- రహ్మన్, గౌతమ్ మీనన్ కాంబినేషన్
హైదరాబాద్ : బతుకమ్మ పాటకు సరికొత్తగా సంగీతం చేకూర్చింది ఆస్కార్ అవార్డు విజేత ఏ ఆర్ రహ్మాన్, దర్శకత్వం వహించింది ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ అని వినికిడి. తెలంగాణ జాగృతి సంస్థ అధినేత కల్వకుంట్ల కవిత ముచ్చటపడి రాయించుకున్న, పాడించుకున్న ఈ పాటను ప్రతిష్ఠాత్మకంగా విడుదల చేయబోతున్నట్లు సమాచారం.
బతుకమ్మ పాట వీడియో అత్యంత అద్బుతంగా ఉందని కూడా అంటున్నారు. తెలంగాణ సంస్కృతిలో అత్యంత ప్రధానమైన భాగమైన బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు జరుపుకుంటున్నారు. ఇందుకు కవిత సహాయసహకారాలు అందిస్తున్నారు. ఇటీవలెనే లండన్ నుంచి కొందరు తెలుగు ప్రముఖులు వచ్చి కవితను కలిసి వెళ్ళారు. గల్ఫ్ లోనూ, అమెరికాలోనూ, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలలోనూ బతుకమ్మ పండుగ ఆనవాయితీగా మారింది. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం తర్వాత బతుకమ్మకు విస్తృతి, ప్రాసంగికత, ప్రఖ్యాతి పెరిగింది. అంతకు ముందు హుస్సేన్ సాగర్ తీరంలో బతుకమ్మ ఆటను స్వర్గీయ నాయకుడు పి. జనార్దనరెడ్డి ప్రోత్సహించేవారు. తర్వాత కవిత సారథ్యంలోనే బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. తెలంగాణ పత్రిక నమస్తే తెలంగాణ ఆదివారం అనుబంధం పేరు కూడా బతుకమ్మ.
ఇద్దరు దిగ్గజాలైన రహ్మాన్, గౌతమ్ మీనన్ కలిసి రూపొందించడంతో బతుకమ్మ పాట దేశ వ్యాప్తంగా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా బతుకమ్మ పండుగ మరోసారి హాట్ టాపిక్ కానున్నది. భారత దేశంలో సంగీత సార్వభౌములు ఇద్దరు కలిసి మన బతుకమ్మ పాటను రూపొందించడం తెలుగువారు గర్వించదగిన అంశం.