• పార్టీ ఆఫీసుకు కేటాయించిన స్థలం పరిశీలన
• పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్న కేసీఆర్
• ఇంకా ఖరారు కాని ప్రధాని అపాయింట్ మెంట్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తినకు బయల్దేరి వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ పయనమయ్యారు. పర్యటనలో కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లతో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధాని కార్యాలయం నుంచి గురువారం రాత్రి వరకు అపాయింట్ మెంట్ ఖరారు కాలేదని సీఎంవో వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉండే కేంద్ర మంత్రులతో భేటీ అవుతారని తెలుస్తోంది.
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా రైతు సంఘాలు, విపక్ష నేతలతో కేసీఆర్ సమావేశమవుతారని తెలుస్తోంది. మంత్రుల భేటీలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని కోరనున్నారు. ఈ అంశంపై చర్చించేందుకు నిర్మలా సీతారామన్ తో భేటీ కానున్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాలకు సంబంధించిన పెండింగ్ అంశాలపై కూడా మంత్రులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
హస్తినలో టీఆర్ఎస్ కార్యాలయం:
ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయం కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని కేసీఆర్ పరిశీలించనున్నారు. అనంతరం శంకుస్థాపనపై నిర్ణయం తీసుకోనున్నారు. పార్టీ కార్యాలయ శంకుస్థాపన కోసం ఢిల్లీకి వెళ్లాలని కేసీఆర్ కొంతకాలంగా అనుకుంటున్నారు. పలు కారణాల నేపథ్యంలో పర్యటన వాయిదా పడుతూ వచ్చింది. రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా రాజకీయం సాగుతున్న నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. రైతుల దీక్షకు మద్దతు తెలిపిన కేసీఆర్ సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు అభినందనలు తెలుపుతూ ప్రధానికి లేఖ రాయడం తీవ్ర చర్చనీయంశమైంది..
జాతీయ రాజకీయాలలో క్రియాశీలకం కానున్న కేసీఆర్:
ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి శంకుస్తాపన చేస్తే త్వరలోనే జాతీయ రాజకీయాలలో కేసీఆర్ క్రియాశీలకంగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన కేసీఆర్ ఢిల్లీ పర్యటన మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు మంజూరు చేయడంలేదని అటు మంత్రి కేటీఆర్ కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జమిలి ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. ఢిల్లీ పర్యటనలో అందుబాటులో ఉన్న విపక్ష నేతలతో కూడా కేసీఆర్ భేటీ అయి ఫెడరల్ ఫ్రంట్ పై సమాలోచనలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.