఆ పార్టీ నాయకులకంటే సమాజానికి చాలా అవసరం. బీజేపీ వంటి ఒక జాతీయ పార్టీ దూసుకొని వస్తున్న తరుణంలో మరో జాతీయపార్టీ అయిన కాంగ్రెస్ సైతం రంగంలో ఉండాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మిగిలిన నాయకులలో అందరికంటే భౌతికంగా, బౌద్దికంగా ఎత్తయిన నాయకుడు జానారెడ్డి అనడంలో ఎవ్వరికీ సందేహం లేదు. జానారెడ్డి నాగార్జునసాగర్ లో గెలుపొంది, టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తే రెండు ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఒకటి, కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. రెడ్డి సామాజికవర్గం ఆ పార్టీని వీడి బీజేపీలోకి వెళ్ళే ప్రయత్నాన్ని విరమించుకుంటుంది. రెండు, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కి కూడా కాంగ్రెస్ బతికి బట్టకట్టడం అవసరం. అదికారపార్టీకి సహజంగానే వ్యతిరేకత ఉంటుంది. ప్రజలందరికీ సంతృప్తి కలిగే విధంగా పరిపాలించడం ఎంతటి సమర్థులకైనా అసాధ్యం.
ఇదీ చదవండి: రాష్ట్ర కాంగ్రెస్ లో రసవత్తర రాజకీయం
కేసీఆర్ దిద్దుబాటు చర్యలు:
అయిదేళ్ళ పరిపాలన పూర్తి చేసి, రెండో టరమ్ నడుస్తున్న సందర్భంలో టీఆర్ఎస్ పట్ల ప్రజలలో వైముఖ్యం క్రమంగా పెరుగుతోందని దుబ్బాక ఉపఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్ద్వద్వంగా నిరూపించాయి. ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) కొన్ని దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు. ఎల్ఆర్ఎస్ లేకుండా రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తన పార్టీ పరాజయానికి ఎల్ ఆర్ ఎస్ నిబంధన ఒక ముఖ్యమైన కారణమని గ్రహించారు. దిద్దుబాటు చర్య తీసుకున్నారు.
అయితే, దిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత రెండు వారాలకు ముఖ్యమంత్రి మరో సంచలన ప్రకటన చేశారు. ప్రభుత్వానికి ధాన్యాలు కొనుగోలు చేయవలసిన అవసరం లేదనీ, ప్రభుత్వం కమిషన్ ఏజెంటు కాదీనీ ఒక ప్రకటన చేశారు. నిరుడు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేయడం వల్ల ప్రభుత్వానికి తీరని నష్టం వాటిల్లిందని చెబుతూ ఇకపైన పంట కొనుగోలు కేంద్రాలు ఉండబోవనీ స్పష్టం చేశారు. ఇది రైతులకు నష్టం కలిగించే నిర్ణయం. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ విధానానికి అనుగుణం కావచ్చును. అటువంటి నిర్ణయం తీసుకొని కేంద్రాన్ని, ప్రధానమంత్రినీ సంతోషపెట్టవలసిన రాజకీయ అవసరం కేసీఆర్ కి ఉండవచ్చును. కానీ రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు కల్పించిన భద్రతను ఉపసంహరించుకోవడం వల్ల కేసీఆర్ వారికి తీరని అపకారం చేసినట్టు అవుతుంది. మొత్తంమీదికి ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుందే కానీ తగ్గే అవకాశాలు లేవు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడే ఓట్లన్నీ బీజేపీకి పోకుండా వాటిని చీల్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సజీవంగా ఉండటం టీఆర్ఎస్ కి అవసరం. ఆ రకంగా రేపు నాగార్జునసాగర్ లో జానారెడ్డి విజయాన్ని కేసీఆర్ కోరుకుంటారు. జానారెడ్డి గెలుపువల్ల టీఆర్ఎస్ కి వచ్చే నష్టం లేదు. లాభం ఉంది.
ఇదీ చదవండి: టీపీసీసీ అధ్యక్షుడి నియామకంపై దిల్లీలో సమాలోచనలు
సమగ్రమైన సమాలోచన:
మాణిక్కం టాగూర్ హైదరాబాద్ లో 160 మంది కాంగ్రెస్ నాయకులతో రెండు రోజులపాటు అదేపనిగా సమాలోచనలు జరిపి పార్టీ అధిష్ఠానవర్గానికి నివేదించిన తర్వాత కొన్ని పేర్లు పరిగణలోకి తీసుకొని కసరత్తు చేశారు. రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క, డి. శ్రీధర్ బాబు వంటి నాయకుల పేర్లు అధిష్ఠానం పరిశీలించినట్టు సమాచారం. వారిలో జీవన్ రెడ్డి పేరు ఖరారు చేసినట్టూ, రేవంత్ రెడ్డిని ప్రచారసారథిగా నియమించాలని నిర్ణయించినట్టూ వార్తలు వచ్చాయి. అంతలో జానారెడ్డి అధిష్ఠానవర్గానికి లేఖ రాశారు. నాగార్జనసాగర్ ఉపఎన్నిక ముగిసే వరకూ గుర్రాన్నికట్టివేయాలనీ, ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించి ఖరారు నిర్ణయం తీసుకోవచ్చుననీ రాశారు. అందుకు పార్టీ అధిష్ఠానం సమ్మతించడం విశేషం.
అధిష్ఠానం సమయస్ఫూర్తి:
కాంగ్రెస్ నాయకులలో కూడా అదే అభిప్రాయం ఉంది. రేవంత్ రెడ్డికి పదవి ఇవ్వడాన్ని విహెచ్ హనుమంతరావు వంటి సీనియర్ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. అతడికి పదవి ఇచ్చినట్లయితే తాము పార్టీ వీడి పోవలసి వస్తుందని కూడా హెచ్చరించారు. రేవంత్ బలమైన నాయకుడు. ఆయనకు బలమైన మిత్రులూ, బలమైన ప్రత్యర్థులూ ఉన్నారు. పైగా ఆయనకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మనిషిగా చెరగని ముద్ర ఉంది. నోటుకు కేసు వ్యవహారం ఒకటి అడ్డంకిగా ఉంది. అందుకే తనకు టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు, ప్రచారసారథ్యం అప్పగిస్తే చాలునంటూ ఇటీవల టెన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. జీవన్ రెడ్డి కొత్తపదవిని స్వీకరించడానికి అంత ఉత్సాహం ప్రదర్శించడం లేదని కొందరు అంటున్నారు. జీవన్ రెడ్డి టీపీసీసీ పదవికి అన్ని విధాలా అర్హుడేనని అందరూ చెబుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ప్రబలిన బహునాయకత్వం గురించి ఆయన భయపడుతున్నారని వినికిడి. ఈ దశలో జానారెడ్డికి పార్టీ పగ్గాలు అప్పజెప్పడం సరైన నిర్ణయం అవుతుందనీ, అందుకు నాగార్జునసాగర్ ఉపఎన్నికలలో గెలిచిన తర్వాత ముహూర్తం పెట్టడం మంచి సయస్ఫూర్తితో కూడుకున్న నిర్ణయం అవుతుందనీ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది. టీపీసీసీ అధ్యక్షుడు ఎవరో తెలుసుకోవాలంటే మార్చి, ఏప్రిల్ వరకూ ఆగవలసిందే. నాగార్జునసాగర్ ఉపఎన్నికల మార్చిలో జరిగే అవకాశాలు ఉన్నాయి.
ఇదీ చదవండి: తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వంపై తర్జనభర్జన