• ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారని మమత ఆరోపణ
• రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని బీజేపీ ఆరోపణ
• మహిళల ఓటర్లకు గాలం వేస్తున్న తృణమూల్, బీజేపీ
బెంగాల్లో తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీకి విపక్షాల సెగ ఎక్కువైంది. అసలే బీజేపీ పన్నుతున్న కుయుక్తులను పసిగట్టలేక నానా తంటాలు పడుతున్న దీదీకి ఇపుడు కాంగ్రెస్, వామపక్షాలు తోడయ్యాయి. తృణమూల్ కీలక నేత సువేందు అధికారితోపాటు పలువురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో విపక్షాలు స్వరం పెంచాయి. రాష్ట్రంలో ఆపధర్మ ప్రభుత్వం పాలన సాగిస్తోందని అసెంబ్లీ సమావేశపరిచి బలాన్ని నిరూపించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో మమత గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. సీపీఎం నేత సుజన్ చక్రవర్తి, కాంగ్రెస్ నేత అబ్దుల్ మన్నన్ అసెంబ్లీలో విశ్వాసపరీక్షలో బలం నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. కరోనా కారణంగా అసెంబ్లీని సమావేశపరిచి దాదాపు సంవత్సరం అయిందని అసెంబ్లీలో ప్రజా సమస్యలతోపాటు చర్చించాల్సిన అంశాలు చాలానే ఉన్నాయని కాంగ్రెస్, వామపక్షాలు చెబుతున్నాయి.
ఇది చదవండి: ఆరు నెలల ముందే బెంగాల్ దంగల్ షురూ
శాంతి భద్రతల వైఫల్యం:
అసెంబ్లీలో బలనిరూపణకు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కరోనా ఉన్నా రాష్ట్రంలో రాజకీయ నాయకుల ర్యాలీలు, భారీ బహిరంగ సభలు అడ్డూ అదుపూ లేకుండా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనాను సాకుగా చూపి అసెంబ్లీ సమావేశాను వాయిదా వేయడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని విపక్షాలు విమర్శిస్తోంది. మహిళల పై దాడులు ఎక్కువయ్యాయని కాంగ్రెస్ ఆరోపించింది. బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఏప్రిల్ మే నెలల్లో జరగాల్సిఉంది. ఎన్నికల్లో కాంగ్రెస్ వామపక్షాలు కూటమిగా పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించాయి. ఎన్నికలకు సమయం ఉన్నా మమతా బెనర్జీ రాబోయే ఎన్నికల్లో మహిళల ఓట్ల కోసం ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. పలు సంక్షేమ పథకాలు ప్రకటిస్తూ మహిళలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. గిరిజనుల ఇంటికి వెళ్లిన మమత వంట చేస్తున్న మహిళకు సాయం చేశారు.
ఇది చదవండి: బెంగాల్ ఎన్నికల్లో వామపక్షాలు, కాంగ్రెస్ పొత్తు
బీజేపీపై మమత విమర్శలు:
బెంగాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మమత ఆరోపించారు. ఉద్రేకపూరిత ప్రసంగాలు చేస్తూ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు ప్రయత్నిస్తున్నారని మమత విమర్శించారు. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి పార్టీలో చేర్చుకుంటున్నారని బీజేపీ తీవ్రంగా మండిపడ్డారు
ఇది చదవండి: దీదీకి, శరద్ పవార్ రాజకీయ పాఠాలు