Tuesday, December 3, 2024

ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌దే హవా

ఫొటో రైటప్: సింహ్ దేవ్, భగేల్

పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడి

డిసెంబర్‌లో జరగనున్న ఛత్తీస్‌గఢ్‌ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ హవా కొనసాగి రెండోసారి అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలున్నట్లు పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ నిర్వహించిన ‘ఛత్తీస్‌గఢ్‌ మూడ్‌ సర్వే’లో వెల్లడయ్యింది. జూన్‌ మాసంలో సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం కాంగ్రెస్‌ పార్టీకి 53 నుండి 60, బీజేపీకి 20 నుండి 27 స్థానాలు, బీఎస్పీ, ఇండిపెండెంట్‌, ఇతర ప్రాంతీయ పార్టీలకు ఒక్కొక్క  స్థానం వచ్చే అవకాశాలున్నట్లు  వెల్లడయ్యింది. ఛత్తీస్‌గఢ్‌లో 90 అసెంబ్లీ స్థానాలుండగా మెజార్టీకి కావాల్సినవి 46 స్థానాలు. అధికార పగ్గాలు చేపట్టడానికి కావాల్సిన మెజార్టీ మార్కును కాంగ్రెస్‌ పార్టీ సునాయాసంగా పొందే అవకాశం ఉన్నట్టు పీపుల్స్‌పల్స్‌ సంస్థ చేపట్టిన సర్వేలో వెల్లడయ్యింది.

2018 ఎన్నికల్లో 43.03 ఓట్లు పొందిన కాంగ్రెస్‌ 2.96 శాతం అధిక ఓట్లతో 46 శాతం ఓట్లు పొందనుందని సర్వేలో తేలింది. 2018 ఎన్నికల్లో 33 శాతం ఓట్లు పొందిన బీజేపీ 5 శాతం అధిక ఓట్లతో 38 శాతం ఓట్లు పొందనుందని సర్వేలో వెల్లడయ్యింది. 2018లో కాంగ్రెస్‌ కంటే బీజేపీకి 10 శాతం ఓట్లు తక్కువరాగా ఇప్పుడు రెండు పార్టీల మధ్య వ్యత్యాసం 8 శాతం.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం, 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో రాష్ట్రంలోని 11 లోక్‌సభ స్థానాల్లో 10 స్థానాలు గెల్చుకున్న బీజేపీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకంజలో ఉందని సర్వేలో వెల్లడయ్యింది.

కాంగ్రెస్‌ ఆధిపత్యం కొనసాగడానికి ముఖ్య కారణం ముఖ్యమంత్రి భూపేష్‌ భఘేల్‌ పాలనపై ప్రజల్లో సానుకూలత ఉండడమే. బీజేపీ జాతీయత, హిందుత్వ అంశాలకు ప్రత్యామ్నాయంగా సీఎం భూపేష్‌ ఛత్తీస్‌గఢ్‌ ఆత్మ గౌరవం అంశంలో భాగంగా ‘ఛత్తీస్‌గఢ్‌ మాతారి’, ‘గదో నవా ఛత్తీస్‌గఢ్‌’ వంటి నినాదాలకు ప్రజలు ఆకర్షితులయ్యినట్లు పీపుల్‌పల్స్‌ సర్వేలో వెల్లడయ్యింది. ప్రభుత్వం స్థానిక పండుగలకు గుర్తింపు ఇచ్చి సెలవులు ప్రకటించడం, ఛత్తీస్‌గఢ్‌ ఒలింపిక్స్‌ క్రీడలు నిర్వహించడం, రాష్ట్ర గీతం ‘‘అర్ప`పైరి కి ధర్‌’’ ప్రవేశపెట్టడం వంటి సెంటిమెంట్‌ అంశాలు కాంగ్రెస్‌ విజయానికి తోడ్పడుతున్నాయి. ‘‘రామవంగమన్‌ పాత్‌’ పేరిట శ్రీరాముడు వనవాసం చేసిన రాష్ట్ర పరిధిలోని 75 స్థానాలను గుర్తించి ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేయడం, 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంతోపాటు ‘‘బెన్‌ ములాఖత్‌’’ పేరుతో గ్రామాల్లో, పట్టణాల్లో పర్యటిస్తూ ప్రజలకు చేరువవడం వంటి కార్యక్రమాలు కాంగ్రెస్‌ విజయానికి తోడ్పడుతున్నాయి. ‘‘కహో దిల్‌ సే, కాంగ్రెస్‌ ఫిర్‌ సే’’, ‘భూపేష్‌ హై తో, భరోసా హై’’ వంటి నినాదాలు ప్రజలకు చేరువవుతున్నాయి.

