నా దగ్గర ఉన్న రాబ్ డేవిస్ పుస్తకాలలో ఇది మూడవది. ఈ రోజే చేతికి చేరింది. మొదటి రెండు పుస్తకాలు కొన్న రోజుల్లో అమేజాన్ ఇండియాకి ఈ రోజు ఉన్నంత ఉదారత లేదు. అందుకని అమేజాన్ అమెరికా వెబ్ సైట్ లో పుస్తకాలు కొని జంపాల చౌదరి గారికి పంపిస్తే ఆయన ఎంతో స్నేహంతో ఆ పుస్తకాలని ఇక్కడి దాకా తీసుకు వచ్చారు. అప్పుడెందుకో నాకు ఆయన్ని కలవడం కుదరలేదు. అప్పుడు నా ప్రెండ్ కాకర్ల శ్రీనివాస్ గారు చౌదరి గారు బస చేసిన ప్రాంతానికి వెళ్ళి ఆయన దగ్గర పుస్తకాలు పుచ్చుకుని వచ్చి నాకు అందించారు అవి. అదంతా 2014 -డిసెంబర్, రెండవ వారపు రోజులు. ఆ కాకర్ల శ్రీనివాస్ గారే ఈ మధ్య “హలో మీరా” అనే సినిమా తీసి అమేజాన్ ప్రైమ్ లో విజయ ఢంకా మోగించారు. తొమ్మిదేళ్ళ క్రితపు ఆ శ్రీనివాస్ గొప్పవాడు , స్నేహం అంటే రుచి ఎరిగినవాడు, అడగ్గానే అక్కడెక్కడికో వెళ్ళి పుస్తకాలు తీసుకుని నా దగ్గరికి వచ్చి ఇచ్చారు. ఈ రోజు శ్రీనివాస్ ఇంకా గొప్పవాడు, ఇంకా పెద్ద పేరు గడించినా అదే స్నేహపు రుచి ఉంచుకుని, ఇదండి పని అని నసుగుతే అలాగలాగే అంటూ గల గల నవ్వుతూ ఎప్పుడూ ఒకే శ్రీనివాస్ లా ఉండగలిగినవాడు. జంపాల చౌదరి గారి గురించి కొత్తగా చెప్పడానికి తాజాగా ఏమీ లేదు. నేను తెలిసినప్పటినుండి ఆయన అలానే మృదువుగా , మెత్తగా, వెచ్చని స్నేహ హస్తంలా ఉంటారు.(https://www.facebook.com/photo.php?fbid=604112681768719&set=pb.100065099786881.-2207520000&type=3)
రాబ్ డేవిస్ బ్రిటిష్ కామిక్ ఆర్టిస్ట్, రచయిత. రేఖ మీద రంగు మీద, కాగితం మీద, గడుల్లో నిలబడే కాంపొజిషన్ మీద గొప్ప పట్టు కలవాడు. మహానుభావులు అంటారే ఆ కోవలోని మనిషి. పరమ క్లాసిక్ డాన్ క్విక్సోట్ ని బొమ్మల కథగా మూడు వందల పేజీల్లో తీర్చి దిద్దాడు. రేఖ వెలుగు, రంగు మెరుపులతో ఉంటుంది ఆ పుస్తకం. కామిక్ మీద కానీ, కథ చెప్పే పద్దతిని కానీ నేర్చుకోవాలనుకునే వాళ్ళు కళ్లకు అద్దుకుని మరీ అధ్యయనం చేయాల్సినది రాబ్ డేవిస్ పని. నలుపు రంగుని, తెలుపు కాగితాన్ని, బూది వర్ణపు జలపూతని మేళవించి బొమ్మల కథలని రాస్తారు. ఎప్పుడూ శృతిలో ఉండే అనాటమీ, మితి చెదరని చిత్ర సంయోజనం. రాబ్ డేవిస్ గారు ఫేస్ బుక్ లో ఉంటారు, ఆయన బొమ్మ చూసి డంగై పోయి ప్రెండ్ రిక్వెస్ట్ పెట్టా. సంవత్సరాల తరబడి ఆయన పట్టించుకోలేదు. ఒక రోజు మెసెంజర్ లోకి వెళ్ళి ఆయనకు మెసెజ్ పెట్టా. ఆయ్యా మీ బొమ్మలు మా కాలానికి ఒక ఇన్స్పిరేషన్. మీకు తెలియకపోవచ్చు తెలుగు అనే భాష ఒకటి ఉంది. ఆ జాతి మనుషులు ప్రపంచంలో బహు కోట్లు. ఇన్ని కోట్ల జాతిగల మా ప్రజలలో బహుశా మిమ్మల్ని తెగ ప్రేమించింది, డాలర్లు పెట్టి మరీ మీ పుస్తకాలు కొన్నది నేనొక్కడినే. అటువంటి అపురూపమైన నా మాదిరి మనిషి ప్రెండ్ రిక్వెస్ట్ మన్నించడం మీ బాధ్యత. అది చదివి డేవిస్ పకపక నవ్వి మరి ప్రెండయిపోయాడు. ఇదంతా తొమ్మిదేళ్ళ క్రితం కథ. ఈ రోజు సాంకేతికత పెరిగింది. అమేజాన్ ఇండియాలో అన్నీ పుస్తకాలు దొరుకుతున్నాయి. భగంతుడి అద్భుత సృష్టిలోని డాలర్ లనే కాదు అట్టడుగుకు చేరిన రూపాయిని కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేకుండా డౌన్లోడ్ చేసుకోదగ్గ ఫార్మట్ లలో పుస్తకాలు లక్షలాదిగా ఉచితంగా దొరుకుతున్నాయి. డబ్బు గురించి అంటారా, రెండు తోకలు కలిగిన కుక్క కూడా ప్రదర్శనకు తెర వెనుక నిలబడి డబ్బు సంపాదించగలదు, నటనలో ఓనామహా తెలియని సుడిమంతుడు కూడా మహా నటుడిగా కోట్లు వెనకేసుకుంటున్నాడు. మెదడు రాపిడిలో పుట్టిన అలజడి నుండి పుట్టిన ఒక రచనని కానీ చిత్ర రచనని కానీ అవి చదివే వారిగా మనం చేయవలసిన గౌరవం ఏమిటంటే వాటిని వాటి సరూపకంగానే కొనాలి. ఒకటి కాదు శక్తి ఉంటే ఎన్ని కొనగలిగితే అన్ని కొని పంచుకోవచ్చు . ఎక్కడ చదివానో గుర్తు లేదు రైలులో ప్రయాణం చేస్తున్న ఒక విదేశీయుడు ఒక పుస్తకాన్ని చదువుతూ ఉన్నాట్టా, చదువుతూ చదువుతూ చదివిన పేజీ చదవగానే చించి కిటికీ లోంచి పడేస్తున్నాడు. ఎదురుగా కూచున్న నావంటి వాడు ” ఎందుకలా? పుస్తకం బాగా లేదా అని అడిగితే, అద్భుతమైన పుస్తకం. పుస్తకాలు అనేవి చదివి దాచుకుని, మళ్ళీ చదివి, అదే పుస్తకాన్ని పదిమందికి పంచుకుని చదివించడం కాదు. ఒక పుస్తకం నాశనం కావాలి. పుస్తకం ఎప్పటికప్పుడూ కొత్తగా మొలకెత్తాలి. తాజా కాగితం, తాజా అచ్చు, తాజా రెపరెప. రచయిత అనేవాడు ఒక అద్భుతం. వాడి రచన ఉవ్వెత్తున జండాలా ఎగరాలి” ఇదంతా మనకు అర్థం కాని భాష. మనకు తెరుచుకోని సంస్కారం. ఏదో ఒకరోజు మన చొక్కాలకు పుస్తకాల జేబు అనేది ఒకటి కుట్టబడాలి. అందులో పుస్తకాల కోసం డబ్బులు దాచుకోవాలి. అందుకోసం ఆ స్థాయిలో పని చేయగలిగిన రచయితలు, చిత్రకారులు రావాలి. శబ్దారత్నాకరంలో ఇటువంటి భావనలను ఉటోపియా అంటారనే మాటను కొట్టేయాలి.
నేను కొనుక్కున్న ప్రతి పుస్తకానికి ఒక కథ ఉంది. చెప్పుకోవాల్సిందీ ఉంది. అందున మొదటి కథ ఇది.
–అన్వర్ (04-09-2023)