- ఇంకా పూర్తి కావలసి ఉంది
- 2022నాటికి పూర్తి చేస్తామని వాగ్దానం
- ప్రధాని తలపెట్టిన ప్రాజెక్టు అవరోధాలు ఉంటాయా?
పరమ పవిత్ర గంగానదిని ప్రక్షాళన చేసి కాలుష్యరహితంగా తీర్చిదిద్ది, పవిత్రతను కాపాడుతూ గంగకు పూర్వ వైభవం తేవాలనే సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘నమామి గంగా ప్రాజెక్టు’ ను 2014లో నిర్మాణం చేశారు. ఆ యజ్ఞం జరుగుతోంది. ఆశించిన ఫలితాలను ఇంకా రాబట్టాల్సివుంది. ఇది కోట్లాది రూపాయల ఖర్చుతో కూడిన వ్యవహారం. ప్రారంభంలో మొత్తం 20వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టు బడ్జెట్ గా అంచనా వేశారు. ఈ సంకల్పం సంపూర్ణంగా సాకారమయ్యే నాటికి అనుకున్న అంచనాలు మారిపోవచ్చు. ఈ క్రతువులో భాగంగా తాజాగా ఒక ఆసక్తికరమైన ప్రకటన వెలువడింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అందిన వివిధ బహుమతులను వేలానికి వేసి, వచ్చే సొమ్మును ‘నమామి గంగా మిషన్ ‘ కు వెచ్చించబోతున్నారు. ఇది ఎంతో అభినందించాల్సిన ఆలోచన. రాజకీయవేత్తలు, సినిమా సెలబ్రేటీస్, క్రీడాకారులు, వ్యాపార, పారిశ్రామికవేత్తల నుంచి ప్రధానికి అందిన బహుమతులు సుమారు 1200కు పైగా ఉండవచ్చునని సమాచారం. ఈ నెల 17 నుంచి ప్రారంభమయ్యే ఈ వేలం అక్టోబర్ 2 వ తేదీన ముగియనుంది. పోర్టల్ ద్వారా వేలం నిర్వహించనున్నారు. ఈ కానుకల ప్రారంభ ధర 100 రూపాయల నుంచి 10 లక్షల వరకూ ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని నేషనల్ గ్యాలరీ అఫ్ మోడ్రన్ ఆర్ట్ సంచాలకుడు అద్వైత గదా నాయక్ వెల్లడించారు.
Also read: నిద్ర ఒక యోగం, విజయానికి సోపానం
సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
జాతి హితమైన గంగా ప్రాజెక్టుకు ఎవరి పరిధిలో వారు చేయూతను అందించడంలో ఈ తాజా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. భారతదేశ చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మిక, ఆర్ధిక, సామాజిక సర్వ వ్యవస్థలకు గంగానదితో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. గంగను మనం ఎంత బాగా కాపాడుకుంటే మనకు అంత క్షేమదాయకం. హైందవ ఆచారల ప్రకారం పావన గంగలో ఒక్కసారి స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలు హరిస్తాయని ప్రజలకు అచంచలమైన విశ్వాసం. స్వచ్ఛమైన గంగలో మునిగితే, ఆ నీరును తాగితే ఎంతో ఆరోగ్యం లభించే వాతావరణం మొన్న మొన్నటి వరకూ ఉండేది. ఆచారంతో పాటు గొప్ప ఆరోగ్య శాస్త్ర రహస్యాలు అందులో దాగివున్నాయి. ఇబ్బడిముబ్బడిగా పెరిగిన జనాభా, పరిశ్రమలు, అనేక రూపాల్లో స్వచ్ఛమైన గంగ కాలుష్య కాసారంగా మారింది. ముఖ్యంగా వారణాసిలో. ఒకప్పుడు కుంభమేళా సమయంలో లక్షలాదిమంది భక్తులు గంగలో మునిగి తేలినా స్వచ్ఛతకు బిందువంత కాలుష్యం కూడా ఎన్నడూ దరిచేరలేదు. లక్షల సంవత్సరాల పరిణామ క్రమంలో, మానవ మనుగడలో, వేల వత్సరాల నాగరిక జీవనంలో గంగ, వారణాసి ఎటువంటి కాలుష్యం లేక పచ్చగా కళకళలాడాయి. మాయామయమైన ఆధునిక నాగరిక ప్రయాణంలో ఆ రూపు రేఖలన్నీ మారిపోయాయి. పారిశ్రామిక విప్లవం ప్రభవించిన కాలంలో వ్యవసాయక్షేత్రం కూడా మసకబారిపోయింది. రద్దీ పెరిగిన నేపథ్యంలో మురుగు నీరు రోజుకు సుమారు 100 కోట్ల లీటర్లు గంగలో కలుస్తాయని అంచనా వేస్తున్నారు. దీనిని నివారించడానికి గత ప్రభుత్వాలు అప్పుడప్పుడూ చేపట్టిన చర్యలకు రాబట్టిన ఫలితాలు నామ మాత్రమే.
Also read: పోలవరం కుంటినడక ఎవరి శాపం?
‘నమామి గంగా మిషన్’ కు ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు
ఈ నేపథ్యంలో గంగను కాపాడాలనే నినాదంతో ఉద్యమాలు ఎగసి పడ్డాయి. సాధువులు, సద్గురువులు, సామాజిక ఉద్యమకారులు మొదలు సామాన్యుల వరకూ ఈ ఉద్యమంలో మమేకమయ్యారు. వీరితో విభిన్న రంగాలవారు కలసి నడిచారు. కానీ ప్రభుత్వాలు కదిలి రాలేదు. దేశంలోని సుమారు 40 శాతం జనాభా గంగపైనే ఆధారపడ్డారు. దాదాపు 11 రాష్ట్రాలు ఈ నదీ ప్రాంతాలుగా ఉన్నాయి. కోట్లాదిమంది ప్రజల జీవకర్ర ఈ నదీలలామ. సుమారు 29 ముఖ్య పట్టణాలు, నగరాలు ఈ పరీవాహక ప్రాంతంలో ఉన్నాయి. ‘నమామి గంగా మిషన్’ ప్రారంభమై ఎనిమిదేళ్లు పూర్తయింది. ఎన్ ఎం సీ జి ( నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగ) లో భాగంగా 341 రకాల ప్రాజెక్టులను రూపకల్పన చేశారు. ఇందులో సుమారు సగం పూర్తయినట్లు సమాచారం. 2014 జూన్ లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు 2022 కల్లా పూర్తి చేయాలన్నది భారత ప్రభుత్వ సంకల్పం. ఈ దిశగా ప్రతి పక్షాలు వేసిన ప్రశ్నలకు అధికార పక్షం అత్యంత ఆత్మవిశ్వాసంతో ఆ విధంగా సమాధానం చెప్పింది. గంగ ప్రవహించే ప్రాంతాలలో పచ్చదనాన్ని పెంచాలనే లక్ష్యాన్ని బిజెపి ప్రభుత్వం పెట్టుకుంది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఝార్ఖండ్,పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘నమామి గంగా మిషన్’ కు ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు అందాయి. కానీ, ఆచరణలో ఇంకా ప్రగతి, వేగం పుంజుకోవాలి. చిత్తశుద్ధి పెరగాలి. గంగ ఎక్కువగా కాలుష్యానికి గురియైన వారణాసి లోక్ సభ స్థానానికి సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్టు అడుగులు పడడానికి మూలకారణంగా కూడా ఆయనే. ఈ ప్రాజెక్టును అనుకున్నది అనుకున్నట్లుగా, ఇచ్చిన హామీలకు తగ్గట్టుగా సంపూర్ణం చేయడం మోదీ భుజస్కంధాలపైనే ఉంది. ప్రధాని హృదయ పూర్వకంగా తలుచుకుంటే కాని పని ఏముంటుంది? మోదీ పాలనా కాలంలో మొదలుపెట్టిన ముఖ్యమైన ప్రాజెక్టుల్లో ఇది ఒకటి. కనీసం 2024 సార్వత్రిక ఎన్నికల లోపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన ఎన్నికల హామీలన్నీ నిజంగా నిలబెట్టుకుంటే దేశ ప్రజలు బ్రహ్మరథం పడతారు.
Also read: మహామహోపాధ్యాయుడు సర్వేపల్లి