- ఓటు బ్యాంకు కోసం ప్రతిపక్షాల పాకులాట
- ప్రధాన ప్రతిపక్షం కోసం బీజేపీ వెంపర్లాట
- టీడీపీ హయాంలో ఆలయాల కూల్చివేతపై మాట్లాడని బీజేపీ, జనసేన
విజయవాడ ప్రకాశం బ్యారేజికి సమీపంలో 9 ఆలయాల పుననిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భూమి పూజ చేశారు. ఉదయం 11.01 నిమిషాలకు కృష్ణానది ఒడ్డున సీతమ్మ పాదాల వద్ద ఆలయాల పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఇంద్రకీలాద్రి చేరుకుని అభివృద్ధి పనులను ప్రారంభించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈకార్యక్రమంలో పలువురు మంత్రులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తొమ్మిది ఆలయాలకు భూమి పూజ:
2015-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 800 లకు పైగా ఆలయాలను కూల్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ 9 ఆలయాలకు మాత్రమే భూమి పూజ చేశారు. వీటిలో రాహు కేతు ఆలయం, ఆంజనేయస్వామి ఆలయం, సీతమ్మ వారి పాదాలు, సీతమ్మ పాదాలకు సమీపంలో దక్షిణముఖ ఆంజనేయ స్వామి దేవాలయం, శనీశ్వర ఆలయం, దుర్గగుడి మెట్ల సమీపంలోని శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం, బొడ్డు బొమ్మ, పోలీస్ కంట్రోల్ రూం సమీపంలో శ్రీ వీర బాబు స్వామి ఆలయం, కనకదుర్గ నగర్ లోని శ్రీ వేణుగోపాల కృష్ణ మందిరం, గోశాల లను నిర్మించనున్నారు.
దుర్గగుడి అభివృద్ధి పనులు:
దుర్గగుడి అభివృద్ధి విస్తరణ పనులను సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. 77 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనుల్లో భాగంగా 8కోట్ల 50లక్షలతో ప్రసాదం పోటు భవనం, 5కోట్ల 60 లక్షలతో మల్లేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణం, 2కోట్ల రూపాయలతో మల్లేశ్వరస్వామి ఆలయ ప్రాకార విస్తరణ, 19 కోట్ల 75 లక్షలతో అన్నప్రసాద భవన నిర్మాణం, 5 కోట్ల 25 లక్షలతో కనకదుర్గ టోల్ ప్లాజా, 6 కోట్ల 50 లక్షలతో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడకుండా మర్మమతులు చేపట్టనున్నారు. ఇందులో 70 కోట్ల నిధులను ప్రభుత్వం సమకూరుస్తుండగా మిగతా 7 కోట్ల రూపాయలను దుర్గ గుడి నిధుల నుంచి వెచ్చించనున్నారు.
ఇదీ చదవండి: దేవాలయాల భద్రతపై జగన్ కు స్వామి స్వాత్మానందేంద్ర సూచనలు
ఆలయాలపై రాజకీయాలు:
రామతీర్థం వద్ద కోదండరాముని విగ్రహాన్ని ధ్వసం చేసిన దురదృష్టకర సంఘటనలపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని ఆయన ప్రభుత్వాన్ని తూర్పారబట్టడంలో చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నేతలు బిజీ అయిపోయారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ క్రిస్టియన్ అని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ చంద్రబాబు ఆయన పార్టీ నేతలు రాజకీయాలను మరింత దిగజార్చారు. విగ్రహాల కూల్చివేత ఘటనలను పదే పదే గుర్తు చేస్తూ సమాజాన్ని మతపరంగా విభజించేందుకు ప్రయ్నత్నిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: రాజకీయాల్లోకి దేవుడ్ని లాగుతారా-సీఎం జగన్ ఆవేదన
బాబు హయాంలో వందలాది ఆలయాల కూల్చివేత:
2015-2019 మధ్య కాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో దేవాలయాలు కూల్చివేసిన ఘటనలను ఆయన మరిచిపోయారని పలువురు విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో 800 లకు పైగా హిందూ దేవాలయాలను కూల్చివేసినట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ గణాంకాలను వెల్లడించారు. రహదారుల విస్తరణ లేదా వాణిజ్య సముదాయాల నిర్మాణం పేరుతో 2015లో 290 దేవాలయాలు, 2016లో 332 దేవాలయాలు, 2017లో 318 ఆలయాలు, 2018లో 267 దేవాలయాలు కూల్చివేసినట్లు గౌతం సవాంగ్ తెలిపారు. తన హయాంలో వందలకొద్దీ దేవాలయాలు నేలమట్టం అయినపుడు పట్టించుకోని చంద్రబాబు రామతీర్థం లేదా తిరుపతిలో జరిగిన ఘటనలను భూతద్దంలో చూపుతూ ప్రభుత్వం పరువు తీసేందుకు, అసత్య ఆరోపణలతో నిందలు మోపేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల నుంచి ప్రజలదృష్టిని మళ్లించేందుకే చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి తన హయాంలో తన ప్రమేయం లేకుండా ఆగంతకులు చేసిన తప్పిదాలను సరిదిద్దేందుకు ముందుకువచ్చారు.
చంద్రబాబు ఆదేశాలతోనే గతంలో ఆలయాల కూల్చివేత:
టీడీపీ హయాంలో స్వయంగా ముఖ్యమంత్రి ఆదేశాలతో కూల్చిన ఆలయాల పట్ల చంద్రబాబుతో పాటు ఆయన ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ గాని, ప్రభుత్వంలో అధికారాన్ని పంచుకుని మంత్రి పదవులను అనుభవించిన బీజేపీ నేతలు గాని నోరుమెదపకపోవడం విడ్డూరంగా ఉంది. గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దేందుకు ఆలయాలను పునర్నిర్మించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రయత్నిస్తున్నారు. ఆలయాల పునర్మిర్మాణానికి ఏపీ ప్రభుత్వం భూమిని కూడా సమకూర్చుతోంది. ముఖ్యమంత్రి గా ఆయన చేస్తన్న పనులను మత పెద్దలు కూడా ప్రశంసించడం విశేషం.
ఓటు బ్యాంకు కోసం ప్రతిపక్షాల పాకులాట:
ఏపీలో పెద్దగా ఉనికిలో లేని బీజేపీ తమ ఓటు బ్యాంకును పెంచుకునేందుకు హిందువుల సానుభూతి పొందటానికి అహరహం ప్రయత్నిస్తోంది. రాబోయే తిరుపతి ఉపఎన్నికల్లో లబ్ధిపొందేందుకు ఇప్పటినుంచే శ్రమిస్తోంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్ష హోదాకోసం టీడీపీతో పోటీ పడుతోంది. రాజకీయాలకంటే ప్రజాసమస్యలపై దృష్టి పెట్టడంద్వారా ప్రజల మన్ననలు పొందేందుకు ప్రయత్నిస్తే ప్రజలు హర్షిస్తారు సముచిత స్థానం కల్పిస్తారు.
ఇదీ చదవండి: ఏపీ మధ్యతరగతి ప్రజలకు సీఎం జగన్ గుడ్ న్యూస్