ఇండియన్ పొలిటికల్ సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ టీమ్ (ఐపీఎస్ఎస్టీ), ఎస్ ఏ ఎస్ గ్రూప్ (హైదరాబాద్) కలసి కర్ణాటక ప్రజల అభిప్రాయం కనుగొనేందుకు సర్వే జరిపించారు. ఈ సర్వే 20 నవంబర్ 2022 నుంచి 12 జనవరి 2023 వరకూ జరిగింది. మూడు అంచెలలో కర్ణాటకలోని అన్ని ప్రాంతాలలోనూ ఈ సర్వే జరిగింది.
కర్ణాటకలో 2023లో జరగబోయే ఎన్నికలలో ప్రముఖమైన పాత్ర పోషించే అంశాలు ఇవి:
- ద్రవ్యోల్బణం
- రైతుల సమస్యలు, పెరుగుతున్న రైతుల రుణభారం, కనీస మద్దతు ధర (ఎంఎస్ పీ) నిర్ణయంలో రైతు పట్ల సానుభూతి ఉండటం లేదా లేకపోవడం.
- నిరుద్యోగ సమస్య
- ప్రభుత్వ సంస్థలలో, ప్రభుత్వ పనులలో అత్యధిక స్థాయిలో అవినీతి.
- గ్యాస్, డీసిల్, పెట్రోల్ , నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి అంటడం
- ఇసుక, లిక్కర మాఫియాలు
- వైద్యానికి ప్రాథమిక సదుపాయాలు లేకపోవడం
- రియల్ ఎస్టేట్, ల్యాండ్ మాఫియా
- మతపరమైన,కులపరమైన విభేదాలు
- కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ ఇతర పార్టీల ఎంఎల్ఏలను కొనుగోలు చేయడం లేదా ఇతరత్రా ఒత్తిడి చేయడం.
- పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ రిక్రూట్ మెంటులో కుంభకోణం
- కాంట్రాక్టర్లు 40 శాతం కమిషన్ చెల్లించడం, ఓటర్ల జాబితాలో పేర్లను కొట్టివేయడం
- మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు సమస్య
- కర్ణాటక,తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరీ నదీ జలాల వివాదం
ఇన్ని అంశాలపైన ఆలోచిస్తున్న కర్ణాటక ఓటర్లలో 34 శాతం మంది బీజేపీకీ, 40 శాతంమంది కాంగ్రెస్ కీ, 17 శాతం మంది జేడీ (ఎస్)కీ ఓటు వేయవచ్చునని సర్వే తేల్చింది. ఇతరులకు ఆరు శాతం, మౌనంగా ఉండే ఓటర్లు మూడు శాతం ఉంటారని అంచనా.
ఈ విధంగా రావడానికి దోహదం చేసే కారణాలు ఏమంటే
- కాంగ్రెస్ కు డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యల బలమైన నాయకత్వం
- దక్షిణాదిలో బీజేపీకి తలుపులు తెరిచిన బీఎస్ యడియూరప్ప వ్యక్తిత్వం. లింగాయత్ సామాజికవర్గంలో అసాధారణమైన ప్రాబల్యం కలిగిన యడియూరప్పను బీజేపీ అంతఃకలహాల కారణంగా ముఖ్యమంత్రి గద్దె దించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పలాగా మాస్ లీడర్ (ప్రజాభిమానం కలిగిన నేత) కాదు. లింగాయత్ సామాజికవర్గంలో కూడా పూర్తి మద్దతు లేదు. పైగాపార్టీలో ముఠాతగాదాలను అరికట్టడంలో విఫలమైనారు.
- కాంగ్రెస్ కు కురుబ, షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఓబీసీ, ముస్లింల నుంచి మద్దతు పూర్తిగా ఉంది.
- ఒక్కలిగ సామాజికవర్గం ఓటు జేడీఎస్, కాంగ్రెస్, బీజేపీ, తదితర పార్టీల మధ్య చీలిపోతుంది.
- కల్యాణరాజ్యం ప్రగతిపక్ష పేరుతో గాలి జనార్తనరెడ్డి స్థాసించిన పార్టీ కొప్పాల్, గంగావతి, బళ్ళారి, కోలార్, ధవనగిరి, రాయచూర్ జిల్లాలలో కొంత ప్రభావం చూపుతుంది. ఈ జిల్లాలలో11 నుంచి 13 స్థానాలపైన కొత్త పార్టీ ప్రభావం వేస్తుందని అంచనా.
- బీఆర్ఎస్, జేడీఎస్ లు చేతులు కలిపి పోటీ చేస్తాయి. పాతమైసూరు జిల్లాలో జేడీఎస్, పాత హైదరాబాద్ సంస్థానం లో భాగాలైన గుల్బర్గా, యాదగిరి, బీదర్ జిల్లాలలో బీఆర్ఎస్ పోటీ చేస్తాయి. రెండు పార్టీలకూ కలిపి 32 నుంచి 37స్థానాలు రావచ్చునని అంచనా.
- ఆల్ ఇండియా మజ్టీస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) ముస్లింలు అదికంగా ఉన్న నియోజకవర్గాలలో పోటీ చేస్తే ఆయిదారు నియోజకవర్గాలపైన ప్రభావం వేయవచ్చు.
బెంగళూరు అర్బన్ లో మొత్తం 28 సీట్లు ఉన్నాయి. వాటిలో బీజేపీ తొమ్మిది నుంచి 11 సీట్లు, కాంగ్రెస్ 13 నుంచి 14 స్థానాలు, జేడీఎస్ ఒకటి లేదా రెండు స్థానాలు గెలుచుకుంటాయని అంచనా. పాత మైసూరు ప్రాంతంలో 66 స్థానాలున్నాయి. అందులోబీజేపీకి 10 నుంచి 14 స్థానాల దాకా వస్తాయి. కాంగ్రెస్ కు 24 నుండి 25 స్థానాలు రావచ్చు. జేడీఎస్ కు 21 నుంచి 22 స్థానాలు రావచ్చును. ముంబయ్ కర్ణాటక లేదా కిట్టూర్ కర్నాటకలో మొత్తం 44 స్థానాలు ఉంటే వాటిలో బీజేపీ 14 నుంచి 16 వరకూ, కాంగ్రెస్ 27 నుంచి 28 వరకూ, జేడీఎస్ ఒకటి రెండు స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. కోస్తల్ కర్ణాటకలో మొత్తం 19 స్థానాలు ఉన్నాయి. 12 నుంచి 13 స్థానాల వరకూ బీజేపీకి రావచ్చు. ఏడు లేదా ఎనిమిది స్థానాలు కాంగ్రెస్ కు రావచ్చు. బీజేడీకి ఒక్క స్థానం కూడా దక్కే అవకాశాలు కనిపించడం లేదు. హైదరాబాద్-కర్ణాటకలో 40 స్థానాలు ఉన్నాయి. వాటిలో బీజేపీకి 12 నుంచి 13 స్థానాలు రావచ్చు. కాంగ్రెస్ కు 21 నుండి 22 స్థానాలు రావచ్చు. జేడీ ఎస్ కు ఒకటి నుంచి మూడు స్థానాల దాకా రావచ్చును. సెంట్రల్ కర్ణాటకలో 27 స్థానాలు ఉన్నాయి. వాటిలో బీజేపీ ఎనిమిది నుంచి తొమ్మిది స్థానాలు గెలుచుకుంటుంది. కాంగ్రెస్ కు 16 లేదా 17 స్థానాలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. జేడీఎస్ కు ఒక్క స్థానం దక్కినా గొప్పే. కర్ణాటక అసెంబ్లీలో ఉన్న మొత్తం 224 స్థానాలలో బీజేపీకి 65 నుంచి 76 స్థానాలూ, కాంగ్రెస్ కు 108 నుంచి 114 స్థానాలు, జేడీఎస్ కి 24 నుంచి 30 స్థానాలు దక్కవచ్చు. ఇతరులకు ఏడు స్థానాలు దక్కుతాయనీ, పది స్థానాలలో పోటీ నువ్వా-నేనా అన్నట్టు ఉంటుందనీ సర్వేలో తేలింది.