- 9 రకాల వసతులు కల్పించనున్న ప్రభుత్వం
- కొత్తగా 23510 భవనాల నిర్మాణం
- ముఖ్యమంత్రి జగన్ ప్రకటన
రాష్ట్రంలో అంగన్ వాడీ కేంద్రాలకు మహర్దశ పట్టనుంది. అంగన్ వాడీ కేంద్రాల రూపురేఖలు మార్చడానికి ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేసిన అనంతరం వాటి అభివృద్ధికి సీఎం జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నాడు నేడు పథకాన్ని అంగన్ వాడీ కేంద్రాలకు వర్తింపచేయనున్నారు. ఇప్పటికే అద్దె భవనాల్లో కొనసాగుతున్న 23510 కేంద్రాలకు కొత్త భవనాలను నిర్మించనుంది. మరో 16,681 కేంద్రాల్లో మరమ్మతులు చేసి ఆధునిక వసతులు కల్పించనుంది. మూడు దశల్లో వీటి నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులకు లక్ష్యం విధించింది. ఏప్రిల్ 1 నుంచి నిర్మాణ పనులు ప్రారంభించనుంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం పూర్వ ప్రాథమిక విద్యను అమల్లోకి తీసుకురానున్న నేపథ్యంలో వాటి పేరును వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా మార్పుచేసింది.
Also Read: వైజాగ్ స్టీల్ ను కాపాడుకోండి
ఒక్కో కేంద్రానికి 6.90 లక్షల నిధుల కేటాయింపు :
అంగన్ వాడీ కేంద్రాల నవీకరణకు ఒక్కో అంగన్‌వాడీ కేంద్రానికి 6.9 లక్షల రూపాయలు కేటాయించనుంది. ఇందులో భాగంగా ప్రతి కేంద్రానికి 9 రకాల కనీస వసతులు కల్పించనున్నారు. ఫ్రిజ్, వాటర్ ఫిల్టర్, ట్యూబ్‌లైట్, ఫ్యాన్లు, ఫర్నిచర్, గ్రీన్ చాక్‌బోర్డు, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్డి, ఆట వస్తువులు, పెయింటింగ్, వంటగది నిర్మాణం, ఇతర మరమ్మతులు చేపట్టనుంది. ఇవి కాకుండా ఉపాధి హామీ చట్టం నిధులతో ప్రహరీని నిర్మిస్తారు. కొత్త అంగన్‌వాడీ కేంద్ర నిర్మాణానికి 14 లక్షలు కేటాయించనుంది. వంటగది, సామగ్రి నిల్వ గది, మరుగుదొడ్డి ఆటస్థలంతో కలిపి 814 చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త భవనాలను నిర్మించనుంది. ఈ వసతులను అన్ని కేంద్రాలలో ఏర్పాటు చేయనున్నారు.
అధికారుల పర్యవేక్షణలో నిర్మాణం:
ఆధునికీకరణ, కొత్త భవనాల నిర్మాణ పనులను అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. ఈ కమిటీకి సచివాలయంలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. స్థానిక అంగన్‌వాడీ కార్యకర్త, సూపర్‌వైజర్, మహిళా సంరక్షణ కార్యదర్శి, వీరితో పాటు అంగన్ వాడీ కేంద్రంలి 2 నుంచి 4 ఏళ్ల వయసున్న ముగ్గురు పిల్లల తల్లులు సభ్యులుగా ఉండనున్నారు. నిర్మాణ పనులను రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ పర్యవేక్షించనుది. నిధులు కూడా గృహనిర్మాణ సంస్థ నుంచి నేరుగా అంగన్‌వాడీ అభివృద్ధి కమిటీ బ్యాంకు ఖాతాలోకే డబ్బులు జమ కానున్నాయి. ఇవి కాకుండా ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో ఉండే 11 వేల కేంద్రా నవీకరణ పనులను విద్యాశాఖ చేపట్టనుంది. వచ్చే విద్యాసంవత్సరం ఆరంభంనాటికి అంగన్ వాడీ కేంద్రాలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను అదేశించారు.
Also Read: ఆంధ్రా యూనివర్శిటీలో కరోనా కరాళనృత్యం