- మతోన్మాద అల్లర్లను కలిసి కట్టుగా ఆపుకుందాం
- మానవహక్కుల వేదిక విజ్ఞప్తి
తెలంగాణలో మతవిద్వేషం పెరగడం పట్ల మానవ హక్కుల వేదిక ఆందోళన వెలిబుచ్చింది. మైనారిటీవర్గాలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తూ, మతవిద్వేషం పెంచుతూ అల్లర్లు సృష్టించే ప్రయత్నాలను కలసికట్టుగా నిలువరించవలసిన ప్రజాస్వామ్య బాధ్యత పౌరసమాజంపైన ఉన్నదని మానవహక్కుల వేదిక గుర్తు చేసింది. మానవహక్కుల వేదిక ఆగస్టు 25న విడుదల చేసిన ప్రకటన విడుదల చేసింది. దీనిపైన జీవన్ కుమార్, వసంతలక్ష్మి, గొర్రెపాటి మాధవరావు, డాక్టర్ ఎస్ తిరుపతయ్య సంతకాలు చేశారు. ప్రకటన పూర్తి పాఠం ఇది:
ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంలో అలాగే మొత్తం రాష్ట్రంలో కూడా మత విద్వేషం పెరుగుతూ, అల్లర్లు జరిగే స్థాయికి పరిస్థితి దిగజారుతుండటంపై మా సంస్థ ఆందోళన చెందుతున్నది.
దేశంలో మైనారిటీ వర్గాలను రెచ్చగొడుతూ, అవమాన పరుస్తూ, వాళ్ల హక్కులను భంగపరిచే ప్రయత్నాలను కలిసి కట్టుగా నిలవరించాల్సిన ప్రజాస్వామిక భాధ్యత మనందరిపైన ఉంది. ఉన్మాదపు మాటలు, చర్యలకు మైనారిటీలు, మెజారిటీలు ఎవరు పాల్పడ్డా సామాన్య జనమే బలి అవుతారు. దానికి పాలకులు, రాజ్యమే నాయకత్వం వహిస్తే అంతకంటే అనాగరికం ఇంకేమీ ఉండదు. ఈ పరిస్థితిలో ప్రజలు మతోన్మాద రాజకీయాల ఉచ్చులో పడకుండా మతసామరస్యం కాపాడుకుంటూ, ఉద్రిక్తతలు తగ్గించడానికి సంయమనంతో మెలగాలని మానవ హక్కుల వేదిక విజ్ఞప్తి చేస్తున్నది. అన్ని రాజకీయ పార్టీలూ, వాటి ప్రజా సంఘాలు కూడా పరిస్థితి చేయి దాటిపోకుండా తమ వంతు కృషి చేయాలనీ, ఈ ప్రజాస్వామ్య కృషి వాళ్ళ బాధ్యత అనీ మేము భావిస్తున్నాం.
ఈ పరిస్థితికి తాజా బాధ్యుడైన ఘోషా మహల్ ఎం ఎల్ ఏ రాజా సింగును అసెంబ్లీ నుండి తొలగించాలనీ, ఆయనపై చట్టపరమైన చర్యలకు ఆదేశాలు ఇవ్వాలని మేం గవర్నర్ గారిని కోరుతున్నాం.
పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా చాలా సంయమనంతో ప్రకటనలు చేయాలనీ,రాజ్యాంగ బద్దంగా ఎన్నుకో బడ్డ ప్రజా ప్రతినిధి గా, ముస్లిం సమాజాన్ని శాంత పరిచేందుకు కృషి చేయ వలసిన బాధ్యత ఆయనపై ఉందని మేం భావిస్తున్నాం.
శుక్రవారం ముస్లిం సంస్థలు తమ ప్రార్ధన అనంతరం హైదరాబాదులో తలపెట్టిన నిరసన ర్యాలీని రద్దు చేసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మత పెద్దలు ఈ విషయంలో చొరవ తీసుకొని, ప్రస్తుత పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారకుండా ర్యాలీని విరమింపజేయాలని వారిని కోరుతున్నాం.
పరిస్థితిని అదుపు చేయడానికి ప్రత్యేక పోలీసు బృందాలు దుందుడుకుగా వ్యవహరిస్తూ, ప్రజల హక్కులను భంగపరుస్తూ అతిగా వ్యవహరించటం కూడా మంచిది కాదు. ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు ఇటువంటి దుందుడుకు చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ పోలీసుల ప్రవర్తనను అదుపులో ఉంచాలని మా సంస్థ కోరుతున్నది.
మానవ హక్కుల వేదిక, తెలంగాణ.
HUNAN RIGHTS FORUM,TS.
1, ఎస్ జీవన్ కుమార్
2, వి. వసంత లక్ష్మి
3, గొర్రెపాటి మాధవరావు
4, డా. ఎస్ తిరుపతయ్య.