‘కీవ్ లో మీ నాయకత్వాన్ని మార్చుకోండి,’ అని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ సైనికులకు విజ్ఞప్తి చేశారు. రష్యన్ సైనికులతో ఉక్రెయిన్ సైనికులు తలబడుతున్నారు. శుక్రవారంనాడు రెండు దేశాల సైనికుల మధ్య పోరాటం జరిగింది. సుమారు డజను మంది సైనికులు ఇరువైపులా మరణించారని సమాచారం.
‘‘ఉగ్రవాదులూ, మాదకద్రవ్యాలకు అలవాటుపడిన ముఠా, నయా నాజీలు’’ అయిన మీ పాలకులను గద్దెపై నుంచి దించివేయండి,’’ అంటూ టెలివిజన్ ద్వారా ఉక్రెయిన్ సైనికులకు పుతిన్ సందేశం ఇచ్చారు. ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్ స్కీనీ, ఆయన నాయకత్వంలో పని చేస్తున్న ఇతర నాయకులనూ పుతిన్ దూషించారు. కీవ్ కి ఉత్తరాన ఒబోలోన్ స్కీలో బాంబు పేలడంతో రోడ్డు మీద ప్రజలు భద్రతకోసం పరుగులు తీశారు.
ఉక్రేన్ యుద్ధంలో ఇంతవరకూ వెయ్యిమందికి పైగా రష్యన్ సైనికులు మరణించారని ఉక్రెయిన్ రక్షణమంత్రి చెప్పారు. కీవ్ శివార్లలో ఉన్న గోస్టోమెల్ విమానాశ్రయాన్ని గురువారంనాడు రష్యన్ సేనలు ధ్వంసం చేశాయి.
‘‘శత్రువులు నన్ను మొదటి లక్ష్యంగా పెట్టుకున్నారు. నేను కీవ్ లోనే ఉంటాను. పోరాటం సాగిస్తాను,’’ అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ శుక్రవారంనాడు అన్నారు. తాము ఒక కాల్వను స్వాధీనం చేసుకొని రష్యా అధీనంలోకి వచ్చిన క్రైమియాకు నీటిని సరఫరా చేస్తున్నట్టు రష్యన్ సైనికులు వెల్లడించారు. 2014 వరకూ, అంటే క్రైమియాను రష్యా స్వాధీనం చేసుకునే వరకూ, ఉత్తర క్రైమియా కాల్వ ద్వారా ఉక్రేన్ లోని నీపర్ నది నుంచి నీరు క్రైమియాకి సరఫరా అవుతూ ఉండేది. రష్యా అధీనంలోకి వెళ్ళిన క్రైమియాకు నీటి సరఫరాను అప్పుడే ఉక్రేన్ నిలుపు చేసింది.
ఉక్రెయిన్ పైన దాడి చేసిన రష్యాపైన తీవ్రమైన ఆంక్షలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విధించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ పైన నేరుగా ఆంక్షలు ప్రకటించే ఉద్దేశం ప్రస్తుతానికి లేదని బైడెన్ వెల్లడించారు. రెండు దశాబ్దాలుగా అధికారంలో కొనసాగుతున్న పుతిన్ అపారమైన ధనరాసులు కూడబెట్టారని వదంతులు ఉన్నాయి. ఉక్రెయిన్ సంక్షోభం గురించి ఇండియాతో అమెరికా ప్రభుత్వం మాట్లాడుతుందని బైడెన్ అన్నారు. రష్యాతో భారత్ కు చరిత్రాత్మకమైన స్నేహ సంబంధాలు ఉన్నాయి. అదే సమయంలో గత ఒకటిన్నర దశాబ్దాలుగా భారత్, అమెరికా మధ్య భద్రతావ్యవహారాలపైన సన్నిహిత సంబంధాలు బలపడినాయి. గురువారం రాత్రి ప్రధాని నరేంద్రమోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ కి ఫోన్ చేసి హింసాకాండకు వెంటనే స్వస్తి చెప్పాలని కోరారు.
నాజీ జర్మనీ దండయాత్రను తలపిస్తున్నది : జెలెన్ స్కీ
కీవ్ లో బాంబు పేలగానే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ 1941లో జర్మనీ నుంచి నాజీలు దండయాత్రకు వచ్చినట్టు ఇప్పుడు రష్యన్లు వచ్చారని అన్నారు. యుద్ధ అనుభవం కలిగిన యూరోపియన్లు రంగంలో దిగి దేశాన్ని రష్యన్ల బారి నుంచి రక్షించాలని జెలెన్ స్కీ అన్నారు. ఉక్రేన్ ను అణచివేత నుంచి విడిపించేందుకే రష్యా సేనలు వచ్చాయని రష్యా విదేశాంగమంత్రి సర్జీ లావ్రోవ్ వ్యాఖ్యానించారు. ఉక్రేన్ సైనికులు ఆయుధాలు వదిలిపెడితే రష్యా చర్చలకు సిద్ధంగా ఉన్నదని లావ్రోస్ అన్నారు.
అధ్యక్ష భవనం వెలుపల నిలబడి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆత్మవిశ్వాసం ప్రకటించారు. ‘‘మేమంతా ఇక్కడే ఉన్నాం. మా సైన్యం ఇక్కడే ఉంది. సమాజంలోని పౌరులూ ఇక్కడే ఉన్నారు. మా స్వాతంత్ర్యాన్నీ, మా దేశాన్నీ రక్షించుకుంటూ ఇదే విధంగా ఎప్పటికీ ఉంటాం,’’ అని ప్రకటించారు.