Sunday, December 22, 2024

సూత్రబద్ధ రాజకీయాలు విస్మరిస్తే అధోగతే

డాక్టర్ గోపరాజు నారాయణరావు

‘ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తే కేంద్రం రాష్ట్రానికి ఏమి ఇచ్చిందో తెలిసి ఉండేది.” అచ్చంగా ఇవే మాటలు కాకపోయినా, హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల సమయంలో ప్రచారానికి వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నమాటలలోని భావం మాత్రం ఇదే. తమ బలమైన ప్రత్యర్థి మీద ఒక నాయకుడు ప్రయోగించే భాష ఇలాగే ఉంటుందని వేరే చెప్పక్కర లేదు. కానీ అమిత్ షాకు ఈ మాట అనే అవకాశం ఇవ్వకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఎన్నికలకు ముందు ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి ఉన్నట్టయితే కేంద్రం ఏమి ఇచ్చిందో తెలియడం సంగతి ఎలా ఉన్నా, జీహెచ్ఎంసీ వాస్తవ పరిస్థితి, జనం నాడి కాస్తయినా తెలిసి ఉండేవని అనిపిస్తుంది.

ప్రజల సమస్యలు తెలిసేవి

కొన్ని ప్రాంతాలు వరదతో తటాకాలను మరిపించిన సంగతీ, వాటిలో కమలాలు వికసిస్తున్న సంగతి కూడా అవగతమయ్యేది. 2016 నాటి జీహెచ్ఎంసీ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితికి 99 స్థానాలు ఉన్నాయి. బీజేపీ బలం నాలుగు స్థానాలే. తాజా ఎన్నికలలో తెరాస బలం 56 డివిజన్లకు పరిమితమైంది. బీజేపీ గెలిచినవి 48 డివిజన్లు. దారుణమైన పతనం, ప్రత్యర్థులు సైతం శ్లాఘించక తప్పని ఘనత ఇందులో కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికలలో రెండు పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం 0.28 శాతమే. చాలామంది విశ్లేషకులు, మజ్లిస్ నాయకుడు అసదుద్దీన్ ఒవైసి చెప్పినట్టు కేవలం నెల రోజుల క్రితం జరిగిన దుబ్బాక ఎన్నికల ఫలితం నగర ఎన్నికల మీద గణనీయంగా ఉందని చెప్పలేం. కానీ ఆ ఫలితం ఎలాంటి ప్రభావం చూపలేదని అనడం కూడా విజ్ఞత అనిపించుకోదు.

దుబ్బాక విజయంతో రెట్టింపైన ఉత్సాహం

నగర బీజేపీ శ్రేణులలో దుబ్బాక ఫలితం రెట్టించిన ఉత్సాహాన్ని నింపింది. నిరాశ, నిస్తేజం వీడి గెలుపు కోసం అహరహం శ్రమించేందుకు దోహదం చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుని దగ్గర నుంచి, పార్టీలో అత్యంత శక్తిమంతుడు అమిత్ షాను, యోగి ఆదిత్యనాథ్ వంటి ప్రముఖుడిని, కేంద్రమంత్రులని రప్పించేందుకు బాటలు వేసిందని నిస్సందేహంగా అంగీకరించాలి. కమలం శ్రేణులను ప్రభావితం చేసిన స్థాయిలో నగర ఓటర్లను దుబ్బాక ఫలితం కదిలించిందని చెప్పడం కష్టమే. అయితే బీజేపీ మీద నగర ఓటర్ల మొగ్గుకు కొన్ని కారణాలు లేకపోలేదు. ప్రధాని నరేంద్ర మోదీ మీద ఆదరణ, రాష్ట్రంలో మారిన నాయకత్వం కూడా కారణాలే.

మనోభావాల ఆధారంగానో, విశ్వాసాల ప్రాతిపదికగానో చిరకాలం ఎన్నికలలో గెలుపు సాధించడం సాధ్యం కాదని ఎన్నికల చరిత్ర చెబుతుంది. భారత స్వాతంత్ర్యోద్యమం ప్రభావం 1952, 1957 నాటి తొలినాటి సాధారణ ఎన్నికల మీద కూడా పరిమితమేనన్నది వాస్తవం. అయోధ్యను చూపించి బీజేపీ ఎన్నికలలో గెలుస్తున్నదన్న వాదన 2014, 2019 ఎన్నికలలో వీగిపోయింది. కొంతమంది ఇప్పటికీ బల్లగుద్ది మరీ చెబుతున్నట్టు బీజేపీ మతవాదాన్ని ఆశ్రయించి నెగ్గుతున్నదని అంటున్నారు. వాస్తవం చూస్తే ప్రత్యర్థి బలహీనత కూడా బీజేపీ విజయాలకు బ్రహ్మాండంగా పని చేస్తున్న సంగతిని గుర్తించి తీరాలి. అలా గుర్తించడానికి నిరాకరిస్తున్న ‘ఉదారవాదులు’, “ప్రగతిశీలురు’, ‘మేధావులు’ దేశంలో చాలామంది ఉన్నారు.

లోపించిన సూత్రబద్ధ రాజకీయం

బీజేపీ ఒక స్పష్టమైన అజెండాతోనే ముందుకు వెళుతున్నదని తెలిసిన మేధావులు కూడా బీజేపీయేతర పక్షాలలో భయానకంగా పతనమైన సూత్రబద్ధ వైఖరి వైఫల్యం గురించి చెప్పకుండా సౌకర్యంగా తప్పించుకుంటూ ఉంటారు. అలా చెప్పడం కూడా బీజేపీకి లాభిస్తుందన్న అనాలోచిత ధోరణే కారణం. కె. చంద్రశేఖరరావులో లోపించింది కూడా సరిగ్గా ఇలాంటి సూత్రబద్ద రాజకీయాలే. ఆయన నాయకత్వ లక్షణాలకీ, ఎత్తుగడలలో ఉన్న నైపుణ్యానికీ; సూత్రబద్ధ రాజకీయాలకీ బొత్తిగా పొంతన కనిపించదు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు, చాలా రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలు ప్రదర్శించిన తడబాటునే, కప్పదాటు వైఖరినే తెలంగాణలో కేసీఆర్ అనుసరించి బీజేపీ ఎదుగుదలకు తానే చోటిచ్చారు. ఇంతకీ కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఇక్కడ తెరాస సహా చాలా రాజకీయ పక్షాలు చిత్రిస్తున్నట్టు బీజేపీ ప్రతికూల, ప్రగతి నిరోధక శక్తా ? అదే అయితే ఎందుకు ఈ అప్రతిహత విజయాలు? అది వేరే సంగతే అయినా సూత్రబద్ధ రహిత రాజకీయాల ఫలితం అందులో ప్రతిఫలిస్తున్నది.

కాంగ్రెస్, కమ్యూనిస్టులు, సోషలిస్టులమని చెప్పుకునే వారి వలెనే తెరాస కూడా తెలంగాణలో సూత్రబద్ద రాజకీయాలను విస్మరిస్తూనే ఎదిగింది. ఆఖరికి ఆ కారణంగానే చతికిలపడింది. బీజేపీ ఆవిర్భావం తరువాత దేశమంతటా చాలా పార్టీల పతనానికి తొలిమెట్టు బుజ్జగింపు ధోరణే. ఆ ధోరణి తెలంగాణలో పరాకాష్టలో కనిపిస్తుంది. కానీ ఇక్కడ బుజ్జగింపు ధోరణికి స్థానిక బీజేపీ నాయకత్వం వేరే కోణం చూపించడంలో విజయవంతమైందని అనిపిస్తున్నది.

ముస్లింల పట్ల తెరాస మొగ్గు

ముస్లింల పట్ల తెరాస ప్రభుత్వం మొగ్గు, బీసీ వర్గాల అవకాశాలకు చిల్లు పెట్టేదిగా తెలంగాణ బీజేపీ నాయకత్వం అభివర్ణిస్తున్నది. ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్ సౌకర్యం అంటే ఆ మేరకు నష్టపోయేది బీసీలేనని బీజేపీ విశ్లేషిస్తున్నది. అసలు హిందువుల మనోభావాలు గుర్తించరాదన్న ధోరణే ఒక దశలో కేసీఆర్ లో కనిపించింది. లేకపోతే హిందూగాళ్లూ బొందూ గాళ్లూ వంటి కటువైన వ్యాఖ్య ఆయన నోటి నుంచి వచ్చేదే కాదు. దీనితో సామాజిక మాధ్యమాలలో విమర్శలు వెల్లువెత్తాయి. మజ్లిస్ తో సంబంధాలే జీహెచ్ఎంసీ ఎన్నికలలో తెరాస అలాంటి ఫలితాలు చూడవలసి వచ్చిందనడానికి ఎన్నో ఉదాహరణలు చూపించవచ్చు. అవన్నీ తెరాస బలహీనతలే కావచ్చు. కానీ బీజేపీకి ఆయుధాలుగా మారాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మజ్లిస్ పాత్ర లేదు. అలాంటి ఉద్యమాలు ఆ పార్టీకి పట్టేవి కావు కూడా. ఉద్యమంలో కేసీఆర్ సుస్పష్టంగా చెప్పిన విషయం.. సెప్టెంబర్ 17ను ఘనంగా నిర్వహించుకోవడం. తెలంగాణ వరకు నిజాం దిగిపోయిన ఆ తేదీ ఎప్పటికి మరచిపోకూడనిదే. ఎందుకంటే, భారతదేశం మొత్తానికి ఆగస్ట్ 15వ తేదీ ఎలాంటిదో, తెలంగాణకు సెప్టెంబర్ 17 అలాంటిదే. కానీ మజ్లీస్ తో చెలిమి కారణంగా కేసీఆర్ ఆ ఉత్సవానికి తెలంగాణలో మంగళం పాడారు. పైగా కర్ణాటక, మహారాష్ట్రలలో ఉన్న పూర్వపు హైదరాబాద్ సంస్థాన భాగాలలో ఆ ఉత్సవాన్ని జరుపుకుంటున్న సమయంలో కేసీఆర్ ఇక్కడ ముఖం చాటేస్తున్నారు. తెలంగాణ సెంటిమెంట్ ను సుస్థిరం చేయడానికి ఉపయోగపడిన వాటిలో సెప్టెంబర్ 17వ తేదీని స్మరించుకోవడం కూడా ఉంటుంది.

