- 1.85 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరపాలన్న సీఎండి
- జి.ఎం.లకు సిఎం.డి. ఎన్.శ్రీధర్ ఆదేశం
బొగ్గుకు క్రమంగా డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో డిసెంబర్ నెల నుండి రోజుకి 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 1.85 లక్షల టన్నుల బొగ్గు రవాణా, 13.5 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగింపు లక్ష్యాలను తప్పక సాధించాలని సింగరేణి సి&ఎం.డి. ఎన్.శ్రీధర్ అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లను ఆదేశించారు. హైద్రాబాద్ సింగరేణి భవన్ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ఆయన నవంబర్ నెలలో సాధించిన ఉత్పత్తి, ఉత్పాదకతల పైన ప్రతీ ఏరియా జి.ఎం.లతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ నెలలో సాధించాల్సిన లక్ష్యాలను నిర్దేశించారు.
గత నెలలో రోజుకి 29 ర్యేకుల ద్వారా బొగ్గు రవాణా జరిగిందనీ, డిసెంబర్ నెల నుండి రోజుకి 35 ర్యేకుల ద్వారా బొగ్గు రవాణా జరపాలని ఏరియా జిఎం.లను ఆదేశించారు ఓపెన్ కాస్ట్ గనుల నుండి బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల మేర సాగాలంటే దానిపై గల ఓవర్ బర్డెన్ ను తొలగించాలి కనుక కొత్త ఓపెన్ కాస్ట్ గనులైన ఆర్.కె.పి. ఓపెన్ కాస్ట్ (ఓ.సి.), శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్, కె.టి.కె. ఓపెన్ కాస్ట్, ఆర్.జి.-3 ఓపెన్ కాస్ట్, గనులకు సంబంధించిన ఓవర్ బర్డెన్ తొలగింపు కాంట్రాక్టులను ఖరారు చేయడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జె.వి.ఆర్. ఓపెన్ కాస్ట్ (సత్తుపల్లి)కి సంబంధించి 38 లక్షల క్యూబిక్ మీటర్ల కొత్త కాంట్రాక్టుల నియామకం జరగడానికి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. కొత్తగూడెం గౌతం ఖనిలో భారీ వర్షాల వలన చేరిన నీటిని బయటకు పంపించి బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు యధావిధిగా సాధించాలని సూచించారు.
అడ్రియా లాంగ్ వాల్ లో కొత్త ప్యానెల్ నుండి జనవరి నెలలో బొగ్గు ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉండాలనీ, రామగుండం-1లోని జి.డి.కె.-11 గనిలో కంటిన్యూయస్ మైనర్ తో తిరిగి ఉత్పత్తి సాధనకు సన్నాహాలు పూర్తి చేయాలని ఆదేశించారు. కొత్త గనులకు సంబంధించిన అటవీ, పర్యావరణ శాఖ అనుమతుల తీసుకోవాలన్నారు. కొత్త గనులలో ఇప్పటి నుండి బొగ్గు ఉత్పత్తి ప్రారంభం వరకూ గల ప్రక్రియలను కాపరిమితి గల ప్రణాళికలుగా రూపొందించి ఖచ్చితంగా అమలు జరపాలని కోరారు. కొత్తగూడెం, మణుగూరు, రామగుండం-2, రామగుండం-3, ఏరియాలు నవంబర్ నెలలో ఆశించినమేర ఉత్పత్తి లక్ష్యాలు సాధించినందుకు సిఎం.డి. ప్రశంసించారు.