రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ ఆధినేత కె.చంద్రశేఖర్ రావు ఆంతర్యం అంతుచిక్కకుండా ఉంది. రాష్ట్ర ప్రయోజనాలే తనకు ప్రధానం అని చెబుతూ పలు పథకాలను ప్రవేశపెడుతున్నారు. తాజాగా కేంద్రప్రభుత్వం వ్యవసాయరంగాన్ని కార్పోరేటు పెట్టుబడిదారులకు అప్పజెప్పే వీలుగా ఉన్న మూడు చట్టాలను రద్దు చేయాలని రైతులు దేశ వ్యాప్తంగా చేస్తున్న ఆందోళనలకు ముఖ్యమంత్రి కేసీఆర్ తన మద్దతును ప్రకటించారు. డిసెంబరు 8న జరుగనున్న భారత్ బంద్ కు పూర్తి మద్దతును ప్రకటించడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఈ ఆందోళనలో పాల్గొంటారని పేర్కొన్నారు.
కమలం కల సాధ్యమేనా?
ఇటు దుబ్బాక ఉపఎన్నికల్లో, అటు జీహెచ్ఎంసీ ఎన్నికలలో రైతు, కార్మిక సమస్యలపై దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలను పట్టించుకోకుండా బీజేపీ దూకుడుగా ప్రచారంచేసి దుబ్బాకలో విజయం సాధించింది. అటు హైదరాబాదులోనూ హాఫ్ సెంచరీకి సమీపంలో సీట్లను గెలుచుకున్నది. 2023లో తెలంగాణ రాష్ట్రంలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలలో అధికారంలోకి వస్తామని బీజేపీ బాహటంగా ప్రకటిస్తూనే మరింత దూకుడును పెంచడం కోసం పలువురు కాంగ్రెస్ నాయకులను, ఇతర పార్టీల నాయకులను తమ పార్టీలో చేర్చుకోవడానికి సిద్ధమైంది. బీజేపీలో చేరికలతోనే టీఆర్ఎస్ ను బలహీనపరచాలని బీజేపీ భావిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు హైదరాబాద్ నగరం వరదలతో అతలాకుతలమైంది. ఈ వరదల మూలంగా ప్రభుత్వం సహాయక చర్యలు సరిగా చేపట్టలేదని ఆరోపిస్తూ ప్రచారం చేయడం బీజేపీకి కలిసి వచ్చింది. మరో వైపు గ్రేటర్ ఎన్నికలలో హిందూవాద ప్రచారం కూడా ఉపయోగపడిందని బీజేపీ భావిస్తోంది. రాష్ట్రమంతా 2022లో లేదా 2023లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అసెంబ్లీ, పార్లమెంట్లలో తమ గాలి ఉంటుందని బీజేపీ భావిస్తోంది.
బీజేపీ ఇరకాటంలో పడనున్నదా?
కేంద్రప్రభుత్వం వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆమోదించిన చట్టాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ రైతులు దేశ వ్యాప్తంగా చేస్తున్న నిరసనలు, ఉధ్యమాలతో అట్టుడికిపోతున్నాయి. గత 11 రోజులుగా ఢిల్లీ చుట్టూ శివార్లలో వంటా వార్పు నిర్వహిస్తూ పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల రైతులు ఆందోళనలు చేస్తున్నారు. మూడు చట్టాలలోని ముప్పై తొమ్మిది అంశాల విషయంలో రైతులు అభ్యంతరాలు తెలిపారు. రోడ్లపైనే ఉండి ఆందోళన నిర్వహిస్తున్నారు. వారు కేంద్ర మంత్రులతో జరుపుతున్న చర్చలు విఫలమవుతూనే ఉన్నాయి. సాగు చట్టాలను విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాల్సిందేనని రైతులు పట్టుపడుతున్నారు. దేశ వ్యాపంగా జరుగుతున్న ఈ ఆందోళనలు ఒక రకంగా చెప్పాలంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గడగడలాడిస్తున్నాయి.
‘లోహా గరమ్ హై మార్ దో హతోడా..’ (ఇనుము వేడిగా ఉంది సుత్తె దెబ్బ వేసేద్దాం) అనే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటించి బీజేపీని ఇరకాటంలో పెట్టేశారు. బీజేపీ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఆయన బాహటంగా విమర్శించారు. ఇప్పటికే కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్, ఆమ్ ఆద్మి, సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంఎల్, ఆర్ఎస్ పీ, ఫార్వర్డ్ బ్లాక్ తదితర వామపక్ష పార్టీలు భారత్ బందునకు మద్దతు ప్రకటించాయి. అదే విధంగా ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్, ఏఐసీటీయూ తదితర కార్మిక సంఘాలు కూడా భారత్ బందుకు తమ మద్దతును ప్రకటించాయి.
