- జీహెచ్ఎంసీ ఎన్నికలను వాయిదా వేయించేందుకు కుట్ర
- ప్రార్థనా మందిరాల వద్ద అలజడి సృష్టించేందుకు యత్నం
- అరాచక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న కేసీఆర్
హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో అరాచక శక్తులు మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్న అల్లరి మూకలను ఉపేక్షించొద్దని పోలీసు ఉన్నతాధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. అలాంటి శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండి అణచివేయాలని సీఎం అన్నారు. కుట్రలో భాగంగా కొందరు సామాజిక మాధ్యమాలలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం అన్నారు. ఫొటోలు మార్ఫింగ్ చేసి ప్రజలను ఏమార్చాలని చూస్తున్నారని అన్నారు. కొన్ని సంఘ విద్రోహ శక్తులు ఘర్షణలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నాయని అన్నారు. ప్రార్థనా మందిరాల దగ్గర వికృత చేష్టలతో మత విద్వేషాలు రెచ్చగొట్టాలన్నది వారి పన్నాగంగా కనిపిస్తోందని అన్నారు.
మనుగడ కోసం విద్రోహశక్తుల ఆరాటం
తీవ్ర నిరాశ, నిస్పృహలో ఉన్న సంఘ విద్రోహ శక్తులు తమ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై సీఎస్, డీజీపీ, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలు, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అరాచక శక్తుల కుట్రల విషయమై ప్రభుత్వానికి ఖచ్చితమైన సమచారం ఉందన్నారు. హైదరాబాద్ లో , రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడడమే అత్యంత ప్రధానమన్న అభిప్రాయాన్ని సీఎం వ్యక్తం చేశారు. సామరస్య వాతావరణాన్ని దెబ్బతీసి రాజకీయ లబ్ధిపొందేందుకు యత్నిస్తున్నారని అలాంటి సంఘ విద్రోహ శక్తులను ఉక్కుపాదంతో అణచివేయాలని పోలీసు శాఖను ఆదేశించారు.
Also Read: గ్రేటర్‌లో గెలుపెవరిది?
పోలీసులకు స్వేచ్ఛ
జీహెచ్ఎంసీ ఎన్నికలు వాయిదావేయించేందుకు ఉద్వేగ పూరిత ప్రసంగాలు చేసి ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తున్నారని కేసీఆర్ అన్నారు. అరాచక శక్తులను అణచివేసి శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సంఘ విద్రోహ శక్తుల ఆగడాలను ఉపేక్షించ వద్దని పోలీసులను ఆదేశించారు.
ఘర్షణలపై పక్కా సమాచారం
జీహెచ్ఎంసీ ఎన్నికలను అడ్డుపెట్టుకుని మత ఘర్షణలకు పాల్పడేందుకు అవకాశం ఉన్నట్లు ఖచ్చితమైన సమాచారం ఉందని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. నగరంలో శాంతి భద్రతలు పరిరక్షిస్తున్న పోలీసులు విధ్వంసకర శక్తులను అడ్డుకునేందుకు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉన్నారని డీజీపీ తెలిపారు. సోషల్ మీడియాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా పోస్టుల పెడుతున్నారని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిపై పోలీసుల నిఘా పెట్టామని అన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం కారణంగా అవాంఛనీయ సంఘటనలు జరిగితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని డీజీపీ హెచ్చరించారు.
Also Read: ఎన్నికల ప్రచారంలో అక్బరుద్దీన్ వివాదస్పద వ్యాఖ్యలు
విద్వేషపూరిత పోస్టులు పెడితే కేసులు
సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్న వారిపై కేసులు నమోదు చేస్తునట్లు డీజీపీ తెలిపారు. ఇప్పటికే 50 కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. రోహింగ్యాల విషయంలో 60 కేసులు నమోదయ్యాయని తెలిపారు. మత ఘర్షణలు జరిపేందుకు ప్రయత్నిస్తున్నవారిపై పోలీసుల నిఘా ఉందని తగు సమయంలో చర్యలు తీసుకుంటామన్నారు. సర్జికల్ స్ట్రైక్ చేస్తామన్న నేతలపైనా కేసులు నమోదు చేస్తామన్నారు డీజీపీ. నగరంలో నేర చరిత్ర ఉన్నవారిపై పోలీసులు ఓ కన్నేసి ఉంచారని డీజీపీ స్పష్టం చేశారు. వదంతులు నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రజలకు పిలుపు
ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ లో చిచ్చు పెట్టడానికి మతతత్వ శక్తులు ప్రయత్నిస్తున్నాయని వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. భావోద్వేగాలు రెచ్చగొట్టే వారి విషయంలో ఆచి తూచి వ్యవహరించాలని యువతను కోరారు. మరోవైపు డీజీపీ మహేందర్ రెడ్డి కూడా అల్లరిమూకల పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నారు. వదంతులు, అసత్య ప్రచారాల గురించి తెలిస్తే సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తెలియజేయాలని న్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో నేతల ప్రసంగాలను నిశితంగా పరిశీలిస్తున్నామని అన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీజీపీ స్పష్టం చేశారు.
Also Read: జీహెచ్ఎంసీ పోరులో మాటల చిటపటలు
ఉపేక్షించం
సామాజిక మాధ్యమాల ద్వారా అశాంతి సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయా పోస్టులు, ఐపీ అడ్రస్ లపై పూర్తి స్థాయిలో నిఘా ఉంచినట్లు డీజీపీ తెలిపారు. రెచ్చగొట్టే పోస్టులను ఫార్వార్డ్ చేయొద్దని ప్రజలకు మహేందర్ రెడ్డి సూచించారు.
Also Read: బీజేపీ ‘గ్రేటర్’ వరాలు