- ప్రతిపక్షాల తీరుపై సీఎం ఆగ్రహం
- దేవుడి పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు పన్నాగాలు
- కుట్రలను ప్రజలు గమనించాలని సీఎం జగన్ పిలుపు
హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను సీఎం జగన్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలోని అసాంఘిక శక్తులు ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల విశ్వాసం దెబ్బతినేలా కొందరు ప్రయత్నిస్తున్నారని అన్నారు. రాజకీయాలకోసం ఆలయాలను కూడా వదిలిపెట్టడకుండా దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని జగన్ అన్నారు. పరిస్థితులను చూస్తుంటే కలియుగం క్లైమాక్స్ కు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు.
బాధ్యుల్ని వదిలిపెట్టం
రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రారంభిస్తున్న సమయంలోనే దేవాలయాలపై దాడులకు తెగబడుతున్నారని సీఎం అన్నారు. రాష్ట్రంలోని 20 వేల ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. తప్పు ఎవరు చేసినా శిక్షార్హులే. తప్పు చేసినవారు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. దేవుడ్ని కూడా రాజకీయాలలోకి తీసుకొస్తున్నారు. మారుమూల ప్రాంతాలలో గుళ్ళను లక్ష్యంగా చేసుకుని ఆగంతకులు విధ్వంసం సృష్టిస్తున్నారని అన్నారు. దేవుడి విగ్రహాలు కూల్చితే ఎవరికి లాభం? అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: రామతీర్థంలో రాజకీయాలు
ప్రజల దృష్టి మరల్చేందుకు కుటిల యత్నాలు
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలనుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు
ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని సీఎం జగన్ విమర్శించారు. 2019లో మనబడి నాడు-నేడు ప్రారంభించిన సమయంలో గుడిని కూల్చారని అసత్య ప్రచారం చేశారు. 2020 జనవరిలో పిఠాపురంలో 23 విగ్రహాలు ధ్వంసం చేశారని అసత్య ప్రచారం చేశారు. రైతుల కోసం ధరల స్థిరీకరణ పథకం ప్రారంభించిన సమయంలో రొంపిచర్ల లో వేణుగోపాలస్వామి ఆలయాన్ని ధ్వంసం చేశారని ప్రచారం చేశారు. ఫిబ్రవరి 14న తూర్పు గోదావరి జిల్లాలో ఆలయ రథాన్ని దహనం చేశారు. రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభించారని, దానికి ప్రచారం కల్పించకుండా ఉండేందుకు మూడు ఘటనలకు పాల్పడ్డారని సీఎం తెలిపారు. ఆసరా కార్యక్రమాన్ని ప్రారంభించే సమయంలో ఆగంతకులు దుర్గగుడి వెండి సింహాలను మాయం చేశారని అన్నారు. విజయనగరంలో సీఎం పర్యటన ఉన్న నేపథ్యంలో రామాలయంలో విగ్రహం ధ్వంసం చేశారు. దాడులు జరిగిన ఆలయాలు చాలావరకు దేవాదాయ శాఖ పరిథిలోనివి కావు. ఈ ఆలయాలన్నీ మారుమూల ప్రాంతాల్లో ఉన్నదేవాలయాలని ఇవన్నీ టీడీపీ నాయకుల అజమాయిషీలోనే ఉన్నాయని సీఎం జగన్ అన్నారు.
ఇదీ చదవండి:విగ్రహాల ధ్వంసంపై బండి సంజయ్ మండిపాటు