డా. యం. సురేష్ బాబు, అధ్యక్షుడు, ప్రజాసైన్స్ వేదిక
ఈ మధ్య మతం పేరుతో ధర్మం పేరుతో పనికిమాలిన సందేశాలు షేర్ చేయడం పరిపాటైపోయింది. వీళ్లకు చరిత్ర తెలియదు. తెలుసుకోవాలన్న ఆసక్తి అంతకన్నా లేదు. పాకిస్తాన్, విదేశీ మతస్తులు, ఉత్తరప్రదేశ్ లో గుండాలను పీచమణచడం, ఉగ్రవాదుల అటకట్టించడం, భవ్య రామ మందిర నిర్మాణం ఇవే సగటు మనిషికి ప్రధాన సమస్యలైనట్లు చూపుతున్నారు. సెన్సెక్స్ 73 వేల పాయింట్లు అధిక మించిందని సంతోషపడాలా ? దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్భై ఏడు సంవత్సరాలైనా ఇంకా డెబ్భై కోట్ల మంది ఇంకా రేషన్ బియ్యం తింటున్నారని గర్వపడాలా? గిట్టుబాటు ధర కల్పిస్తామని వాగ్దానం చేసిన ప్రభుత్వం గత 18 నెలలుగా ముఖం చాటేసినప్పుడు నిలదీయడానికి వెళ్లిన రైతాంగంపైన బుల్లెట్లతో దాడి చేస్తున్న ప్రభుత్వం పేదల జీవితాలలో వెలుగులు నింపుతుందా? మణిపూర్ లో మహిళలను నగ్నంగా ఊరేగించి హత్య చేసిన ప్రభుత్వం, ఉన్నవ్, హత్రాస్ లో అత్యాచార సంఘటనలు జరిగింది ఉత్తర్ ప్రదేశ్ లోనే, దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన రెజిలర్స్ పైన లైంగిక దాడి చేసిందెవరు? 2017 నుంచి జరిగిన నియామకపు పరీక్ష పేపర్ లీక్ 18 సార్లు నిన్నటి పోలీసు సెలక్షన్ తో కలిపి. చండీగఢ్ కార్పొరేషన్ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. ఎలెక్షన్ బాండ్ల పేరుతో వేల కోట్లు దోచుకున్నారు. ప్రైవేట్ కంపెనీల నుంచి బిజెపికి విరాళాలు దోచుకోవడానికి దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపర్చుతున్నాయి. 2018-19 నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరాల మధ్య బీజేపీకి దాదాపు రూ. 335 కోట్లు విరాళంగా ఇచ్చిన కనీసం 30 కంపెనీలు గతంలో కేంద్ర ఏజెన్సీల ఒత్తిడికి గురైనవే. దేశాన్ని దోచుకు తిన్న కార్పొరేటు ఎగవేతదారుల ఇరవై లక్షల కోట్లు బ్యాంకులు రైటాఫ్ చేశాయి.
Also read: అన్యాయమైన మార్గాలనివారణ బిల్లు నిలువరిస్తుందా?
నిరుద్యోగుల ఆర్తనాదాలు
బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత అన్నాడంట. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న బీజేపీ ప్రభుత్వం దేశంలో కనీసం పదివేల ఉద్యోగాలు కల్పించలేకపోయింది. మేకిన్ ఇండియా, స్టార్ట్ ఆఫ్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లు, ఎంఎస్ఎంఈ లు, కేంద్ర ఉద్యోగ ఉపాధి కల్పన సంస్థలు శిక్షణ సంస్థలు నిధులు లేక జీతాలు లేక వెల వెల పోతున్నాయన్న అన్న సంగతి కేంద్ర ప్రభుత్వానికి తెలియదా? యువతకు కేవలం స్విగ్గిస్ జొమాటో ఫెడెక్స్ గో డాడీ కొరియర్ అండ్ కార్గో, అవుట్ సోర్సింగ్, సెక్యూరిటీ, టెలికాలర్స్, ఆఫీస్ బాయ్స్, డ్రైవర్, పెట్రోల్ పంప్ ఆపరేటర్ ఉద్యోగాలు తప్ప గవర్నమెంట్ లో కొలువులు ఎండమావులే. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి కల్పన మా పరిధిలో లేని అంశం అని ఎప్పుడో చేతులెత్తేశాయి. విశ్వవిద్యాలయాలను పటిష్ట పరచకుండా, సాంకేతిక కళాశాల అభివృద్ధి పరచకుండా ఉపాధి శిక్షణ సంస్థలు మెరుగుపరచకుండా ఉపాధి ఎలా లభిస్తుంది? దేశంలో పెరుగుతున్న అధిక ధరలు, నిరుద్యోగం, ప్రభుత్వ అస్తవ్యస్త నిర్ణయాలు, విభజన రాజకీయాలు, ప్రైవేటీకరణ, ఉత్పాదకత, ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం, సమాజంలో సమరస్యత లోపించడం అభద్రతా భావంతో దేశంలో ప్రగతి కుంటుపడింది. హిందుత్వ కార్డును ముందుకు తీసుకెళ్లడంలో మతోన్మాద శక్తులు సఫలీకృతం అయ్యారు. మతసామరస్యం, శాంతి, సౌభ్రాతృత్వం ప్రతి మనిషి జీవన విధానం కావాలని ప్రజలు గ్రహించినపుడే పరిస్థితి మారుతుంది. మత విద్వేషాలను ప్రేరేపించే విధానాలు దేశ సార్వభౌమత్వానికి ప్రమాదకరమని ప్రజలు గ్రహించాలి. మెరుగైన సమాజానికి మూలస్తంభాలైన విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం, సాధికారత, విలువలు, సామాజిక సమగ్రతను ప్రజలు విస్మరించి కేవలం మతం పట్టుకుని వేలాడితే పెను ప్రమాదం అని గ్రహించాలి. మతోన్మాద ప్రమాదం ఏమాత్రం తగ్గలేదు. బీజేపీ ప్రభుత్వ విధానాలు, సంఘ పరివార్ కార్యక్రమాలు లౌకికతత్వం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయాలు పునాదులను ధ్వంసం చేస్తున్నాయి.
Also read: వ్యవసాయ సంక్షోభానికి కారణాలు ఎన్నో!
సంఘ్ పరివార్ శక్తుల విభజనవాదం
సంఘపరివార్ శక్తుల విభజనవాద, ఫాసిస్టు తరహా చర్యలు శ్రామిక ప్రజల వర్గ ఐక్యతను, దేశ సమగ్రతను దెబ్బ తీస్తాయి. బిజెపి తిరిగి అధికారంలోకి వస్తే కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థ, సైన్యం, పోలీసు వ్యవస్థ మొత్తం సంఘ్ పరివార్ శక్తులు నిండిపోతాయి. అప్పుడు పార్లమెంట్ రద్దు చేయబడవచ్చు లేదా పూర్తిగా పనికిరానిదిగా మారవచ్చు. ఎన్నికలలో ఫాసిజాన్ని ఓడించడం ఎంత ముఖ్యమో, సాంస్కృతిక రంగంలో సంఘ్ పరివార్ కమ్యూనలిజం మనువాద సంస్కృతి మూలాలను బహిర్గతం చేయడం కూడా అంతే ముఖ్యం. ఆర్థిక రంగంలో పోరాటాలను కూడా కొనసాగించాలి, ఉధృతం చేయాలి. సంఘ్ పరివార్ యొక్క ప్రతి కదలిక మతతత్వం మను ధర్మం ఆధారంగా ‘హిందూ రాష్ట్ర’ స్థాపన లక్ష్యంగా ఉంది. ‘హిందూ రాజ్యం’ కేవలం ఎన్నికల జిమ్మిక్కులు లేదా ప్రజల అసంతృప్తి పక్కదారి పట్టించే మార్గం కాదు. అదే వారి లక్ష్యం. అటువంటి లక్ష్యాన్ని సాధించడం సాధ్యం కాకపోవచ్చు; అది సాధించిన, జర్మనీలో చేసినట్లు అది రద్దు చేయబడుతుంది. కానీ ఫాసిజం అభివృద్ధి ఇప్పుడు ఆపకపోతే, మనం మునుపెన్నడూ లేని విధంగా రక్తపాతాన్ని చూస్తాము. ఇది కనీసం రెండు లేదా మూడు దశాబ్దాల వరకు ఆగదు. ఫాసిజం సమాజాన్ని అంధకారంలోకి నెట్టగలదు. సామాజిక సామరస్యాన్ని బలోపేతం చేయడం, సామాజిక న్యాయం రాజ్యాంగ విలువలు బలోపేతం చేయడానికి కాంగ్రెస్ భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టి దేశ ప్రజల మన్ననలు పొందింది. ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజల బ్రతుకులు చిన్నాభిన్నమై పోయాయి. క్లిష్ట పరిస్థితుల్లో దేశ ప్రజల భద్రతకు భరోసా లేకుండా పోయింది.
Also read: వారసత్వ సంపద, సాంస్కృతిక ప్రదేశాల పరిరక్షణలో నిండా నిర్లక్ష్యం
విస్తరిస్తున్న మతోన్మాదం
సంఘ్ పరివార్ మతోన్మాద కార్యకలాపాలు కార్పొరేట్ దోపిడిని పెంచి పోషిస్తూ వాస్తవ సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నాయన్నది నిజం. అయితే, అంతకు మించి ఇలాంటి కార్యకలాపాలు దేశాన్ని ఒక మతతత్వ రాజ్యం వైపు నడిపిస్తున్నాయి. కొందరు సంఘ్ పరివార్ చర్యలను “అసలు సమస్యల నుండి దృష్టి మళ్ళింపు”గా మాత్రమే కొట్టిపారేశారు. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. ఆరెస్సెస్ ఈ అహేతుక, ఉన్మాద, భావజాలం ఆధారంగా శిక్షణ పొందిన వ్యవస్థీకృత ప్రైవేట్ సైన్యాన్ని కలిగి ఉంది. కాబట్టి, సంఘ్ పరివార్ శక్తులు అనుసరిస్తున్న మతోన్మాద కార్యకలాపాలు వాస్తవ సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి సహాయపడతాయి, అయితే వారు ‘హిందూ రాష్ట్ర’ యొక్క అంతిమ లక్ష్యంగా బాటలు వేయడానికి నిర్దేశించబడ్డారని అర్థం చేసుకోవాలి. ప్రస్తుత పరిస్థితిలో మంచి విషయమేమిటంటే, భారతీయ ప్రజలు ఇంకా మతోన్మాదులుగా మారలేదు. బీజేపీ దుష్పరిపాలన ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో మతోన్మాదులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Also read: ప్రచారంలో ప్రథమం – మనవాభివృద్ధిలో అధమం