- లే అవుట్ల అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం
- మధ్యతరగతి ప్రజలకు చౌకగా ఇంటి స్థలం
- లాటరీ పద్దతిలో లబ్ధిదారులకు కేటాయింపు
- ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశం
సొంతిల్లు అనేది ప్రతి పేదవాడి చిరకాల వాంఛ. మనదంటూ ఓ ఇల్లు ఉంటే ఎలాగైనా బతకొచ్చనేది సామాన్యుడి ధీమా. పొద్దంతా కష్టపడి తలదాచుకోవడానికి కాస్త చోటుంటే ఎంతో ధైర్యం. ఇలాంటి వారి సొంతింటి కలలను నిజం చేసేందుకు జగన్ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పలు రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో నివసించే మధ్య తరగతి ప్రజలకు గృహ వసతి కల్పించేందుకు మరో కొత్త పథకం తీసుకురాబోతున్నారు.
మధ్యతరగతి ప్రజలకు ఇళ్ల స్థలాలు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రాజీవ్ సృగృహ పేరుతో మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే ఫ్లాట్ లు ఇచ్చేవారు. ఇపుడు ఫ్లాట్లకు బదులు తక్కువ ధరలకే వివాదంలేని క్లియర్ టైటిల్ తో కూడిన ఇండ్ల స్థలం ఇవ్వాలని సీఎం జగన్ యోచిస్తున్నారు. అవకతవకలకు అవకాశం లేకుండా పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వమే లే అవుట్లను అభివృద్ధి చేసి లబ్ధిదారులకు కేటాయించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రైవేటు వ్యక్తుల వద్ద స్థలాలు కొనుక్కుంటున్న వారిలో అనేక భయాలు నెలకొంటున్నాయి. సరైన అవగాహన లేక దళారుల చేతిలో మధ్యతరగతి ప్రజలు మోస లే అవుట్ల అభివృద్ధిని ప్రభుత్వమే చేపడితే అలాంటి ఆందోళనలు ఉండవని జగన్ భావిస్తున్నారు. ప్రభుత్వమే అభివృద్ధి చేసి లాభాపేక్షలేకుండా విక్రయించడం వల్ల తక్కువ ధరకే అందుబాటులోకి రానున్నాయి. పట్టణ గృహ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: ‘వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం’ ప్రారంభించిన సీఎం జగన్
వైఎస్ఆర్ జగనన్న కాలనీలపై ప్రత్యేక శ్రద్ధ
ఇక ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న వైఎస్ఆర్ జగనన్న కాలనీలను మోడల్ కాలనీలు తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు. ఈ కాలనీలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజి వ్యవస్థతో పాటు ఇతర సౌకర్యాలపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ కలెక్టర్లను ఆదేశించారు. లే అవుట్లను అందంగా తీర్చిదిద్దేందుకు వినూత్న ఆలోచనలు చేయాలని సూచించారు. కాలనీలలో బస్ బేలు ఏర్పాటు చేయడంతో పాటు బస్టాపులను సృజనాత్మకంగా తీర్చిదిద్దాలని సూచించారు. పట్టాణాభివృద్ధి సంస్థల పరిధిలో దాదాపు 16 వేలకు పైగా లే అవుట్స్ వచ్చాయని సీఎం అన్నారు. రాష్ట్రంలో 17 వేల రెవెన్యూ గ్రామాలుంటే మరో 17 వేల మోడల్ కాలనీలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ కాలనీలలో పార్కులు, గ్రామ వార్డు సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ లతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఏపీలో 21న ‘శాశ్వత భూ హక్కు`పథకం