Friday, December 27, 2024

వద్దని చెప్పినా మక్కల సాగు : కేసీఆర్ అసంతృప్తి

  • రైతులకు నష్టం జరగరాదనే ప్రభుత్వం కొనుగోలు
  • మక్కల వల్ల గత యాసంగిలో రూ. 845 కోట్లు నష్టం
  • ఈ సారి యాసంగిలో మక్కలు పండిస్తే కొనడం అసాధ్యం

హైదరాబాద్: వరి ధాన్యం కొనుగోలు కోసం గ్రామాల్లో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర చెల్లించి, మక్కలు కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. క్వింటాల్ కు రూ.1,850 మద్దతు ధర చెల్లించి మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తామని, రైతులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. మక్కలకు మద్దతు ధర వచ్చే అవకాశం లేదు కాబట్టి, వర్షాకాలంలో రైతులు మక్కలు సాగు చేయవద్దని ప్రభుత్వం కోరిందని, అయినప్పటికీ రైతులు మక్కల సాగు చేశారని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. వద్దంటే మక్కలు సాగు చేశారని, వాస్తవానికి ప్రభుత్వానికి మక్కలు కొనుగోలు చేసే బాధ్యత లేదని సిఎం అన్నారు. అయినప్పటికీ రైతులు నష్టపోవద్దనే ఏకైక కారణంతో ప్రభుత్వం నష్టాన్ని భరించడానికి సిద్ధపడి మక్కలు కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు కేసీఆర్ వెల్లడించారు.

సేకరణ, రవాణా కింద క్వింటాల్ కు రెండు వేలు

‘‘గత యాసంగిలో 9 లక్షల టన్నుల మక్కలను మార్క్ ఫెడ్ ద్వారా ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసింది. దీనికోసం రూ.1668 కోట్లు ఖర్చు చేసింది. ఆ మక్కలకు బయట మార్కెట్లో ధర లేకపోవడం వల్ల వేలం వేయాల్సి వచ్చింది. దీనివల్ల కేవలం రూ. 823 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. మార్క్ ఫెడ్ కు మొత్తంగా 845 కోట్ల నష్టం వచ్చింది. క్వింటాల్ కు రూ.1,760 చొప్పున ధర చెల్లించి మార్క్ ఫెడ్ మక్కలను కొన్నది. సేకరణ, రవాణా తదితర ఖర్చులన్నీ కలిపి క్వింటాల్ కు రెండు వేల రూపాయలు ఖర్చు అయింది. కానీ వేలంలో వచ్చింది క్వింటాల్ కు కేవలం 1,150 రూపాయలు మాత్రమే. క్వింటాల్ కు 850 రూపాయల నష్టం వచ్చింది. మక్కలకు దేశ వ్యాప్తంగా మార్కెట్ లేకపోవడం వల్ల తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తున్నది’’ అని సిఎం వివరించారు.

కొన్ని జిల్లాలలో స్వల్పంగా మక్కల సాగు

 ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే వర్షాకాలంలో మక్కలు సాగు చేయవద్దని ప్రభుత్వం రైతులను కోరింది. నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, మహబూబాబాద్ తదితర జిల్లాల్లో పసుపుకు అంతర పంటగా కొద్ది పాటి ఎకరాల్లో మక్కలు వేసుకోవాలని సూచించింది. ప్రభుత్వ విజ్ఞప్తిని, వ్యవసాయాధికారుల సూచనలు పాటించకుండా కొంత మంది రైతులు మక్కలు సాగు చేశారు. మక్కలకు మద్దతు ధర రాదని తెలిసినా సాగు చేసి నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. ఎవరూ అడగక ముందే, ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుల భూమలు వద్ద లక్ష కల్లాల నిర్మాణం చేపట్టింది. 2,600 రైతు వేదికలను నిర్మిస్తున్నది. ఇన్ని పనులు చేసిన ప్రభుత్వం రైతులు నష్టపోతుంటే చూస్తూ ఉండలేక మక్కలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది’’ అని ముఖ్యమంత్రి ప్రకటించారు.

మార్క్ ఫెడ్, వ్యవసాయశాఖ, పౌరసరఫరాల శాఖ సమన్వయంతో మక్కల కొనుగోళ్లు చేపట్టాలి. యాసంగిలో ఎట్టి పరిస్థితుల్లో మక్కలు సాగు చేయవద్దని రైతులను మరోసారి కోరుతున్నా. ఇంత చెప్పినా సరే, మళ్లీ ఎవరైనా మక్కలు సాగు చేస్తే ప్రభుత్వ బాధ్యత లేదు. యాసంగిలో పండే మక్కలను ప్రభుత్వం కొనుగోలు  చేసే అవకాశాలు లేవు’’ అని సిఎం స్పష్టం చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles