- ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
- అమల్లోకి వచ్చిన కొత్త రెవెన్యూ చట్టం
- డిజిటల్ వేదికపైనే ఇకపై దస్త్రాలు
- భూముల రిజిస్ట్రేషన్ లలో నూతన శకం
- రెవెన్యూ సేవల్లో విప్లవాత్మక మార్పులకు నాంది
నేటి నుంచే ధరణి సేవలు
తెలంగాణ భూ పరిపాలనలో నూతన శకం ఆరంభమైంది. దశాబ్దాల తరబడి భూ రికార్డులలో గందరగోళానికి ప్రభుత్వం ‘ధరణి’ పోర్టల్ తో ముగింపు పలికింది. అడ్డగోలుగా రికార్డులను మార్చే సంస్కృతికి అడ్డుకట్టవేసింది. రైతుల శ్రేయస్సే లక్ష్యంగా కేసీఆర్ తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టం నేటి నుంచి అమల్లోకి వచ్చింది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ కు , యాజమాన్య హక్కులు పొందేందుకు ఇక రోజుల తరబడి ఎదురుచూడాల్సిన దుస్థితి లేదు. నేటి నుంచి ఈ రెండు సేవలు ఏక కాలంలో జరగనున్నాయి. భూమి యజమానికి వెంటనే పట్టాదారు పాసుపుస్తకం కూడా జారీ అవుతుంది. ఎక్కడ నుంచైనా భూముల వివరాలను పరిశీలించుకునే వెసులుబాటు, యాజమాన్య హక్కుల విషయంలో పూర్తి భరోసా ధరణి పోర్టల్ తో సాధ్యం కానున్నాయి. భూముల తగాదాలు, అవినీతి, వివాదాలకు ఇక కాలం చెల్లనుంది.
ఓటీపీతోనే మార్పులు
తెలంగాణ భూ హక్కులు, పట్టాదారు పాసుపుస్తకాల చట్టం 2020 నేటి నుంచి అమల్లోకి వచ్చింది. కాగితాలపై కొనసాగుతున్న దస్త్రాల నిర్వహణ ఇకపై ధరణి పోర్టల్లో డిజిటల్ రూపంలో కొనసాగనుంది. యజమానికి తెలియకుండా భూమి వివరాలు మార్చేందుకు వీలుండదు. యజమానికి చెందిన ఆధార్ కార్డు తో పాటు, సెల్ ఫోన్ కు పంపే వన్ టైమ్ పాస్ వర్డ్ ఆధారంగానే దస్త్రాల్లో మార్పులు జరుగుతాయి. అక్రమంగా భూ యాజమాన్య హక్కులను మార్చడానికి ఇకపై ఆస్కారం ఉండదు. యజమాని వేలిముద్రలతోనే డిజిటల్ దస్త్రాలు తెరుచుకుంటాయి.
రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ లకు ఒకే సాఫ్ట్ వేర్
రిజిస్ట్రేషన్ లు, మ్యుటేషన్ల విధానాన్ని ప్రభుత్వం పూర్తిగా మార్చేవేసింది. రిజిస్ట్రేషన్, రెవన్యూ శాఖల నేవలను ఒకే సాఫ్ట్ వేర్ లో పొందుపరిచింది. దీనివల్ల వ్యవసాయ భూములను మండల తహసీల్దారు కార్యాలయాలలోనే రిజిస్టర్ చేసుకోవచ్చు. గతంలో భూమిపై యాజమాన్య హక్కులు పొందాలంటే మ్యుటేషన్ కోసం గ్రామస్థాయిలో వీఆర్వో నుంచి డిప్యుటీ తహసీల్దారు వరకు కాళ్లు అరిగేలా తిరిగితే తప్ప పని పూర్తయ్యేది కాదు. ధరణి పోర్టల్ తో రిజిస్ట్రేషన్ కాగానే మ్యుటేషన్ కూడా పూర్తికానుంది. సాగు భూమిని వ్యవసాయేతర రంగాలకు వినియోగించుకోవాలంటే నాలా అనుమతులకు అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కొత్త చట్టంతో వాల్టా నిబంధనలు మినహాయించి తప్పనిసరిగా అనుమతి ఇవ్వాల్సిందే.
భూముల సంబంధించి వాటాల పంపిణీ, వారసత్వ బదిలీ చేసేందుకు వ్యవప్రయాసలకు చెల్లుచీటీ పడనుంది. కుటుంబ సభ్యులు తహసీల్దారు సమక్షంలో అంగీకార పత్రం రాసిస్తే ధరణి పోర్టల్లో యాజమాన్య హక్కుల కల్పన వెంటనే పూర్తవుతుంది.
మ్యుటేషన్ ఛార్జీలలో మార్పులు
పురపాలక, నగర పాలక సంఘాలలో మ్యుటేషన్ ఛార్జీలను ప్రభుత్వం సవరించింది. పురపాలక సంఘాలలో రిజస్ట్రేషన్ విలువలో 0.1 శాతం లేదా వెయ్యి రూపాయలు వీటిలో ఏది ఎక్కువగా ఉంటే ఆ మొత్తాన్ని చెల్లించాలి. జీహెచ్ఎంసీ నగర పాలక సంస్థల్లో రిజిస్ట్రేషన్ విలువలో 0.1 శాతం లేదా 3 వేల రూపాయలు ఈ రెండింటిలో ఏది గరిష్ఠంగా ఉంటే అది చెల్లించాల్సి ఉంటుంది. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 570 మంది తహసీల్దార్లను జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.
ధరణి పోర్టల్ ప్రత్యేకతలు
ధరణి పోర్టల్ వల్ల మోసాలకు ఆస్కారం ఉండదు. స్లాట్ బుకింగ్ నుంచి వెరిఫికేషన్ మరియు రిజిస్ట్రేషన్ వరకు పారదర్శకంగా అంతా ఆన్ లైన్ లోనే జరగనుంది. కేవలం పది నిమిషాల్లోనే పట్టాదారు పాసు పుస్తకాలు యజమానికి అందుతాయి. విదేశాల్లో ఏ మూలన ఉన్నా భూముల వివరాలను హక్కు దారుడు ఈ పోర్టల్ ద్వారా తెలుసుకునే సౌకర్యం ఉంది. ఇది దేశంలోనే ఆస్తుల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్ కార్యకలాపాలకు సంబంధించిన తొలి అధికారిక ఆన్ లైన్ పోర్టల్.