• పలువురికి గాయాలు
• చర్చలు జరుపుతూనే చైనా కవ్వింపు చర్యలు
• దీటుగా స్పందిస్తున్న భారత ఆర్మీ
తూర్పు లద్దాఖ్ వివాదంతో భారత్ చైనా మధ్య ప్రతిష్ఠంభన కొనసాగుతూనేఉంది. వాస్తవాధీనరేఖ వద్ద మరోప్రాంతంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సిక్కింలోని నకులా సరిహద్దుల్లో భారత్, చైనా జవాన్లు ఘర్షణకు దిగారు. నకులా వద్ద భారత భూభాగంలోకి చొరబడుందుకు చైనా ఆర్మీ బలగాలు ప్రయత్నించాయి. వీరిని భారత సైన్యం అడ్డుకోవడంతో ఘర్షణ తలెత్తింది. ఘర్షణలో ఇరుదేశాలకు చెందిన సైనికులు గాయపడ్డారు. అయితే గొడవ చిన్నదేనని స్థానిక కమాండర్ స్థాయి చర్చలతోనే సమస్య పరిష్కారమైనట్లు భారత ఆర్మీ స్పష్టం చేసింది.
ఇది చదవండి: చైనాకు దీటుగా ఇండియా ఎదగాలి
అయితే తూర్పు లద్దాఖ్ లో ప్రతిష్ఠంభనై రెండు దేశాల మధ్య తొమ్మిదో విడత చర్చలకు కొద్ది రోజుల ముందే ఘర్షణ జరగడం విశేషం. ప్రతిష్ఠంభనపై నిన్న (జనవరి 24) భారత్ చైనా సైనిక ఉన్నతాధికారుల భేటీ జరిగింది. దాదాపు 15 గంటలపాటు సాగిన చర్చల్లో ఉద్రిక్తల తగ్గింపు, బలగాల ఉపసంహరణపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. బలగాల ఉపసంహరణ మొదట చైనావైపు నుంచే ఉండాలని భారత్ పట్టుబడుతోంది. చర్చలు జరుపుతూనే కవ్వింపు చర్యలకు పాల్పడటంతో భారత్ సరిహద్దుల్లో భద్రతను పెంచింది. చైనా చర్యలకు దీటుగా జవాబిస్తోంది.