- ఎమ్మెల్సీ పోలింగ్ రోజున పవన్ సంచలన నిర్ణయం
- ఏపీలో ఓటమికి బీజేపీతో పొత్తే కారణమన్న పోతిన
- తెలంగాణ బీజేపీతోనూ విభేదాలు
తెలుగు రాష్ట్రాలలో బీజేపీ, జనసేన పొత్తుపై నీలినీడలు కమ్ముకున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఆవిర్భావ వేడుకల్లో బీజేపీపై పొత్తుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దీనికి ఆజ్యం పోస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపై ఇరు పార్టీల మధ్య సహకారం కొరవడినట్లు జనసేన నేతలతో పాటు క్షేత్రస్థాయిలో కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. అటు తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీచేసిన పీవీ కుమార్తెకు పవన్ కల్యాణ్ మద్దతు తెలపడం కూడా తీవ్ర చర్చనీయాంశమైంది.
టీబీజేపీతో సంబంధాలపై పవన్ అసంతృప్తి:
కేంద్రంలోని బీజేపీతో సత్సంబంధాలు ఉన్నా తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు మాత్రం తమను పదే పదే వాడుకుని వదిలేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకే మద్దతు తెలిపామని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేనను కనీసం పట్టించుకోలేదని పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి మాజీ ప్రధాని పీవీ కుమార్తె వాణి దేవికే తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు.
Also Read: జనసేన యూ టర్న్ ?
జనసేనపై టీబీజేపీ నేతల ఆగ్రహం :
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తెలంగాణ బీజేపీ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. పవన్ మిత్ర ధర్మాన్ని విస్మరించారని తెలంగాణ బీజేపీ నేతలు విమర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మద్దతు ఇచ్చినందుకు పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపామని బీజేపీ నేతలు తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ, జనసేన మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. పోలింగ్ రోజే టీఆర్ఎస్‌కు పవన్ మద్దతు తెలపడంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. పవన్ ఇలా అనూహ్య రీతిలో నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలేంటో తెలియదని బీజేపీ నేతలు ప్రకటించారు.
ఏపీలో ఓటమికి బీజేపీనే కారణం-జనసేన:
మరోవైపు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ శ్రేణులు తీరుపై జనసేన అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీజేపీతో పొత్తువల్లే జనసేన ఓటమిపాలయిందని అంటున్నారు. విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో అభ్యర్ధుల ఓటమికి బీజేపీతో పొత్తే ప్రధాన కారణమని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమిగా ఏర్పడటం వల్ల మైనార్టీలంతా తమను దూరం పెట్టారని ఆరోపించారు. ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలపై పార్టీ అధిష్ఠానానికి నివేదిక అందిస్తామన్నారు. బీజేపీ పోటీ చేసిన స్థానాలలో జనసైనికులు ప్రచారం నిర్వహించారని అయితే బీజేపీ నుంచి కనీస సహకారం కూడా క్షేత్ర స్థాయిలో తమకు అందడంలేదని జనసేన నేతలు వాపోయారు.
Also Read:పవన్ కల్యాణ్ పయనం ఎటు?