ఫెడరల్ ఫ్రంట్ సాధ్యమేనా?
సీఎం కేసీఆర్ భారత్ బందుకు మద్దతు ప్రకటించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నారని రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలన్ని హర్షం వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది. రాష్ట్ర ప్రయోజనాలకు, దేశ ప్రయోజనాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా ఊరుకునేది లేదన్న విధంగా కేసీఆర్ ముందుకు వెళ్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు సంభదించి కార్యాచరణకోసం దేశమంతా తిరిగి అందరితో మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
నల్లబంగారం ఎవరి సొత్తు?
ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ముఖ్యమైన మరో విషయం ఉంది. తెలంగాణకు గుండెకాయ లాంటి సింగరేణి ఇటీవల తవ్వకానికి సిద్ధం చేసుకున్న ఆరు బొగ్గు బ్లాకులను ఉపసంహరించుకున్నది. జూలై 20వ తేదిన జరిగిన సింగరేణి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో బొగ్గు గనుల కేటాయింపు తమకు కేంద్రం ఇవ్వని కారణంగా ఈ ఆరు బొగ్గు బ్లాకులను తవ్వే నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు సింగరేణి జారీ చేసిన ఒక లేఖలో పేర్కొంది. అంతర్గతంగా తమ అధికారులకు పంపించిన ఈ లేఖలో కేవోసీ మూడవ ప్రాజెక్టు, కేకే ఆరు ఇనెక్లైన్, కేటీకే ఐదు విస్తరణలో భాగంగా లాంగ్ వాల్ ప్రాజెక్టు, రాంపూర్ షాఫ్ట్ బ్లాక్, శ్రావనపల్లి ఓపెన్ కాస్టు ప్రాజెక్టు, చింతగూడ ఓపెన్ కాస్టు ప్రాజక్టెలను ఉపసంహరించుకున్నది. కేంద్ర ప్రభుత్వం దేశంలోని 500 బొగ్గు బ్లాకులను వేలంవేసి పెట్టుబడిదారులకు వేలం ద్వారా అప్పజెప్పే ప్రక్రియను ప్రారంభించింది. ఇందులో 41 బొగ్గు బ్లాకులకు పీఎం నరేంద్రమోది స్వయంగా వేలం వేసే ప్రక్రియకు స్వీకారం చుట్టారు. మొత్తం దేశంలోనే బొగ్గు బ్లాకులకు ఇకపై వేలం ద్వారానే కేటాయింపు ఉంటుంది. ప్రభుత్వరంగ సంస్థలైన సింగరేణి అటు కోల్ ఇండియా సైతం వేలంలో పాల్గొనాల్సిందే. గతంలో మాదిరి ప్రభుత్వ రంగ సంస్థలకు దరఖాస్తు చేసుకున్న వెంటనే బొగ్గు బ్లాకుల కేటాయింపు ఉండదు. ఈ కారణాల చేత సింగరేణి అటు కోల్ ఇండియా బొగ్గు గనుల విస్తరణ భవిష్యత్తుకు ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే ఈ విధానాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు జార్ఖండ్, మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రులు వ్యతిరేకించారు. ఈ విషయంపై కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర విధానాలను ఆయన ఎండగట్టే పనిలో ఉన్నారు. బొగ్గు గనలు కేటాయింపు అనేది రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన విషయం. దీనిపై కూడా గట్టి పోరాటమే చేసే అవకాశం ఉంది.
బీజేపీతో సమరం సరైందేనా?
రాష్ట్రానికి రావాల్సిన నిధులు పలు ప్రాజెక్టుల విషయంలోను అన్ని రాజయపక్షాలతో కలిసి కేంద్రంతో పోరాటానికి సీఎం సిద్ధమవుతున్నారు. వామపక్షాలతో సహా, కాంగ్రెస్ తదితర పార్టీలు కూడా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన విషయంపై అటు కార్మిక, కర్షక వ్యతిరేక చట్టాలపై కూడా జరగుతున్న మహోద్యమంలో భాగస్వామ్యం కావడంతో ఈ నెల 8న జరిగే భారత్ బంద్ తెలంగాణలోనూ సంపూర్ణంగా విజయవంతమయ్యే అవకాశాలున్నాయి. ఏది ఏమైనా సీఎం కేసీఆర్ బీజేపీ ప్రభుత్వంపై ప్రజల దన్నుతో తన గన్నును ఎక్కు పెడుతున్నారని చెప్పుకోవచ్చు.