- రైతుభరోసా నిధుల విడుదలకు ఆమోదం
- తిరుపతి వద్ద 40 ఎకరాల్లో సర్వే అకాడమీ
- అదనపు ఏజిగా జాస్తి నాగభూషణం నియామకానికి కేబినెట్ ఆమోదం
ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. రాష్ట్రంలో సమగ్ర భూ సర్వేకు ఆమోదం సహా పలు కీలక నిర్ణయాలకు మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది. కేబినెట్ భేటీ లో తీసుకున్న నిర్ణయాలనను మంత్రి పేర్నినాని సమావేశ అనంతరం వెల్లడించారు. సుధీర్ఘంగా జరిగిన కేబినెట్ భేటిలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ఇటీవల సీఎం ప్రారంభించిన సమగ్ర భూసర్వే, సరిహద్దు చట్టంలో సవరణలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సబ్ డివిజన్ ప్రకారం మ్యాప్ తయారు చేస్తామని, అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా భూసర్వే జరుగుతుందని మంత్రి పేర్ని నాని తెలిపారు. తిరుపతి వద్ద 40 ఎకరాలలో సర్వే అకాడమీ ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో 400 వందల కోట్లకు మించి పెట్టుబడులు పెట్టే పరిశ్రమలకు మెగా పరిశ్రమ హోదా కల్పించనున్నారు. ఇదే సమయంలో ఇప్పటి వరకు ఉన్న 33 సంవత్సరాల లీజు కాలాన్ని 99 సంవత్సరాలకు పెంచేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఇది చదవండి: సుప్రీంలో జగన్ సర్కార్ కు ఊరట
రైతుభరోసాకు నిధుల విడుదలకు ఆమోదం
కరోనా సంక్షోభం కారణంగా ఏప్రిల్, మే, జూన్ కాలానికి పవర్ ఫిక్స్ డ్ ఛార్జీలను రద్దు చేశారు. ప్రస్తుత ఫిక్స్ డ్ ఛార్జీలను వాయిదాలలో చెల్లించే సౌలభ్యం కల్పించారు. రైతు భరోసా మూడో విడత కింద 2 వేల రూపాయల ఆర్థిక సాయం అందించనున్నారు. దీని ద్వారా 54.47 లక్షల రైతులకు లబ్ధి చేకూరనుంది. రైతు భరోసా కింది ఈ నెల 29 న 1009 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో జమచేయనున్నారు. నివర్ తుపానుతో 12 లక్షల ఎకరాలలో 8.6 లక్షలమంది రైతులకు నష్టం వాటిల్లిందని, నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ కింద 719 కోట్ల రూపాయలు చెల్లించనున్నారు. పెట్టుబడి రాయితీ నెలలోపు చెల్లించేందుకు వీలుగా కొత్త విధానానికి ఆమోదం తెలిపారు.
ఇది చదవండి: స్థానిక ఎన్నికలకు కరోనా అడ్డంకి కాదన్న ఎస్ఈసీ
హోటళ్లు, పర్యాటక రంగానికి రీస్టార్ట్ ప్యాకేజి
హోటళ్లు, రెస్టారెంట్లు, పర్యాటక ప్రాజెక్టులకు రీస్టార్ట్ ప్యాకేజీ, 50 వేల నుంచి 15 లక్షల వరకు రుణ సదుపాయం కల్పించనున్నారు. సినీ పరిశ్రమకు రీస్టార్ట్ ప్యాకేజీ అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా 1100 సినిమా థియేటర్లకు రుణ సదుపాయం, వడ్డీపై రాయితీలు కల్పించేందుకు కేబినెట్ సమ్మతి తెలిపింది. పౌర సరఫరాల కార్పొరేషన్ ద్వారా 5 వేల కోట్ల రుణ సమీకరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
చింతలపూడి ఎత్తి పోతల పథకానికి నాబార్డు రుణం
చింతలపూడి ఎత్తి పోతల పథకానికి నాబార్డు నుంచి 1931 కోట్ల రుణం పొందేందుకుక జలవనరుల శాఖకు అనుమతినిచ్చారు. రాష్ట్ర అదనపు అడ్వకేట్ జనరల్ గా జాస్తి నాగభూషణం నియామకంతో పాటు నికి కేబినెట్ ఆమోద ముద్రవేసింది. పులివెందులలో ఏపీ రూరల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ కేంద్రం ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పొరేషన్ ఏర్పాటుకు కూడా ఆమోదించింది.