Sunday, December 22, 2024

యాదాద్రి పనులపై సీఎం సమీక్ష

హైదరాబాద్: యాదాద్రి ఆలయ పరిసరాలన్నీ భక్తి శ్లోకాలతో ప్రశాంతత ఫరిడవిల్లేలా ప్రకృతి సుందరీకరణ పనులను  తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.  రాబోయే రెండు మూడు నెలల్లో ప్రారంభం చేసుకునే దిశగా యాదాద్రి నిర్మాణం పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల పురోగతి పై సిఎం ప్రగతిభవన్ లో శనివారం నాడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణ, ఓఎస్డీ భూపాల్ రెడ్డి, యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, వైటిడీయే ప్రత్యేక అధికారి కిషన్ రావు, ఈవో గీతారెడ్డి, ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతి రెడ్డి, స్థపతి ఆనంద్ సాయి, తదితర అధికారులు పాల్గొన్నారు.

జాతీయ స్థాయి పుణ్యక్షేత్రంగా యాదాద్రి

 ‘‘భారత దేశంలోని పలు ప్రతిష్టాత్మక పుణ్యక్షేత్రాల స్థాయిలో యాదాద్రి ని తీర్చిదిద్దుతున్నాము. ప్రపంచ వ్యాప్తంగా భక్తులు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్ర ప్రారంభం ఎప్పుడు జరుగుతుందా అని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.  కరోనా పరిస్థితులనుంచి రాష్ట్రం కోలుకుంటున్నది. ఆలయ నిర్మాణాలకు సంబంధించి ఆర్థిక వనరులను ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందచేస్తున్న నేపథ్యంలో పనుల వేగాన్ని పెంచాల్సి వున్నది. మరో రెండు మూడు నెలల్లో యాదాద్రిని ప్రారంభించుకునే దిశగా ఆలయ అధికారులు పూనుకోవాల్సి వున్నది’’ అని ముఖ్యమంత్రి తెలిపారు.

టెంపుల్ టౌన్ నిర్మాణం

యాదాద్రి దేవాలయ ప్రాంగణంతో పాటు టెంపుల్ టౌన్, కాటేజీల నిర్మాణాలు, బస్టాండ్ తదితర పలు నిర్మాణాల పురోగతి గురించి సిఎం చర్చించారు. యాదాద్రి చుట్టు పక్కల పరిసర ప్రాంతాల సుందరీకరణ, లాండ్ స్కేపింగ్ అంశాలు ఎలా వుండాలో ముఖ్యమంత్రి అధికారులకు వివరించారు. గుట్టమీదికి బస్సులు వెళ్ళే మార్గాల నిర్మాణం, విఐపీ కార్ పార్కింగ్ నిర్మాణం, కళ్యాణ కట్ట, పుష్కరిణీ ఘాట్లు , బ్రహ్మోత్సవ, కళ్యాణ మండపాల నిర్మాణాల విషయాలను సిఎం సమీక్షించారు. పోలీస్ అవుట్ పోస్టు, అన్నప్రసాదం కాంప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్స్, నిర్మాణాల పురోగతిని సమీక్షించారు.  క్యూలైన్ కాంప్లెక్స్ నిర్మాణం సహా ఆలయ తుదిమెరుగులకు అయోధ్య, అక్షరధామ్ వంటి పుణ్యక్షేత్రాలకు మెరుగులు దిద్దిన అనుభజ్జులైన శిల్పులతోనే పనులు చేయించాలని అధికారులను సిఎం ఆదేశించారు.

ఆర్టీసీ బస్టాండ్ కోసం 7 ఎకరాలు

ప్రస్థుతం వున్న ఆర్టీసీ బస్టాండ్ డిపో స్థలాన్ని దేవాలయ నిర్మాణ అవసరాలకోసం వినియోగించుకుంటున్న నేపథ్యంలో ఆర్టీసి బస్టాండు నిర్మాణం కోసం గుట్ట సమీపంలో  ఏడు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తున్నట్టు సిఎం ప్రకటించారు. ఈ మేరకు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ఫోన్ చేసి బస్టాండు నిర్మాణ పనులను ఆలయ నిర్మాణ నియమాలను అనుసరించి ఆధ్యాత్మిక ఉట్టిపడేలా నిర్మించుకోవాలని తెలిపారు. అందుకు ఆర్ అండ్ బి మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుని పనులు ప్రారంభించాలన్నారు. 

పదకొండు ఎకరాల స్థలంలో మూడువేల కు పైగా కార్లు పట్టే విధంగా పార్కింగు ఏర్పాటు చేయాలన్నారు. పూర్తిగా వెజిటేరియన్ ఫుడ్ అందించే ఫుడ్ కోర్టులను నిర్మించాలని, ఇందులో సౌత్ ఇండియన్ వంటకాల తో పాటు నార్త్ ఇండియన్,  అంతర్జాతీయ కాంటినెంటల్ భక్తులకోసం వంటకాలను అందించాలన్నారు.

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైద్రాబాద్ కు అత్యంత సమీపంలో ఉండడంతో, యాదాద్రి పుణ్యక్షేత్రానికి ప్రాధాన్యత మరింతగా పెరుగుతుందని, దేశ విదేశాలనుంచి హైద్రాబాద్ కు వచ్చిన టూరిస్టులు భక్తులు యాదాద్రిని దర్శించే అవకాశాలుంటాయని సిఎం తెలిపారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిని రేపిన యాదాద్రి, నిర్మాణాలు పూర్తి చేసుకునే సమయానికి మరింత గా ప్రాచుర్యాన్ని సంపాయించుకుంటదన్నారు. ప్రభుత్వం కూడా యాదాద్రి ప్రాశస్త్యాన్ని భక్తలోకానికి తెలియచెప్పే విధంగా సమాచారాన్ని అందిస్తదని,. ఈ నేపథ్యంలో చివరి అంకం చేరుకున్న నిర్మాణపనులను ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా వుండాలని సిఎం తెలిపారు. ఎక్కడ ఖాళీ జాగ కనిపిస్తే అక్కడ పెద్ద పెద్ద చెట్లతో భవిష్యత్తు పచ్చదనం శోభిల్లే విధంగా మొక్కలను నాటాలన్నారు. వేప, రావి, సిల్వర్ వోక్ తదితర ఎత్తుగా పెరిగే చెట్ల ను నాటాలన్నారు.

గండి చెరువును తీర్చిదిద్దాలని సీఎం ఆదేశం 

యాదాద్రికి చేరువలో వున్న గండి చెరువు ను అత్యద్భుతమైన లాండ్ స్కేపింగుతో వాటర్ ఫౌంటెన్లతో తీర్చిదిద్దాలన్నారు. బ్రహ్మోత్సవాలు తెప్పోత్సవాలను నిర్వహించుకునేందుకు వీలయిన విధంగా సుందరీకరణ పనులుండాలన్నారు. పంచనారసింహ స్వామి మూర్తులను తీర్చిదిద్దాలన్నారు.

 యాదాద్రి టెంపుల్ సిటీలో 250 డోనార్ కాటేజీలను అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దాలని సిఎం అన్నారు. ప్రతి యాభై కాటేజీలకు ప్రత్యేక డిజైన్లతో భక్త ప్రహ్లాద సహా అమ్మవార్ల పేర్లను కాటేజీలకు పెట్టుకోవాలన్నారు.  కుటుంబాలతో దర్శనానికి వచ్చే భక్తజనానికి ప్రశాంతత కల్పించే విధంగా,  యాదాద్రి పుణ్యక్షేత్ర పునర్దర్శనం పట్ల భక్తులకు ఆసక్తి పెరిగే విధంగా విశాలమైన పచ్చని స్థలాల్లో  వాటిని నిర్మించాలన్నారు. ప్రెసిడెన్షియల్ సూట్ నిర్మాణం పై సిఎం ఆరా తీసారు. విఐపి లతో పాటు సామాన్యుల దాకా బసచేసేందుకు వీలయ్యే రీతిలో వివిధ రకాల కాటేజీలను నిర్మించాలన్నారు. వేలాది మంది హాజరయ్యే విధంగా కళ్యాణ మండపాల నిర్మాణాలుండాలన్నారు. పుణ్యక్షేత్ర ప్రాంగణంలో ఆధ్యాత్మిక ప్రసంగాలు,  స్వాములతో ప్రవచనాలను కొనసాగించేందుకు లక్షలాది మంది కూర్చునే విధంగా తొంభై ఎకరాల్లో భక్తి ప్రాంగణాన్ని నిర్మించాలని సిఎం చెప్పారు. దేవాలయ విమాన గోపురాన్ని బంగారు తాపడంతో తీర్చిదిద్దాలన్నారు. రింగు రోడ్డు నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టరును సిఎం ఆదేశించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles