- వరద బాధలకు శాశ్వత విముక్తి
- అరాచక శక్తుల పట్ల అప్రమత్తం
- వివేకంతో ఓటు వేయాలని విజ్ఞప్తి
ఎల్బీ స్టేడియంలో జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఓటు వేసేముందు విజ్ఞత ప్రదర్శించాలని పిలుపు నిచ్చారు. ఎలక్షన్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ప్రభుత్వం, పార్టీ నాయకుల పనితీరును బేరీజు వేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం భవిష్యత్ లో అనుసరించే విధానాలను దృష్టిలో పెట్టుకోవాలన్నారు. పనిచేసే నాయకులను ఎన్నుకోవడంద్వారా ప్రజస్వామ్యానికి మంచి జరుగుతుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
2001 నుంచి పదమూడేళ్ళపాటు టీఆర్ఎస్ పార్టీ చేసిన సుధీర్ఘ పోరాటం తరువాత తెలంగాణ రాష్ట్రం కల సాకారమయింది. తెలంగాణ వారు తెలంగాణను పరిపాలించలేరని అపనమ్మకాలు అపోహలు కల్పించారు. వాటన్నిటినీ పచాపంచలు చేస్తూ సుపరిపాలన సాగిస్తున్నామన్నారు. టీఆర్ఎస్ పై అపార నమ్మకంతో అధికారం కట్టబెట్టారు. ప్రజా తీర్పుతో కుల, మత, ప్రాంతీయ భేదాలు లేకుండా పరిపాలన సాగిస్తున్నామని తెలిపారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకంటే భిన్నంగా తెలంగాణ అభివృద్ధికి పాటుపడుతున్నామని కేసీఆర్ అన్నారు.
రాష్ట్ర విభజనతో నీళ్లు రావన్నారు
రాష్ట్ర విభజన జరిగితే నీళ్లు రావన్నారు. కరంటు ఉండదన్నారు. వీటన్నిటినీ అధిగమించామని కేసీఆర్ ప్రకటించారు. దేశంలో దిల్లీ తరువాత హైదరాబాద్ లోనే ఉచితంగా తాగునీరు పంపిణీ చేసేందుకు ముందుకొచ్చామన్నారు. నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచితంగా నీటి సరఫరా చేస్తామని, అపార్ట్ మెంటు వాసులకూ ఈ పథకాన్ని వర్తింప జేస్తామన్నారు. విద్యుత్ వినియోగంలో తెలంగాణలో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయన్నారు..
ఎన్నికలయ్యాక వరద సాయం
వరదల్లో పేదల బాధలను చూసి చలించిపోయానన్నారు కేసీఆర్. ముంపు బాధితులకు ప్రభుత్వం చేస్తున్న 10 వేల సాయాన్ని కొందరు కిరికిరి చేసి సాయాన్ని నిలిపివేశారన్నారు. ఎన్నికల కోడ్ ముగిశాక వరద బాధితులకు యథావిధిగా సాయం అందిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ సహాయం చేయకుండా అడ్డుతగులుతున్నవారిని ‘కొడుకులు’ అంటూ ఆగ్రహంతో సంభోదించారు. ఎంతో బాధతో ఈ మాట అంటున్నానని అంతలోనే సర్దుకున్నారు.
గల్లీ ఎన్నికలకు దిల్లీ నేతలు
వరద బాధితులను ఆదుకునేందుకు రాని నేతలు ఓట్ల కోసం వరదలా వస్తున్నారని విమర్శించారు. గల్లీ ఎన్నికలకు ఢిల్లీ నుంచి వరదలా నేతలు తరలివస్తున్నారని పరోక్షంగా బీజేపీకి చురకలంటించారు. బక్క కేసీఆర్ ను కొట్టేందుకు ఇంతమంది కావాలా అని ప్రశ్నించారు.
గత ప్రభుత్వాల విధానాల వల్లే హైదరాబాద్ ముంపునకు గురవుతోందన్నారు కేసీఆర్. నగరంలోని వరద బాధలకు శాశ్వత విముక్తి కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరమన్నారు. ఇందుకోసం ఏటా 10 వేల కోట్లు కేటాయిస్తామన్నారు. శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రోరైలు పొడిగిస్తామన్నారు. మూసీని గోదావరి నదితో అనుసంధానిస్తామని కేసీఆర్ తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు.
యువతకు అప్రమత్తత అవసరం
విద్వేషాలు రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయన్నారు. అలాంటి వారి పట్ల యువత అప్రమత్తంగా ఉండాలన్నారు. హైదరాబాద్ అరాచక శక్తుల చేతుల్లోకి వెళితే శాంతిభద్రతలు క్షీణిస్తాయని అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు. వివేచనతో భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్ కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.