పాతబస్తీలో కరెంటు బిల్లులు

పాత బస్తీలో కరెంటు బిల్లులు కట్టకపోయినా, నీటి బిల్లులు కట్టకున్నా, నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపినా చలానాలు రాయడానికి పోలీసులకు గుండె ధైర్యం చాలడం లేదన్నా అందుకు కారణం మజ్లిస్, ఇవేమీ చెల్లించకపోయినా ముస్లిం ఛాతీ ఎత్తుకుని నడుస్తున్నారంటే కారణంగా మజ్లిస్ అంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. అది కొన్ని చానళ్లలో అయినా వచ్చింది. ఈ బకాయిలు వందల కోట్లలో ఉన్నాయని చెబుతూ ఉంటారు. ఇదే అంశం మీద మరొక ప్రముఖ తెలుగు టీవీ చానల్ తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కె. తారకరామారావును అడిగింది. ఆయన సమాధానం చెప్పడానికే అంగీకరించలేదు. తెలంగాణకే కాదు, ఈ దేశానికే ముద్దుబిడ్డ, ఆధునిక భారత చరిత్రలో స్థానం సంపాదించుకున్న పీవీ నరసింహారావు స్మారక చిహ్నాన్ని దమ్ముంటే కూలగొట్టండి అని మజ్లిస్ నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసి వ్యాఖ్యానించినా కేసీఆర్ నుంచి స్పందన రాకపోవడం చర్చనీయాంశం కాకుండా ఉంటుందా? దీనికి కేటీఆర్ సమాధానం చెప్పి ఉండవచ్చు. పీవీ వంటి వ్యక్తిని రోడ్డు మీదకు లాగిన వివాదంలో ఆయన వివరణ చాలదు. తెరాస ప్రభుత్వం పీవీ శతజయంత్యుత్సవాలు జరుపుతున్న సంవత్సరం కూడా ఇదే. అయినా దీనికి తెరాస నుంచి సరైన ఖండన రాలేదు. పీవీ స్మారక చిహ్నం గురించి కూడా అవమానకరమైన వ్యాఖ్యలు చేసి అక్బరుద్దీన్ తెలంగాణ సెంటిమెంట్ మీద తనకున్న గౌరవం ఏపాటిదో చెప్పకనే చెప్పిన సంగతి గుర్తించవద్దా? కానీ ‘సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తాం’ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్య మీద రాద్ధాంతం చేయడానికి తెరాస ఎక్కువ శ్రద్ధ చూపించింది. చిత్రంగా, సర్జికల్ స్ట్రయిక్స్ వ్యాఖ్య మీద నిజానికి పెద్ద రాద్ధాంతం చేయవలసింది మజ్లిస్.

తెరాస భుజాన మజ్లీస్

కానీ మజ్లిస్ బాధ్యతను కూడా తెరాసయే భుజాన వేసుకుని రెట్టింపు ఆవేశంతో సంజయ్ ని విమర్శించే ప్రయత్నం చేసింది. ఆ వ్యాఖ్య మీద మజ్లిస్ దాదాపు మౌనం దాల్చింది. రోహింగ్యాల విషయంలో కూడా ఇలాగే జరిగింది. వారు ఉంటే కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోలేదని మజ్లిస్ కంటే తెరాసయే పెద్ద గొంతుతో విమర్శలకు దిగింది. రోహింగ్యాల ఉనికిని గురించి తెలంగాణ హోంమంత్రి కూడా ఒకటి రెండు సందర్భాలలో ప్రస్తావించిన సంగతిని తెరాస చాలా సౌకర్యంగా విస్మరిస్తున్నది. ముస్లింలందరినీ ఒకే గాటన కట్టే పని ఎవరు చేసినా తప్పే. కానీ దేశంలో, కొంతవరకు ప్రపంచంలో కూడా ఎక్కడ ఉగ్రవాద దాడి జరిగినా, బాంబులు పేలినా హైదరాబాద్ పేరు బయటకు వస్తున్న సంగతిని విస్మరించడం ఎలా? వాస్తవం వేరు. వాస్తవాన్ని నిర్భయంగా చెప్పగలిగే వాతావరణం వేరు. తెరాస అధికారంలో ఉండగా తీవ్రవాద పోకడలకు పోయే వారి మీద స్వేచ్చగా మాట్లాడడం కూడా ఇలాంటిదే.

