- వైభవంగా కామధేను మహోత్సవం
- టీటీడీ, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పూజలు
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా టీటీడీ, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోపూజ మహోత్సవం కన్నులపండువగా జరిగింది. గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ స్టేడియంలో జరిగిన గోపూజ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2679 ఆలయాలలో గో పూజ మహోత్సవం నిర్వహిస్తున్నారు. ఇస్కాన్ అందించిన 108 గోవులకు పూజలు నిర్వహించారు. నరసరావుపేటలో జరిగిన గోపూజలో టీటీడీ ఛైర్మన్ వై. వి సుబ్బారెడ్డి కూడా పాల్గొన్నారు. గోమాత, గో ఉత్పత్తుల గొప్పతనం వివరిస్తూ ఆలయాలలో పోస్టర్లు, బ్యానర్లను టీటీడీ ఏర్పాటు చేసింది. గోపూజ కార్యక్రమంలో ఇస్కాన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇది చదవండి: ఆలయాల పునర్మిర్మాణానికి సీఎం జగన్ భూమి పూజ
సమస్త దేవతా స్వరూపం గోవు. అనాది కాలం నుంచి గోపూజ సంప్రదాయంగా వస్తోంది. సకల దేవతలు, తీర్థాలు గోవులో కొలువై ఉన్నాయని భారతీయుల విశ్వాసం. గో సంరక్షణ, గోపూజ చేయడం వల్ల పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని, దోషాలు ఏమైనా ఉంటే తొలగి మంచి జరుగుతుందని హిందువుల నమ్మకం.
రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడులలో ప్రతిపక్షాలు ప్రభుత్వమే లక్ష్యంగా విమర్శలు కురిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గోపూజ కార్యక్రమంలో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతిపక్షాల దాడులను తిప్పికొట్టేందుకు ఇప్పటికే మతసామరస్య కమిటీలను ఏర్పాటు చేసింది. దాడులపై దర్యాప్తును సిట్ కు అప్పగించింది.
ఇది చదవండి: దేవాలయాల భద్రతపై జగన్ కు స్వామి స్వాత్మానందేంద్ర సూచనలు