- మార్చి 19న 91 ఏట అనారోగ్య కారణంగా మృతి
- ఎనిమిది దశాబ్దాల పోరాట జీవితానికి స్వస్తి
వీరవనిత, కమ్యూనిస్టుపార్టీ యోధ, నిజాంపాలనపైన నిలువెత్తు పోరు జెండా, తెలంగాణ సాయుధ రైతాంగపోరాటపు ఉద్యమ అరుణ కిరణం మల్లు స్వరాజ్యం శనివారంనాడు అస్తమించారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టి, పేదరికం నుంచి. బానిసత్వం నుంచి బడుగుజనుల విముక్తి కోసం తుపాకి చేతపట్టిన స్వరాజ్యం తన 91 వ ఏట అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. మార్చి ఒకటో తేదీన నుమోనియా సమస్యతో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన స్వరాజ్యం 19వ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు ప్రాణాలకోసం పోరాటం విరమించారు.
నిజాం సర్కార్ పైన అన్న భీంరెడ్డి నరసింహారెడ్డి, బావ రాజిరెడ్డి సరసన పోరుబాటలో సాగిన స్వరాజ్యం దొరల దురహంకారాన్నీ, గడీల కిరాతకాలనీ ప్రశ్నిస్తూ ఉపన్యాసాలతో, పాటలతో జనాన్ని ఉత్సాహపరిచి ప్రేరణగా నిలిచేవారు. 1945లో ప్రారంభమైన తెలంగాణ సాయుధ పోరాటంలో ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్లు జిల్లాలలో పాల్గొన్నారు. రాజక్క పేరుతో దళాలను నిర్మించి ఉద్యమం నడిపించారు. తన ఇంటిని తగులపెట్టిన నిజాం పోలీసులకు దొరకకుండా, వారిన చూసి జంకకుండా ధీరవనితకు మారుపేరై ఆయుధమై సాగారు.
సాయుధపోరాటం ముగిసిన తర్వాత ఉద్యమ సహచరుడు మల్లు వెంకట నరసింహారెడ్డితో స్వరాజ్యం వివాహం 1954లొ జరిగింది. ఎంఎల్ఏ క్వార్టర్స్ లో కమ్యూనిస్టు నాయకుడు దేవులపల్లి వెంకటేశ్వరరావు నివాసంలో బద్ధం ఎల్లారెడ్డి, చండ్ర రాజేశ్వరరావు వంటి నాయకుల సమక్షంలో నిరాడంబరంగా పెళ్ళి జరిగింది. సోదరుడు నరసింహారెడ్డి, రావినారాయణరెడ్డి లాగానే స్వరాజ్యం కూడా ప్రజాస్వామ్య రాజకీయాలలో ప్రవేశించారు. నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో 1978లోనూ, 1983లోనూ అసెంబ్లీ ఎన్నికలలో అభ్యర్థిగా గెలుపొందారు. 1983లో ఎన్ టి ఆర్ హవాను తట్టుకొని నిలబడిన కొద్దిమందిలో స్వరాజ్యం ఒకరు. కానీ 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికలలో ఓడిపోయారు. 1989లో సైతం గెలువలేకపోయారు. అప్పటికే కమ్యూనిస్టు పార్టీల ప్రాభవం తగ్గుముఖం పట్టింది. 1996లో మిర్యాలగూడెం పార్లమెంటు స్థానానికి పోటీ చేసి పరాజయం చెందారు. ‘నా మాటే తుపాకీ తూటా’ అన్న టైటిల్ తో స్వీయజీవిత చరిత్రను ప్రచురించారు. నల్లగొండ జిల్లా సీపీఎం కార్యదర్శిగా పని చేసిన నరసింహారెడ్డి 4 డిసెంబర్ 2004లో మరణించారు. దూబగుంటలో రోశమ్మ నాయకత్వంలో 1993-94లో ఉవ్వెత్తున లేచిన సారా వ్యతిరేక ఉద్యమంలో మల్లు స్వరాజ్యం పాల్గొన్నారు. వామపక్ష స్త్రీపక్షపాత పత్రిక ‘చైతన్య మానవి’ సంపాదకవర్గంలో సభ్యురాలుగా పని చేశారు. 11 ఏళ్ళ వయస్సులో బందూకు పట్టి పోరాడిన స్వరాజ్యం ఎనభై ఏళ్ళ పోరాటజీవితం గడిపిన ప్రజానాయకురాలు.
నరసింహారెడ్డి, స్వరాజ్యం దంపతులకు ముగ్గురు సంతానం. కుమార్తె కరుణ, కుమారులు గౌతమరెడ్డి, నాగార్జునరెడ్డిలో చివరి కుమారుడు నాగార్జునరెడ్డి న్యాయవాది. గౌతమరెడ్డి సీపీఎం పార్టీకి సేవలందిస్తూనే హోమియో వైద్యుడిగా ప్రజాసేవ చేస్తున్నారు. కుమార్తె పాదూరి కరుణ బ్యాంకు ఉద్యోగం నుంచి ముందస్తు రాజీనామా చేసి 2009లో ప్రజారాజ్యం అభ్యర్థిగా నల్లగొండ నుంచి పార్లమెంటుకు పోటీ చేసి పరాజయం చెందారు.
మల్లు స్వరాజ్యం భౌతిక కాయాన్ని ఉదయం బసవపున్నయ్య భవన్ లో ఉంచారు. సీపీఎం జాతీయ నాయకుడు రాఘవులు, సీపీఐ నాయకుడు నారాయణ, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తు, శాసనమండలి సభ్యురాలు కవిత, మధు, చాడ వెంటకరెడ్డి తదితరులు భౌతిక కాయానిక శ్రద్ధాంజలి ఘటించారు. వందలాది ప్రజలు మాకినేని బసవపున్నయ్య భవన్ కు వెళ్ళి అరుణ తారకు అంతమ వందనం చేశారు. తర్వాత ఆమె భౌతిక కాయాన్ని నల్లగొండ తీసుకొని వెళ్ళారు. ఆమె కోరికమేరకు తన భౌతిక కాయాన్ని ఆసుపత్రికి ఇస్తారు.