- ఉద్యోగులకు 30శాతం ఫిట్‌మెంట్
- శాసన సభలో పీఆర్సీపై కేసీఆర్ ప్రకటన
- సంతోషం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు
ఉద్యోగులపై తెలంగాణ సీఎం కేసీఆర్ వరాల కురిపించారు. గత కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న పీఆర్సీ పై బడ్జెట్ సమావేశాల్లో సీఎం శుభవార్త చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్ పెంచుతున్నట్లు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా వేతనాలు పెంపు వర్తిస్తుందని స్పష్టం చేశారు.
మొత్తం తొమ్మిది లక్షల 17 వేల మందికి వేతనాల పెంపు వర్తిస్తుందని తెలిపారు. త్వరలోనే ఉద్యోగులకు ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇక ఉద్యోగుల వయోపరిమితిని 61 ఏళ్లకు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. రిటైర్మెంట్ గ్రాట్యుటీని 12 లక్షల నుంచి 16 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు. 12 నెలల ఎరియర్స్ కలిపి పీఆర్సీ ఫిట్ మెంట్ చెల్లిస్తామన్నారు. వీఆర్ఏలు, ఆశా వర్కర్లు, అంగన్ వాడీలకూ పీఆర్సీ వర్తిస్తుందని కేసీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా టీచర్ల అంతర్ జిల్లాల బదిలీలకు పచ్చ జెండా ఊపారు.
పీఆర్సీకి ఎవరు అర్హులు:
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛన్‌దారులు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, విద్యావాలంటీర్లు, సెర్ఫ్ ఉద్యోగులు, కేజీవీబీ సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్, వీఏవో, వీఆర్‌ఏలు.
ఇదీ చదవండి: వాణి విజయం కేసీఆర్ గెలుపే!
పీఆర్సీలో ముఖ్యాంశాలు:
- ఉద్యోగులకు 30శాతం ఫిట్‌మెంట్, పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంపు
- 80శాతం ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియ పూర్తి
- విశ్రాంత ఉద్యోగులు పించన్ పొందే అర్హత వయసు 75 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు కుదింపు.
- ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‌కు నూతన విధివిధానాల రూపకల్పన కోసం స్టీరింగ్ కమిటీ ఏర్పాటు
- 12 నెలల బకాయిలతో కలిపి ఉద్యోగులకు ఫిట్‌మెంట్ చెల్లింపు
- గ్రాట్యుటీ మొత్తాన్ని 12 లక్షల నుంచి 16 లక్షలకు పెంపు
- ఏపీ ఉద్యోగులు స్వరాష్ట్రానికి వెళ్లేందుకు అనుమతి
- కేజీవీబీలలో మహిళా సిబ్బందికి వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు
- భార్యాభర్తలైన ఉద్యోగులు ఒకే చోట పనిచేసేందుకు వెసులుబాటు
- సీపీఎస్ విధుల్లో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షన్
- పదోన్నతుల తర్వాత ఏర్పడే ఖాళీలు త్వరలోనే భర్తీ