రామన్ సింగ్

ఛత్తీస్‌గఢ్‌ అభివృద్ధికి ఏ పార్టీ కృషి చేస్తుందని ఓటర్లను పీపుల్స్‌ పల్స్‌ అడగగా కాంగ్రెస్‌ అని 48%, బీజేపీ అని 40%, జేసీసీ అని ఒక శాతం, బీఎస్పీ అని ఒక శాతం, ఎవరూ కారని 10% మంది అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌కు మరోసారి అవకాశమిస్తారా అని సర్వేలో ఓటర్లను అడగగా అవకాశం ఇస్తామని 47%, ఇవ్వబోమని 40%, ఏమీ చెప్పలేమని 13% మంది తెలిపారు. బీజేపీకి మూడు మార్లు అవకాశమిచ్చినట్టే కాంగ్రెస్‌కు కూడా మరోసారి అవకాశమిద్దామనే అభిప్రాయాన్ని ఓటర్లు వెల్లడిరచారు. ముఖ్యమంత్రి పనితీరు ఎలా ఉందని ఓటర్లను ప్రశ్నించగా బాగుందని 45%, పర్వాలేదని 15%, బాగోలేదని 30%, ఏమీ చెప్పలేమని 10% మంది అభిప్రాయపడ్డారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ పనితీరుపై ఓటర్లను సర్వేలో ప్రశ్నించగా 20% సంతృప్తిగా ఉన్నట్టు, 31% పాక్షింగా సంతృప్తిగా ఉన్నట్టు, 17% అసంతృప్తిగా ఉన్నట్టు, 21% పాక్షికంగా అసంతృప్తిగా ఉన్నట్టు, ఏమీ చెప్పలేమని 11% మంది అభిప్రాయపడ్డారు.

ప్రాంతాలవారీగా రాజకీయ వాతావరణం

ఛత్తీస్‌గఢ్‌ ఉత్తర, మధ్య, దక్షిణ ప్రాంతాలుగా ఉంది. ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ను సర్గుజ డివిజన్‌గా కూడా పిలుస్తారు. 23 స్థానాలున్న ఈ డివిజన్‌లో ఎస్టీ, ఓబీసీ ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి సింహ్ దేవ్, రాష్ట్ర మంత్రి జైసింగ్‌ అగర్వాల్‌ ప్రభావంతో 2018 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్‌ మంచి ఫలితాలను సాధించింది. సింహ్ దేవ్ కాబోయే ముఖ్యమంత్రి అనే ప్రచారం ఇక్కడ 2018లో కాంగ్రెస్‌ విజయానికి దోహదపడిరది. ఆయనకు ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడం, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల పనితీరుపై వ్యతిరేకత ఆ పార్టీకి ఇక్కడ నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇటీవల సింహ్ దేవ్ కు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడం కాంగ్రెస్‌కు కొంత సానుకూలం. 2018తో పోలిస్తే ఇక్కడ బీజేపీకి ప్రస్తుతం కొంత సానుకూలమైన వాతావరణం ఉందని పీపుల్స్‌పల్స్‌ సర్వేలో తేలింది.

మధ్య ఛత్తీస్‌గఢ్‌ డివిజన్‌లో రాయ్‌పూర్‌, బిలాస్‌పూర్‌, దుర్గ్‌ వంటి ప్రధాన పట్టణ ప్రాంతాలున్నాయి. ఈ డివిజన్‌లో 55 అసెంబ్లీ స్థానాలున్నాయి. రాష్ట్రంలోని దాదాపు అన్ని ఎస్సీ రిజర్వ్‌ స్థానాలు ఈ ప్రాంతంలోనే  ఉన్నాయి. ఎస్టీ, సింధి, రాజ్‌పుత్‌, పంజాబీ, బ్రాహ్మిణ్‌ సామాజిక ఓటర్ల ప్రభావం కూడా ఇక్కడ ఉంది.  ముఖ్యమంత్రి భూపేశ్‌ భఘేల్‌, మాజీ ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అరుణ్‌ సావో వంటి ప్రధాన నేతలు ఈ ప్రాంతానికి చేందిన వారే. ఈ ప్రాంతంపై పట్టున్న బీజేపీ 2018 ఎన్నికల్లో నష్టపోయింది. కొన్ని సంవత్సరాల క్రితం కబీర్‌దామ్‌, బీమెత్ర జిల్లాల్లో మతకలహాల హింసతో ఇక్కడ ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఇక్కడ బీజేపీ బలపడ్డట్టు కనిపిస్తున్నా, సిట్టింగ్‌ బీజేపీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి ఆ పార్టీకి నష్టం కలిగించబోతోంది. వ్యవసాయ ప్రాధాన్యత గల ఈ ప్రాంతంలో ప్రభుత్వ పథకాలతో కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణం ఉంది. ఈ డివిజన్‌లో గత ఎన్నికల్లో మంచి ఫలితాలు పొందిన జేసీసీ, బీఎస్పీ బలహీనపడడంతో కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రయోజనం కలుగుతోంది. మొత్తంమీద ఈ ప్రాంతంలో బీజేపీ బలపడ్డట్టు కనిపించినా, కాంగ్రెస్‌ ఆధిప్యతం కొనసాగే అవకాశాలున్నాయని పీపుల్స్‌పల్స్‌ సర్వేలో తేలింది.

నవంబర్ లో ఎన్నికలు

ఎస్టీ సామాజిక వర్గం ఆధిపత్యం కలిగిన ఛత్తీస్‌గఢ్‌ దక్షిణ ప్రాంతాన్ని బస్తార్‌ అని కూడా పిలుస్తారు. ఇక్కడ 12 స్థానాల్లో 11 ఎస్టీ రిజర్వ్ డ్‌గా ఉన్నాయి. ఇది మావోయిస్ట్‌ ప్రభావిత ప్రాంతం. బీజేపీకి పట్టున్న ఈ ప్రాంతంలో 2018లో 11 స్థానాలు గెలిచిన కాంగ్రెస్‌ అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో మరోస్థానం గెలిచి మొత్తం 12 స్థానాలను సాధించింది. ఎస్టీలతోపాటు గోండ్‌, మారియా`మురియా, భాత్ర హల్బీట్‌ సామాజిక వర్గాల ప్రభావం ఇక్కడుంది. ఇక్కడ ఓబీసీతో పాటు ఇతర సామాజిక వర్గాల ప్రభావం తక్కువ. సుక్మా జిల్లాలో  సీపీఐ ప్రభావం కొంత ఉంది. బస్తర్‌లో మత మార్పిడి ఘటనలతో గత కొన్ని సంవత్సరాలుగా గిరిజనుల మధ్య మత కలహాలు జరిగాయి. ఈ కారణాలతో బీజేపీ 2018తో పోలిస్తే కొంత బలపడే అవకశాలున్నాయి. ఈ ప్రాంతంలో సర్వ్‌ ఆదివాసీ సమాజ్‌ ఓట్లను చీల్చినా సీట్లు గెలిచే అవకాశాలు లేవు. ఇక్కడ కాంగ్రెస్‌ కొంత నష్టపోయినా ప్రభుత్వ పథకాల ప్రభావంతో అధిక స్థానాలు గెలిచే అవకాశాలున్నాయని పీపుల్స్‌పల్స్‌ సర్వేలో తేలింది.

వివిధ సామాజిక వర్గాల ప్రభావం

రాయ్‌పూర్‌, బిలాస్‌పూర్‌, జగదల్‌పూర్‌, అంబిక్‌పూర్‌, కోబ్రా, రాయిగఢ్‌ మొదలగు నగరాల్లో రాజపూత్‌, బ్రాహ్మిణ్‌, సింధీ, పంజాబీలు, మార్వాడీలు, బనియా సామాజిక వర్గాల ప్రభావం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఓడియా, బెంగాలీల ప్రభావం కూడా ఉంది. ఈ సామాజిక వర్గాలలో బీజేపీ పట్ల కొంత మొగ్గు కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఓబీసీల ఓటింగ్‌ బ్యాంక్‌ అధికం. ఓబీసీలో సాహు సామాజిక వర్గం అధికంగా ఉన్నారు. ఈ సామాజిక వర్గంలో బీజేపీ పట్ల కొంత మొగ్గు ఉంది. ఓబీసీలో రెండో పెద్ద సామాజికవర్గం కుర్మీలది. వీరు సెంట్రల్‌ రీజియన్‌లో అధికంగా ఉన్నారు. ముఖ్యమంత్రి భూపేష్‌ ఈ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో వీరు కాంగ్రెస్‌ వైపు ఉన్నారు. చేనేతకు చెందిన పానికాస్‌ కాంగ్రెస్‌ వైపు ఉన్నారు. వ్యవసాయ రంగానికి చెందిన మారర్‌ సామాజిక వర్గం కాంగ్రెస్‌ పట్ల అనుకూలంగా ఉంది. సెంట్రల్‌ ప్రాంతంలో అధికంగా ఉండే కాలర్‌ సామాజిక వర్గం బీజేపీకి అనుకూలంగా ఉంది. దేవాంగన్‌ సామాజిక వర్గం బీజేపీ పట్ల మొగ్గు చూపుతుంది. మధ్య ఛత్తీస్‌గఢ్‌లో ప్రాభల్యం ఉన్న యాదవ్‌ సామాజిక వర్గం బీజేపీకి అనుకూలంగా ఉంది.

ఎస్సీలు ప్రధానంగా ఛత్తీస్‌గఢ్‌ మధ్య ప్రాంతంలో అధికంగా ఉన్నారు. ఎస్సీల్లో అధికంగా ఉన్న సాతనమీ, హరిజన, మహార్‌ సామాజిక వర్గాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయి.

ఎస్టీల ప్రభావం ప్రధానంగా ఉత్తర, దక్షిణ ప్రాంతాలలో ఉంది. ఎస్టీల్లో అధికంగా ఉండే గోండుల ఓటర్లు కాంగ్రెస్‌, బీజేపీ, సర్వ్‌ ఆదివాసీ పార్టీలకు అనుకూలంగా చీలిపోయారు. ఎస్టీలలో రెండో పెద్ద సామాజిక వర్గమైన కన్వార్‌ బీజేపీ పట్ల మొగ్గు చూపుతున్నారు. ఉత్తర ప్రాంతంలో ఉన్న ఖైర్వార్‌, ఓరాన్‌ సామాజిక వర్గాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయి. పహాడి కోబ్ర సామాజిక వర్గం బీజేపీ పట్ల సానుకూలంగా ఉంది. హల్బా సామాజిక వర్గం కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంది. మరియా`మురియా, భాట్రా సామాజిక వర్గాలు కాంగ్రెస్‌, బీజేపీ మధ్య చీలి ఉన్నాయి. రాష్ట్ర జనాభాలో రెండు శాతానికి పైగా ఉన్న ముస్లింలు, దాదాపు రెండు శాతం ఉన్న క్రిస్టియన్లు కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతున్నారు.

కాంగ్రెస్‌ బలాలు, బలహీనతలు

కాంగ్రెస్‌ 2018 ఎన్నికల్లో రైతులకు రుణమాఫీతో పాటు ధాన్యం సేకరణ, మద్దతు ధరపై ఇచ్చిన హామీని భూపేశ్‌ బఘేల్‌ ప్రభుత్వం నిలబెట్టుకుంది. రాష్ట్రంలో ప్రధాన పంట అయిన వరిని దేశంలోనే రికార్డు స్థాయిలో ప్రభుత్వం సేకరించడంతో రైతులు ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నట్లు పీపుల్స్‌ పల్స్‌ సర్వేలో తేలింది. దీంతోపాటు అంగన్వాడీ, ఆశా వర్కర్లు, హోమ్‌గార్డులకు జీతభత్యాలు పెంచడంతో వారు కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు. ఈ పరిణామాలు ప్రధానంగా గ్రామాలలో, విద్యావంతులలో పార్టీ పట్ల సానుకూలతను కలిగిస్తున్నాయి. వీధులలో సంచరించే ఆవుల కోసం ‘గోథాన్‌ యోజన’ పేరిట పథకాన్ని ప్రారంభించి గ్రామీణ యువతకు, మహిళలకు ఉపాధిని కలిగించడం పట్ల ప్రజలు ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నారు.

అధికార కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు ఆ పార్టీకి నష్టం చేకూర్చవచ్చని పీపుల్స్‌పల్స్‌ సర్వేలో తేలింది. ముఖ్యమంత్రి భూపేశ్‌కు ఉప ముఖ్యమంత్రి టి.ఎస్‌. సింహ్ దేవ్, పీసీసీ చీఫ్‌ మోహన్‌ మార్కం మధ్య విభేదాలున్నాయి. ముగ్గురు మూడు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో పార్టీకి ఇబ్బందికరంగా మారింది. మైనింగ్‌ ఆరోపణలపై సీసీఎస్‌ అధికారి సౌమ్య చౌరాసియాను కేంద్ర ఈడీ అరెస్టు చేయడం రాష్ట్రంలో సంచలనం రేగింది. అయితే ఈ అవకతవకలలో ముఖ్యమంత్రి భూపేశ్‌ ప్రమేయం కంటే కొందరి మంత్రులు, అధికారుల హస్తం ఉందని ప్రజలు భావించడం వ్యక్తిగతంగా సీఎంకు సానుకూలాంశం. మౌలిక వసతుల కల్పనలో ప్రధానంగా దెబ్బతిన్న రహదారులతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం ప్రభుత్వంపై వ్యతిరేకతకు దారితీస్తోంది.

బీజేపీ బలాలు, బలహీనతలు

ప్రభుత్వ వ్యతిరేకతపై ఆశలు పెట్టుకున్న బీజేపీ భూపేశ్‌ ప్రభుత్వం వైఫల్యాలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. పేదలకు గృహ నిర్మాణాలకు సంబంధించి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను ఇవ్వకపోవడంతో పథకం కింద ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయని రాష్ట్ర బీజేపీ ‘మోర్‌ ఆవాజ్ మోర్‌ అధికార్‌’ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టి ప్రజలకు చేరువయినట్లు పీపుల్స్‌ పల్స్‌ తమ సర్వేలో గమనించింది. బస్తార్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో క్రిస్టియన్‌ మిషనరీలు డబ్బు ప్రలోభాలతో గిరిజనులలో మత మార్పిడిని ప్రోత్సాహిస్తున్నాయని బీజేపీ విమర్శిస్తోంది. ఈ పరిణామాలు బీజేపీని సమర్థించే గిరిజనలు, క్రిస్టియన్లుగా మారిన గిరిజనుల మధ్య ఘర్షణలకు దారితీశాయి. గత ఎన్నికల్లో మహిళలను ఆకర్షించడానికి కాంగ్రెస్‌ ఇచ్చిన మద్య నిషేధం హామీని ఆ పార్టీ అమలు చేయకపోవడం బీజేపీకి సానుకూలంగా మారుతోంది.

గతంలో పదిహేను సంవత్సరాలు పాలించిన బీజేపీ హిందూత్వ అజెండాతోపాటు జాతీయ అంశాలకు ఇచ్చిన ప్రాధాన్యతను ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ప్రత్యేకతను గుర్తించడంలో ఇవ్వలేదనే అసంతృప్తి ప్రజల్లో ఉండడం ఆ పార్టీకి నష్టం చేకూరనుందని పీపుల్స్‌పల్స్‌ సర్వేలో తేలింది. బీజేపీ జాతీయ అంశాలకు, హిందూత్వ అజెండాకు వ్యతిరేకంగా స్థానిక, ప్రాంతీయ అంశాలకు ప్రాధాన్యతిస్తూ ప్రజలకు చేరువవడంలో ముఖ్యమంత్రి భూపేశ్‌ సఫలీకృతులయ్యారు.

పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న రమణ్‌సింగ్‌ ఠాకూర్‌ సామాజిక వర్గానికి చెందిన వారు, ఈయన కాకుండా పార్టీలో ఇతర ప్రముఖ నేతలైన సరోజ్‌పాండే బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు, మరోనేత బ్రిజ్‌మోహన్‌ అగర్వాల్‌ బనియా సామాజిక వర్గానికి చెందిన నేత. దీంతో రాష్ట్రంలో అధికంగా ఉండే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు పార్టీలో ప్రాధాన్యత లేదనే భావనను కాంగ్రెస్‌ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుండడం బీజేపీకి నష్టం చేకూర్చే అవకాశాలున్నాయి. గిరిజన తెగకు చెందిన సీనియర్‌ నేత నంద్‌కుమార్‌ సాయి 2023 ఏప్రిల్‌లో బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరడం బీజేపీకి నష్టం చేకూర్చవచ్చు. బీజేపీ 15 ఏండ్ల పాలనలో సబ్సీడీ బియ్యం మినహా ఇతర సంక్షేమ పథకాలకు పెద్ద ప్రాముఖ్యతను ఇవ్వలేదని, బీజేపీకి మూడుసార్లు అవకాశమిచ్చినట్లుగా కాంగ్రెస్‌కు కూడా మరోసారి అవకాశం ఇస్తామని ప్రజలు పీపుల్స్‌పల్స్‌ సర్వేలో తెలిపారు.

సీఎం భూపేశ్‌ బఘేల్‌కు ప్రత్యామ్నాయమే లేదు

ముఖ్యమంత్రి భూపేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాదరణ కలిగున్న నేతగా ఎదిగారు. ఉప ముఖ్యమంత్రి సింహ్ దేవ్ సొంత ప్రాంతమైన ఉత్తర ప్రాంతంలో భూపేశ్‌కు ఆదరణ కొంత తక్కువ ఉంది. సెంట్రల్‌, దక్షిణ ప్రాంతాలలో  సానుకూలంగా ఉన్నారు. ఛత్తీసగఢ్‌ రాష్ట్ర ఆత్మగౌరవం గుర్తింపు కోసం ముఖ్యమంత్రి కష్టపడుతున్నారనే భావన ప్రజల్లో ఉంది. కాంగ్రెస్‌ పార్టీలో గ్రూపులున్నా భూపేశ్‌కు సరితూగే నేతలు లేరని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.

ప్రస్తుత ముఖ్యమంత్రి భూపేశ్‌కు పోటీగా బీజేపీలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఉన్నారా అని పీపుల్స్‌పల్స్‌ ప్రజలను ప్రశ్నించగా మిశ్రమ స్పందన లభించింది. బీజేపీలో ఇప్పటికీ రమణ్‌సింగ్‌కు ముఖ్యమంత్రి అభ్యర్థిగా  ప్రాధాన్యత లభిస్తుండగా ఆయనను ప్రస్తుత సీఎం భూపేశ్‌కు సరైన ప్రత్యామ్నాయంగా భావించకపోవడం ఇక్కడ గమనార్హం. బీజేపీలో ముఖ్యమంత్రిగా ఇతర అభ్యర్థులను పరిశీలిస్తే మాజీ రాజ్యసభ సభ్యులు రామ్‌విచార్‌ నేతం, లోక్‌సభ ఎంపీ గోంతి సాయి (ఇరువురు ఉత్తర చత్తీస్‌గఢ్‌కు చెందిన ఎస్టీ నేతలు), అరుణ్‌సావో (రాష్ట్ర అధ్యక్షులు, ఓబీసీ నేత), బ్రిజ్‌మోహన్‌ అగర్వాల్‌ (మాజీ మంత్రి, ఎమ్మెల్యే), సరోజ్‌పాండే పేర్లు వినిపించాయి.     గూడావన గణతంత్ర పరిషత్‌ రాష్ట్రంలో ప్రభావం కోల్పోయింది. జనతా కాంగ్రెస్‌ ఛత్తీస్‌గఢ్‌ (మజీ సీఎం అజిగ్‌ జోగీ ఏర్పాటు చేసిన పార్టీ) 2018లో బీఎస్పీతో పొత్తు పెట్టుకోగా ఆ కూటమి ఏడు స్థానాలు (జేసీసీ 5, బీఎస్పీ 2) గెలిచింది. అజిత్‌ జోగి మరణానంతరం జేసీసీ పూర్తిగా బలహీనపడగా, బీఎస్పీ ఒక స్థానం గెలిచే అవకాశాలున్నాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఒక స్థానం కూడా దక్కే అవకాశాల్లేవు. నూతనంగా ఆవిర్భవించిన సర్వ ఆదివాసీ సమాజ్‌ బస్తార్‌ ప్రాంతంలో గణనీయమైన ఓట్లు పొందే అవకాశాలన్నా సీట్లు దక్కకపోవచ్చు.

ఈ పరిణామాల మధ్య ప్రధాన పోటీ కాంగ్రెస్‌, బీజేపీ మధ్యనే ఉండగా, కాంగ్రెస్‌ మెజార్టీ సాధించి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని పీపుల్స్‌పల్స్‌ సర్వేలో తేలింది.

సర్వే నిర్వహించిన విధానం

పీపుల్స్‌పల్‌ సంస్థ 2023 జూన్‌ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు మొత్తం 30 రోజులపాటు రాష్ట్రంలో సర్వే నిర్వహించింది. సంస్థ తరఫున రీసెర్చ్‌ స్కాలర్స్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తర, మధ్య, దక్షిణ ప్రాంతాలలో మొత్తం 5000 కిలోమీటర్లు పర్యటించింది. ప్రతి బృందంలో ఐదుగురు రీసెర్చర్లు, 20 మంది రీసర్చ్‌ స్కాలర్స్‌ ఉండేలా మొత్తం నాలుగు బృందాలను ఏర్పాటు చేసి సర్వే చేపట్టారు. ఈ నాలుగు బృందాలలో మూడు బృందాలు రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ, మధ్య ప్రాంతాలలో పర్యటించగా, మరో బృందం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి సర్వే నిర్వహించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 35`40 సాంపిల్స్‌ చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3000 సాంపిల్స్‌లను సేకరించింది. కులం, ప్రాంతం, స్త్రీలు, పురుషులు, అన్ని వయసుల వారికి సమప్రాధాన్యతిస్తూ ఈ సర్వే చేపట్టారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles