Sunday, December 22, 2024

‘నేనేమిటి?,’ ‘ఈ విశ్వం ఏమిటి?’

నా సంజాయిషీ

My Confession

————————-

By Leo Tolstoy

———————-

లియో టాల్స్టాయ్

తెలుగు అనువాదం:

డా. సి. బి. చంద్ర మోహన్

డా. బి. సత్యవతీ దేవి

చాప్టర్ – 5

————-

 “బహుశా, నేను కొంత నిర్లక్ష్యం చేశానా? లేక తప్పుగా అర్థం చేసుకున్నానా?” అని నేనెన్నోసార్లు అనుకున్నాను.”  ఈ రకమైన నిరాశ మనిషికి అసహజమేమీ కాదు!” ఈ సమస్యలకు వివరణ — మనిషి పొందిన జ్ఞానం యొక్క అన్ని శాఖల్లోనూ వెతికాను. నీరసంగాను, పని లేక తెచ్చుకున్న ఉత్సుకతతో కాక — బాధాకరంగా (వేదనతో), పట్టుదలతో రాత్రింబగళ్లు చాలా కాలం వెతికి చూశాను ( ఎలాగంటే — నశించిపోయే మనిషి భద్రత కోసం వెతికినట్లు.) నేనేమీ కనిపెట్టలేకపోయాను.

Also read: ఆత్మహత్యవైపు ఆలోచనలు

అన్ని శాస్త్రాల్లోనూ చూశాను. కానీ, నాకు కావలసింది కనిపెట్టలేక పోగా — జ్ఞానంలో జీవితానికి అర్థం వెతికే నాలాంటి వాళ్లందరికీ ఏమీ దొరకలేదని నాకు నమ్మకం ఏర్పడింది. వారు, ఏమీ కనిపెట్టలేకపోగా, స్పష్టంగా అంగీకరించినది (ఏదైతే నన్ను నిరాశపరిచిందో) ఏమిటంటే అది — ‘జీవితం యొక్క అర్థం లేనితనం’. అది ఒక్కటే మనిషి సంశయ రహితంగా తెలుసుకోగలిగినది.

నేను అన్ని చోట్లా వెతికాను . అభ్యసించడంలో నేను గడిపిన జీవితానికి, ఇంకా —  పండిత లోకంతో నాకున్న సంబంధాలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే — జ్ఞానం యొక్క అన్ని శాఖల్లోనూ ఉన్న శాస్త్రజ్ఞులు మరియు పండితులను కలవడానికి నాకు వీలు చిక్కింది. వారందరూ పుస్తకాల్లో ఉన్న జ్ఞానమే కాక, వారి మాటల్లో జ్ఞానం కూడా నాకు చూపారు. జీవితంపై ఈ ప్రశ్నకు సైన్సు  ఏమి చెబుతోంది? అనేది నాకు పూర్తిగా అవగత మయింది.

Also read: జవాబు దొరకని ప్రశ్నలు ఎన్నో!

 ‘జీవితంపై సందేహాలకు సైన్స్ మామూలుగా చెప్పే విషయాల కన్నా ఎక్కువ ఏమీ చెప్పదు’ అనే సత్యం చాలాకాలం నమ్మశక్యం కాలేదు. సైన్స్ తన  అంతిమ ఫలితాలను చాలా ముఖ్యమైనవి అన్నట్లుగా చెప్పే తీరు చూసి, (వాటికి, జీవితం పై నా సందేహాలకు ఏమీ సంబంధం కనపడలేదు.) నేనేదో అర్థం చేసుకోలేకపోయానేమో — అని నాకు చాలా కాలం అనిపించింది. చాలా రోజులు సైన్స్ ముందు భయపడే వాడిని. నా సందేహాలకు, సైన్సు సమాధానాలకు అనుగుణ్యత లేకపోవడం — అనేది సైన్సు తప్పుకాక నా అజ్ఞానం అనుకునేవాడిని. కానీ ఆ విషయం నాకు ఆటా కాదు; వినోదమూ కాదు. జీవన్మరణ సమస్య.’ నా ప్రశ్నలు శాస్త్ర సమతమైనవేనని, అవే జ్ఞానానికి మూలమనీ, నేను  నా ప్రశ్నలతో నిందితుడిని కాదని — ఆ ప్రశ్నలకు సమాధానం ఇస్తానని నటించే సైన్సు మాత్రమే నిందితురాలని’ నేను అసంకల్పితంగా నిర్ధారణకు తీసుకురాబడ్డాను.

నా 50 ఏళ్ల వయసులో నన్ను ఆత్మహుతి అంచులకు తెచ్చిన నా ప్రశ్న — అతి సాధారణమైనది. అమాయక పిల్లవాడి నుండి, వయసు పండిన మేధావి వరకు అందరి మనసుల్లో  తచ్చాడే ప్రశ్నయే! నా అనుభవంతో నేను గ్రహించినది ఏమిటంటే — అది ఒక సమాధానం లేని ప్రశ్న. అది  “నేను ఇప్పుడు చేసే పనికి,(లేక) రేపు చేయబోయే పనికి ఏం వస్తుంది? నా సంపూర్ణ జీవితం నుండి ఏం వస్తుంది?” అని.

అదే ప్రశ్న విభిన్నంగా వ్యక్తపరిస్తే ఇలా ఉంటుంది ” నేనెందుకు బ్రతకాలి, ఏదైనా ఎందుకు కోరుకోవాలి, ఏదైనా ఎందుకు చేయాలి? “

ఇదే ఇంకోరకంగా వ్యక్తపరిస్తే — “అనివార్యమైన మరణం నా కోసం కాచుకొని ఉండి, నన్ను నాశనం చేసేటప్పుడు — ఈ జీవితానికి ఇంకా అర్థం ఏముంటుంది?” రకరకాలుగా వ్యక్తపరిచిన ఈ ప్రశ్నకు సైన్సులో సమాధానం కోసం వెతికాను. నాకు తెలియ వచ్చిందేమిటంటే — రెండు ధ్రువాలు ఉన్న, రెండు అర్థగోళలుగా మానవ జ్ఞానం విభజింపబడింది: ఒకటి ధన ధ్రువం, రెండవది రుణ ధ్రువం. కానీ ఈ ధ్రువాలు రెండింటి దగ్గర కూడా జీవిత ప్రశ్నలకు సమాధానం లేదు.

Also read: నేనూ, నా మిత్రులూ పిచ్చాసుపత్రిలో ఉన్నట్టున్నాం: టాల్ స్టాయ్

సైన్స్ లో ఉన్న ఒక విభాగం పై ప్రశ్ననే గుర్తించలేదు. కానీ దాని స్వతంత్ర ప్రశ్నలకు మాత్రం స్పష్టంగా, ఖచ్చితంగా సమాధానాలు ఇస్తుంది. అది ప్రయోగాత్మక సైన్సుల విభాగం. దాని చిట్టచివర గణితం (మ్యాథమెటిక్స్) ఉంటుంది. ఇంకో విభాగం మాత్రం ప్రశ్నను గుర్తిస్తుంది. కానీ జవాబివ్వదు. అది నైరూప్య శాస్త్రాల విభాగం. దాని చిట్టచివర అధిభౌతిక  (లేక) పార లౌకిక శాస్త్రం ఉంటుంది.

నా యుక్త వయసు మొదలు నుండీ నాకు నైరూప్య శాస్త్రాల మీద ఇష్టం ఉండేది. తరువాత గణితం, ప్రకృతి శాస్త్రం నన్నాకర్షించాయి. నేను నా ప్రశ్న నాకే వేసుకున్నంతవరకూ, ఆ ప్రశ్న నాలో పెరుగుతూ, అత్యవసరంగా నా నిర్ణయాన్ని కోరినంతవరకూ– సైన్స్ చెప్పే నకిలీ జవాబులతో నాకు నేనే సమాధాన పడ్డాను.

ఇప్పుడు ప్రయోగాత్మక గ్రూపులో  నేనిలా అనుకున్నాను: “ప్రతిదీ అభివృద్ధి చెందుతుంది. విభిన్నంగా పెరుగుతుంది. అది సంక్లిష్టతకు, పరిపూర్ణతకు దారితీస్తుంది. ఈ చలనానికి కొన్ని సూత్రాలు ఉంటాయి. నీవు ఆ ‘మొత్తం’ లో ఒక భాగానివి. ఆ ‘మొత్తం’ (విశ్వం) గురించి వీలైనంత తెలుసుకొని, పరిణామ సూత్రాల గురించి తెలుసుకొని — తద్వారా ఈ సమస్త విశ్వంలో నీ స్థానం ఏమిటో తెలుసుకుంటావు. నిన్ను నువ్వు తెలుసుకుంటావు.”  దానితో నేను సంతృప్తి చెందిన సమయం ఒకటుండేదని ఒప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను. సంక్లిష్టమైన ఆలోచనలతో నేను అభివృద్ధి చెందే దశ అది. నా కండరాలు పెరుగుతున్నాయి. బలంగా తయారవుతున్నాయి. నా జ్ఞాపక శక్తి సుసంపన్నమయింది. ఆలోచించే, అర్థం చేసుకునే సామర్థ్యం పెరిగింది. నేను పెరుగుతున్నాను. అభివృద్ధి చెందుతున్నాను. ఈ ఎదుగుదల నాలో చూసుకుని — జీవిత ప్రశ్నలకు విశ్వ సూత్రంతో ఒక పరిష్కారం దొరుకుతుందని నాకు సహజంగానే అనిపించింది. కానీ నా అంతర్గత ఎదుగుదల ఆగిపోయిన స్థితి వచ్చింది. నేను ఎదగటం లేదు. క్షీణిస్తున్నాను అనిపించింది. నా కండరాలు బలహీనమవుతున్నాయి. పళ్ళు రాలిపోతున్నాయి. నాకు అనిపించినది ఏమిటంటే — సూత్రము లేక సిద్ధాంతము ఏమి విశదీకరించలేదు సరి కదా! — ఎప్పుడూ అటువంటిది లేదు ఉండే ఆస్కారం కూడా లేదు — అని.(అది నా జీవితంలో ఒకానొక కాలంలో కనబడింది. దాన్నే నేను జీవన సూత్రం కింద తీసుకున్నాను). నేను ఆ సూత్రం యొక్క నిర్వచనాన్ని చాలా గట్టిగా భావించాను. అంతులేని అభివృద్ధిని సూచించే ఏ సూత్రము లేక సిద్ధాంతము ఉండదని నాకు అర్థమైంది;

“అనంతమైన స్థల, కాలాల్లో ప్రతిదీ అభివృద్ధి చెందుతుంది. పరిపూర్ణమవుతుంది.

సంక్లిష్టమవుతుంది. విభిన్నంగా తయారవుతుంది.” ఈ మాటలన్నీ అర్థరహితం. ఎందుకంటే — అనంతంలో సంక్లిష్టము, సామాన్యమని, ముందుకు, వెనుకకు, బాగుండడము, బాగులేకపోవడము — అనేవి ఉండవు కదా.

Also read: ‘చదువు’  అంటే ..  ఏమిటి?

 ఆపైన “నా కాంక్షలతో నేనేమిటి?” అనే నా సొంత ప్రశ్నకు సమాధానం ఇంతవరకు దొరకలేదు. ఆ శాస్త్రాలన్నీ చాలా ఉత్సాహభరితంగానూ, ఆకర్షణీయంగానూ ఉంటాయని నాకు అర్థమైంది. కానీ జీవిత ప్రశ్నలకు వాటిని అనువర్తింప చేస్తే — స్పష్టంగాను ఖచ్చితంగాను — వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఎంత తక్కువ అనువర్తిస్తే అంత ఎక్కువగా — స్పష్టంగాను ఖచ్చితంగాను ఉంటాయి. ఎంత ఎక్కువగా జీవిత ప్రశ్నలకు సమాధానం ఇవ్వబోతే, అంత ఎక్కువ నిగూఢంగానూ, వికర్షకంగానూ అవుతాయి. జీవిత ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నించే కొన్ని సైన్స్ లోని శాఖలు (ఫిజియాలజీ, బయాలజీ, సైకాలజీ, సోషియాలజీ) చూస్తే, — మనకు ఆలోచనా దారిద్ర్యం, అత్యంత నిగూఢత, సంబంధం లేని వాటికి సమాధానాలు వెతికే సమర్థించలేని నటన, ఇంకా ఇతరులతో నిత్యం వైరుధ్యాలు (చివరకు తనతో తాను కూడా) — ఇవన్నీ కనిపిస్తాయి. జీవిత ప్రశ్నలకు సమాధానాలు వెతకని సైన్స్ శాఖల వైపు చూస్తే — మనిషి యొక్క మేధో శక్తిని మెచ్చుకోకుండా ఉండలేము. కానీ  ఇవి జీవిత ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వవని మనకు ముందే తెలుసు. ఇవి ఆ ప్రశ్నలను అస్సలు పట్టించుకోవు. ఈ సైన్సు శాఖల వారు ఏమి చెప్తారంటే “నువ్వు ఏమిటి? నువ్వు ఎందుకు బ్రతకాలి? అనే వాటికి మా వద్ద సమాధానాలు లేవు; కానీ మీకు కాంతి —  దాని ధర్మాలు, రసాయన సంయోగము, జీవుల అభివృద్ధి సూత్రాలు, దేహస్థితి- వాటి ధర్మాలు, మనసు యొక్క ధర్మాలు, సంఖ్యల గురించి — మాకు స్పష్టమైన ఖచ్చితమైన ప్రశ్నించడానికి వీల్లేని జవాబులు ఉన్నాయి.”

సాధారణంగా — ప్రయోగాత్మక సైన్సులో జీవిత ప్రశ్నల సంబంధం ఈ రకంగా వ్యక్తీకరించబడుతుంది — ప్రశ్న: “నేనెందుకు బ్రతకాలి?” సమాధానం: “ఒక అనంతమైన స్థలంలో అనంతమైన కాలంలో అనంతమైన సూక్ష్మ అణువులు — అనంతమైన సంక్లిష్ట పద్ధతిలో వాటి రూపాలు మార్చుకుంటాయి. మీరు గనక ఈ ఉత్పరివర్తనాల ధర్మాలు అర్థం చేసుకుంటే — మీరు

ఎందుకు ఈ భూమి మీద జీవిస్తున్నారో అర్థం అవుతుంది.”

 నైరూప్య శాస్త్రం విషయంలో నేను ఈ విధంగా అనుకున్నాను. “మనకు దారి చూపే ఆధ్యాత్మిక సూత్రాలు, ఆదర్శాల మీద మానవ సమాజం బ్రతుకుతుంది. ఇంకా, అభివృద్ధి చెందుతుంది. ఆ ఆదర్శాలు — మతాల్లో, విజ్ఞాన శాస్త్రాల్లో, కళల్లో, ప్రభుత్వ రూపాల్లో వ్యక్తీకరించ బడతాయి. ఆ ఆదర్శాలు ఇంకా ఇంకా ఉన్నతమవుతాయి. మానవ కోటి అత్యున్నత సంక్షేమం వైపు పురోగమిస్తుంది. నేను మానవకోటిలో ఒక భాగాన్ని. అందుచేత, మానవ కోటి ఆదర్శాలను గుర్తించడం, అవగాహన చేసుకోవడం, వాటిని ముందుకు తీసుకుపోవడం — అనేది నా వృత్తి.” నా మనసు దుర్బలంగా ఉన్న కాలంలో నేను పైదాంతో సంతృప్తి చెందాను. కానీ జీవిత ప్రశ్న నాకు స్పష్టంగా కనబడిన వెంటనే ఆ సిద్ధాంతాలన్నీ ఎగిరిపోయేవి. మానవకోటిలో ఒక చిన్న భాగాన్ని మాత్రమే పరిశీలించి, గ్రహించిన సారాంశాలను (మోసపూరిత అస్పష్టతతో) అందరికీ చెందే సారాంశాల కింద చలామణి చేసే ఈ రకమైన  సైన్సుల గురించి మాట్లాడడం అనవసరం; మానవ కోటి ఆదర్శాలు ఏమిటి? అనే విషయంపై పరస్పర వైరుధ్యాలు గల వివిధ వ్యక్తుల గురించి చెప్పాల్సిందేముంటుంది? విచిత్ర మేమిటంటే — “నేనేమిటి?”, “నేనెందుకు బ్రతుకుతున్నాను?”, ” నేనేం చేయాలి?” అనే ప్రశ్నలకు సమాధానం రాబట్టాలంటే “మొత్తం జీవితం అంటే ఏమిటి?” అనే ప్రశ్న ముందు వేసుకోవాలి (ఈ ప్రశ్నకు సమాధానం ఆ మనిషికి తెలియదు. ఈ జీవితంతో మనిషి పరిచయం — చిన్న భాగంతోనే. అదీ చాలా తక్కువకాలం). మనిషి తాను ఏమిటో తెలుసుకోవాలంటే — అతను ఈ విచిత్రమైన మానవకోటి గురించి ముందుగా అర్థం చేసుకోవాలి (ఈ మానవ కోటిలో అతనితో పాటు ఇంకా — ఒకరినొకరు అర్థం చేసుకోలేని మనుషులు చాలామంది ఉంటారు.)

ఒకానొక సమయంలో ఇదంతా నేను నమ్మానని ఒప్పుకుంటున్నాను (confess). నా చపల చిత్తాన్ని సమర్థిస్తూ (తరచూ మనసు మార్చుకునే గుణం) నాకు ఇష్టమైన ఆదర్శాలు కలిగిన రోజులవి. నా మనసు మార్చుకునే గుణమే — మానవ కోటి సిద్ధాంతం అనే సూత్రాన్ని తయారు చేసే పనిలో మునిగి ఉన్న సమయం అది. కానీ జీవిత ప్రశ్న నా మనసులో స్పష్టంగా మెదలుగానే పై సమాధానం మట్టిలో కలిసిపోయేది. నాకు అర్థమైంది ఏమిటంటే — ప్రయోగాత్మక సైన్సుల్లాగానే నిజమైన సైన్సులు, పాక్షిక శాస్త్రాలూ  కూడా వాటి సామర్థ్యాన్ని మించి ఈ జీవిత ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాయి. ఈ సైన్సు విభాగంలో బాగా విస్తరించిన శాస్త్రాలు చాలా ఉన్నాయి. అవి అనేక అసంబద్ధ ప్రశ్నలకు ఇవ్వటానికి ప్రయత్నిస్తాయి. ఆ రకమైన పాక్షిక శాస్త్రాలు (ఉదా: చట్టం,న్యాయ సంబంధిత, సామాజిక — చారిత్రిక శాస్త్రాలు) సమస్త మానవ కోటి జీవిత ప్రశ్నలకు తమదైన పద్ధతిలో సమాధానాలు ఇస్తున్నట్లు కనిపిస్తాయి. మనిషి యొక్క ప్రయోగాత్మక విజ్ఞానం విషయంలో లాగానే — నిజాయితీగా విచారణ చేసే మనిషి ఈ క్రింది సమాధానాలతో సంతృప్తి చెందడు.

“అనంతమైన స్థలంలో, అనంతకాలంలో, సంఖ్యాకమైన పరమాణువుల సంక్లిష్ట ఉత్పరివర్తనాల గురించి అధ్యయనం చెయ్. అప్పుడే నీ జీవితం నీకు అర్థం అవుతుంది.” అలాగే — నిజాయితీ గల మనిషి ఈ క్రింది సమాధానంతో కూడా సంతృప్తి చెందడు: “తుది, మొదలు తెలియడానికి వీలు లేని, దాని గురించి ఒక చిన్న భాగం కూడా తెలియని — మానవ కోటి యొక్క మొత్తం జీవితం అధ్యయనం చేస్తే — నీ జీవితాన్ని నీవు అర్థం చేసుకోగలవు.” ప్రయోగాత్మక, పాక్షిక శాస్త్రాల్లాగానే ఈ పై పాక్షిక శాస్త్రాలు ( న్యాయ, సామాజిక, చారిత్రక), (అసలు సమస్యల నుండి దూరంగా జరిగితే) — అస్పష్టతలతోనూ, అసంబద్ధతతోను, బుద్ధి మాంద్యంతోనూ నిండిపోతాయి. ప్రయోగాత్మక సైన్సుతో సమస్య ఏమిటంటే — భౌతిక దృగ్విషయాలలో క్రమబద్ధమైన కార్యకారణ సంబంధం. ప్రయోగాత్మక సైన్సు అర్థం లేనిదిగా అవ్వాలంటే — దానికి అంతిమ కారణం ఏమిటి అనే ప్రశ్న వేసుకుంటే చాలు. నైరూప్య శాస్త్రం సమస్య ఏమిటంటే — జీవితం యొక్క ప్రధాన సారాంశాన్ని గుర్తించడం. పర్యవసాన దృగ్విషయాలు అన్వేషిస్తే చాలు (సామాజిక, చారిత్రక దృగ్విషయాలు) — ఇది కూడా అర్థరహితమవుతుంది.

తన అన్వేషణలో అంతిమ కారణం అనే ప్రశ్న తీసుకుని రాకపోతే — ప్రయోగాత్మక శాస్త్రం సానుకూల జ్ఞానాన్ని ఇస్తుంది. ఇంకా మానవ మేధ యొక్క గొప్పతనాన్ని ప్రదర్శిస్తుంది. దానికి విరుద్ధంగా — దృగ్విషయాల పర్యవసానంగా ఏర్పడే కారణాలను ప్రక్కన పెడితే,  ఇంకా, మనిషిని అంతిమ కారణానికి సంబంధించి పరిగణిస్తే మాత్రమే నైరూప్య  శాస్త్రం ఒక సైన్స్ అనిపించుకుంటుంది. మానవ మనసు యొక్క గొప్పతనాన్ని ప్రదర్శిస్తుంది. ఒక గోళం యొక్క ధ్రువంలాగా ఈ సైన్సు ప్రభావిత రంగంలో — అధి భౌతిక శాస్త్రము లేదా తత్వశాస్త్రము ఉంటుంది. సైన్సు స్పష్టంగా ప్రశ్నలు వేస్తుంది: “నేనేమిటి, ఇంకా ఈ విషయం ఏమిటి? నేనెందుకు ఉనికిలో ఉన్నాను? విశ్వం ఎందుకు ఉనికిలో ఉంది?” అది ఉనికిలో ఉంది కాబట్టి అదే రీతిలో దాని జవాబు ఉంటుంది. నాలోనూ, ఉనికిలో ఉన్న వాటన్నింటిలోనూ ఉన్న జీవిత సారాన్ని తత్వవేత్త — ” భావం ” ( లేదా)”  పదార్థం ” (లేదా) “ఆత్మ,” లేదా “చైతన్యం.” ఏ పేరుతో పిలిచినా గాని వాటి అర్థం ఒక్కటే; అది ఏమిటంటే ‘ఈ సారం ఉనికిలో ఉంది. నేను కూడా ఈ సారంలో ఒకడినే; ‘ కానీ, అతడు (తత్వవేత్త) ఖచ్చితమైన మేధావంతుడైతే ఎందుకని అతనికి తెలియదు, ఎందుకని అతడేమీ చెప్పడు? నేనడుగుతాను: ఈ సారం ఎందుకు ఉనికిలో ఉండాలి? ఇది (సారం) ఉంది; ఇక ముందూ ఉంటుంది — అనే సత్యం నుండి ఏం జరుగుతుంది? తత్వశాస్త్రం జవాబు మాత్రమే ఇవ్వదు. దానికదే ఈ ప్రశ్న వేసుకుంటుంది. అది నిజమైన తత్వశాస్త్రమైతే — దాని శ్రమ అంతా ప్రశ్నను స్పష్టంగా వేయటానికి ప్రయత్నించడంలోనే ఉంటుంది. తత్వశాస్త్రం — ఖచ్చితమైన జవాబు రాబట్టడంలో గట్టిగా ఉంటే, పై ప్రశ్నకు సరైన జవాబు రాదు: ఎలాగంటే — ” నేనేమిటి? ” ” ఈ విశ్వం ఏమిటి?” అనే వాటికి “అంతా నువ్వే  మరియు  శూన్యం ” అని జవాబు రావచ్చు. “ఎందుకు? ” అనే ప్రశ్నకు మాత్రం ” నాకు తెలియదు. ” అని జవాబు వస్తుంది.

ఈ తత్వశాస్త్ర సమాధానాలను ఎటు నుంచి ఎటు తిప్పినా గాని — నాకు ‘ జవాబు ‘  అనేది ఎప్పటికీ రాదు. స్పష్టమైన ప్రయోగాత్మక సైన్సుల గ్రూపులో లాగా జవాబు నా ప్రశ్నకు సంబంధించింది కాకపోవడం వల్ల కాదు! ఇక్కడ నా మానసిక శ్రమనంతా ధారపోసినా గానీ — జవాబు రాదు. జవాబు రాకపోగా — అదే ప్రశ్న ఇంకా క్లిష్టమైన రూపంలో మనకు వస్తుంది!

Also read: నా సంజాయిషీ

——-   ——–  ——-

Dr. C. B. Chandra Mohan
Dr. C. B. Chandra Mohan
మనుషుల్నీ, జీవితాల్నీ, సాహిత్యాన్నీ ప్రేమించేవాళ్ళు మంచి రచయితలు కాగలుగుతారు. ఇన్నిమంచి లక్షణాలూ పుష్కలంగా ఉన్న అరుదైన రచయిత డాక్టర్ సీబీ చంద్రమోహన్. మొబైల్ 9440108149

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles