ఆంద్రప్రదేశ్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా ప్రముఖ సినీనటుడు, వ్యాఖ్యాత, నిర్మాత ఆలీ గారిని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా ఆలీకి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల సినిమా రంగానికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం మెగాస్టార్ చిరంజీవి నాయకత్వంలో పలువురు ప్రముఖ హీరోలు, నటులు నిర్మాతలు, దర్శకులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసిన సందర్భంగా సినీ ప్రతినిధి బృందంలో ఉన్న ఆలీని ఉద్దేశించి సీఎం త్వరలో పిలిపిస్తాను, శుభవార్త చెబుతాను అని అనడంతో ఆలీకి ఏదో ఒక పదవి ఇస్తారని, ఆంధ్రప్రదేశ్ నుండి లోక్ సభలో, రాజ్యసభలో ముస్లింలకు ప్రాతినిధ్యం లేదని, ఆలీ ని రాజ్యసభకు పంపిస్తారని పత్రికలలో, చానల్స్ లో ప్రచారం జరిగింది. అయితే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆలీని క్యాబినెట్ హోదాతో వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా నియమించారు. అయితే 2019 ఎన్నికల్లో సినీరంగ ప్రముఖులు ఎవరు కూడా వైకాపాకు అండగా నిలబడని సందర్భంలో ఆలీ వైకాపా పార్టీకి బేషరతుగా మద్దతు ఇచ్చారు. ఎన్నికల్లో ప్రచారం చేశారు. అయితే ఎన్నికల అనంతరం వైకాపా అధికారంలోకి వచ్చినా ఆలీ ఏనాడు ఫలానా పదవి కావాలని ప్రయత్నాలు చేయలేదు. బాల నటుడిగా సినీరంగంలోకి వచ్చి వెయ్యి చిత్రాల్లో నటించి, హాస్య నటుడిగా, హీరోగా, యాంకర్ గా, నిర్మాత గా గుర్తింపు పొందినందున, తన తండ్రి గారి పేరుతో ట్రస్ట్ పెట్టి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్నందున తెలంగాణ, ఆంద్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వం తరపున పద్మశ్రీ అవార్డుకు తన పేరును ప్రదీపాదిస్తే బాగుంటుందనే ఆలోచనతో ఆయన ఉన్నారని ఆయన సన్నిహితులు గత సంవత్సరం చర్చించుకున్నారు.