భైంసాలో మతఘర్షణల మాటేమిటి?

పాతబస్తీ నుంచి అనేక మంది హిందువులు పారిపోయి వచ్చారంటూ బీజేపీ ప్రతినిధులు చేసిన ఆరోపణలను తెరాస ఎందుకు ఖండించలేకపోతున్నది? పాత ఆదిలాబాద్ జిల్లా భైంసాలో మత ఘర్షణలు జరిగినప్పుడు కనీసంగా కూడా అధికార తెరాస ఎందుకు స్పందించలేకపోయింది? వరంగల్ లో ఒక హిందూ పూజారిని ఆలయంలోనే మైనారిటీ మతోన్మాది హత్య చేసినపుడు రాష్ట్ర ప్రభుత్వం, తెరాసల స్పందన లౌకికవాదానికి అనుకూలమైనదని ఎవరైనా అనగలరా? శాంతిభద్రతల పరిరక్షణ అంటే ఒక వర్గం చేసే అఘాయిత్యాల పట్ల మౌనం దాల్చడం కాదు. ఇందులోని అన్ని అంశాలను కూడా జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీజేపీ ముందుకు తీసుకురాలేదు. సాధ్యమైనన్ని మాత్రం ప్రస్తావించింది. అయితే సామాజిక మాధ్యమాల ద్వారా జరిగిన ప్రచారం మైనారిటీల పట్ల ఆ పార్టీ అనుసరిస్తున్న ధోరణి మీద ప్రజలు ఒక అంచనాకు రావడానికి దోహదపడ్డాయి. పలచబడిన తెలంగాణ సెంటిమెంట్ తో తెరాస పక్షపాత వైఖరిని ఆశ్రయిస్తున్న సంగతినీ, దీని ప్రాతిపదికగా బీజేపీ ముందుకు తెస్తున్న వాదాన్ని సామాజిక మాధ్యమం సుస్థిరమయ్యేటట్టు చేయగలిగింది. ప్రత్యేక తెలంగాణ అమర వీరులు కుటుంబాలను గౌరవించడంలో తెరాస వైఖరి బీజేపీకి పెద్ద ఆయుధంగా మారిపోయింది. అంతిమంగా వరదలో పదివేల రూపాయల సాయంలో అవకతవకలు వంటివి తక్షణ కారణాలై తెరాసను గట్టి దెబ్బ తీశాయి.

దాచినా దాగని మజ్లీస్ తో మైత్రి

ఎన్నికల ప్రచార సమయంలో కేటీఆర్, కొందరు మజ్లిస్ నాయకులు పరస్పరం దూషించుకున్నారు. మజ్లిస్ మద్దతు మాకు అవసరం లేదని కేటీఆర్ అన్నారు. వారికి అవసరం లేనప్పుడు మాకూ అవసరం లేదని మజ్లిస్ నేతలు కూడా అన్నారు. కానీ ఇప్పుడు జరిగినదేమిటి? మజ్లిస్ పొత్తు లేకుండా తెరాస మేయర్ పీఠం దక్కించుకుంటుందా? లోపాయికారి బంధం కంటే, ఎన్నికలకు ముందు చేసుకున్న పొత్తు గౌరవప్రదంగా ఉండేది కాదా? కానీ అటు హిందువుల ఓట్లు గంపగుత్తగా బీజేపీకి పోకుండా చూసుకునే వ్యూహంలో మజ్లిస్ ను దూరంగా ఉంచినట్టు నటిస్తున్నది తెరాస. ఇది కేవలం చిదంబర రహస్యం.

కానీ చాలా సందర్భాలలో మజ్లిస్ మా సహజ భాగస్వామి, వారితో కలసి పనిచేస్తాం అని సాక్షాత్తు కేసీఆర్ ఎన్నిసార్లు ప్రకటించలేదు? ఆ సంగతిని మరిపించలేరు కదా ! ఏమైనా, సూత్రబద్ధ రాజకీయాలు చాలా వరకు పార్టీలను రక్షించగలుగుతాయి.

Dr. Goparaju Narayanarao
Dr. Goparaju Narayanarao
Previously worked for Udayam, Varta, Andhra Jyothi, and Sakshi. Now working as Editor, Jagriti (Telugu weekly)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles