రాజ్యం వీరభోజ్యం అన్నారు
రామ రాజ్యాలు, ధర్మ రాజులు గురించి విన్నాం
గజనీ, ఘోరీల దోపిడీల వివరం చదివాం
బాబర్, విక్టోరియాల దొరతనం అనుభవించాం
‘రత్నగర్భ‘ దరిద్ర దేవతగా మారింది
మన అనైక్యత కారణంగా.
నేటి చరిత్రకూడా అదే
దుర్యోధనులు, జయచంద్రులు
వీధి వీధిన కనుపిస్తున్నారు
సిధ్ధాంతాలతో చెవులు మూసుకున్నారు
స్వార్ధంతో కళ్లు మూసుకున్నారు
రాద్దాంతమే పమావధిగా ఉన్నారు
ప్రతీవాడూ మరొకడికి వెన్నుపోటుదారుడే
దేశంలో మనవాడెవడో
పరాయివాడెవడో తెలియనివ్వని మూర్ఖత్వం
అందరం కలిసి ముందుకు పోదాం అంటే
మమ్మల్ని వదిలేసే కుట్రంటూ గోల.
పొరుగువాడిని వదిలేసి
విదేశీయుల్ని సహోదరులంటారు
కొందరు ఉన్మాదులు.
మమ్మల్ని కాదంటే చంపేస్తాం
అన్నది నేటి రాజకీయ మంత్రం.
దోచుకోవడం, దాచుకోవడం అజండా
దీంతో రంగు వెలిసి పోతున్నది
మువ్వన్నెల జండా.
అసత్యాలే ఆధారం
బురద చల్లడమే విధానం
అందలమెక్కడమే జీవితాదర్శం
కోట్ల పెట్టుబడితో వేలకోట్ల ఆదాయం
ఇదే నేటి రాజకీయ తంత్రం.
విద్యాలయాల్లో మేధావులు
మేతావులుగా మారిపోయారు
విద్యార్ధులు రాజకీయుల ఆయుధాలై
విధ్వంసం చేస్తున్నారు.
విలేఖరులు విలాసాలకు
అమ్ముడు పోతున్నారు
నేతలు పత్రికలు కొనేస్తున్నారు
సామాన్యుడికి ఏది నిజమో
తెలియకుండా చేస్తున్నారు
ప్రజాస్వామ్య వ్యవస్థలను
కూకటివేళ్ళతో పెకలిస్తున్నారు
పోలీసులను, మిలిటరీ వాళ్లను
కొట్టి చంపేస్తున్నారు
మనం కూర్చున్న చెట్టు కొమ్మలను కాదు
మన కాళ్లను మనమే నరుక్కుంటున్నాం.
కమ్ముకున్న కారు మేఘాల మధ్య
ఓ కాంతి కిరణం
ఆ వెలుగు మనదాకాచేరనిస్తారా
అంతా పైవాడి దయ అనకుండా
మనకు మనమేంచేసుకోవాలో
మనం కాకపొతే మరెవరు ఆలోచిస్తారు?
నీది నువ్వే శుభ్రం చేసుకోవాలి
దేశం దానికదే బాగు పడుతుంది.
Also read: అమ్మ – నాన్న
Also read: తెలుగు
Also read: త్రిలింగ దేశంలో హత్య
Also read: మార్గదర్శి
Also read: బేరీజు