దిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) దిల్లీ పర్యటన జయప్రదంగా సాగింది. శనివారం రాత్రి ప్రధాని నరేంద్రమోదీతో 50 నిమిషాలు సాగిన సమావేశంలోకేసీఆర్ 22 వినతి పత్రాలు సమర్పించారు. భారీ వర్షాలూ, వరదల కారణంగా అపారమైన నష్టం సంభవించిందనీ ఆదుకోవాలనీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు. వరదలు సృష్టించిన నష్టాన్ని తట్టుకోవడానికి రూ. 1,350 కోట్లు సహాయంగా అందించాలని కోరారు.
అంతకు ముందు కేసీఆర్ కేంద్ర పౌరవిమానయానాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురిని కలుసుకొని రాష్ట్రంలో ఆరు విమానాశ్రయాలకు అనుమతి మంజూరు చేయాలని కోరారు. శుక్రవారంనాడు ముఖ్యమంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షానూ, వ్యవసాయశాఖ మంత్రి గజేంద్ర షెకావత్ నూ కలుసుకున్నారు. సిద్ధిపేటలో విమానాశ్రయం నిర్మించే విషయంలో త్వరగా అనుమతులు ఇవ్వాలని మంత్రిని కేసీఆర్ కోరారు. మూడు రోజుల కిందట ప్రత్యేక విమానంలో దిల్లీకి కేసీఆర్ వెళ్ళారు.
పరస్పర అభినందనలు
ప్రధాని సెంట్రల్ విస్టాకు శంకుస్థాపన చేయడంపైన ముఖ్యమంత్రి ప్రశంసించారనీ, దిల్లీలో నిర్మించే టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవనం నిర్మాణం గురించి వివరాలు తెలుసుకొని కేసీఆర్ ని మోదీ అభినందించారనీ ‘నమస్తే తెలంగాణ’ తెలియజేసింది. ‘అభివృద్ది విషయంలో మీ వెంటే ఉంటాం’ అని చెప్పి కేసీఆర్ మోదీకి స్నేహహస్తం చాచారని ‘ఆంధ్రజ్యోతి’ రాసింది. ఇద్దరు ప్రముఖులు ఇతరుల ఎవ్వరూ లేకుండా కలుసుకున్నప్పుడు ఏమి మాట్లాడుకున్నారో తెలిసే అవకాశం లేదు కనుక వివిధ పత్రికలలో ప్రచురించిన అంశాలను ప్రస్తావించుకోవడం రివాజు.
14 మాసాల వ్యవధి తర్వాత కలుసుకున్న ప్రధాని, ముఖ్యమంత్రి
కేసీఆర్ ప్రధానిని 14 మాసాల వ్యవధి తర్వాత కలిశారు. వారి మధ్య సమావేశం 45 నిమిషాలు జరిగిందని ‘ఈనాడు’, 40 నిమిషాలసేపు జరిగిందని ‘సాక్షి’అరగంటపైగా జరిగిందని ‘ఆంధ్రజ్యోతి,’ 50 నిమిషాలపాటు జరిగిందని ‘ది హిందూ’ నివేదించాయి. అరగంటకు తక్కువ కాకుండా 50 నిమిషాలకు మించకుండా వారి సమావేశం జరిగిందని భావించవచ్చు. ఒక ముఖ్యమంత్రి ప్రధానిని కలుసుకోవడానికి 14 నెలల వ్యవధి పట్టడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం. లోక్ కల్యాణ్ మార్గ్ లోని ప్రధాని నివాసానికి కేసీఆర్ రాత్రి ఏడు గంటలకు చేరుకున్నారు. ఇద్దరు నాయకుల మధ్య జరిగిన చర్చల వివరాలను అధికారికంగా విడుదల చేయలేదు.
కాళేశ్వరం లేదా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా
కాళేశ్వరం లేదా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రదానిని ముఖ్యమంత్రి కోరినట్టు తెలిసింది. కోవిడ్ మహమ్మారి కారణంగా రాష్ట్రంలో రాబడి తగ్గిందనీ, లోటు భర్తీకి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలనీ కేసీఆర్ కోరారు. 15వ ఆర్థిక సంఘం, స్వచ్ఛభారత్ మిషన్, అమృత్ పథకాలతో పాటు వివిధ పథకాల కింద రావలసిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపించాలని ప్రధానిని ముఖ్యమంత్రి కోరారు. కృష్ణా జలాల పంపిణీపై కూడా కేంద్రం జోక్యాన్నికోరారు.
మిషన్ భగీరథ, కాకతీయకు నిధులు
ఆదిలాబాద్ లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూనిట్ ను నేషనల్ హైవేస్ అథారిటీ సహకారంతో పునరుద్ధరించాలని కూడా కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. నీతిఆయోగ్ చెప్పినట్టు మిషన్ భగీరథ కు రూ. 1`9,205 కోట్లూ, మిషన్ కాకతీయకు రూ. 5,000 కోట్లు మంజూరు చేయాలని విన్నవించారు. బయ్యారం దగ్గర ఉక్కకర్మాగారం నిర్మించాలనీ, జాతీయ పెట్టుబడుల, ఉత్పత్తుల జోన్ ను జహీరాబాద్ దగ్గర ఏర్పాటు చేయాలని కోరారు. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్, ఇండియాన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ను కూడా తెలంగాణలో నెలకొల్పాలని అభ్యర్థించారు.