Sunday, December 22, 2024

వశిష్ట, విశ్వామిత్రుల సంఘర్షణ

రామాయణమ్12

ఓ బ్రహ్మర్షీ! నా తల్లిని రాముడు చూసినాడా? ఆమెను అనుగ్రహించినాడా?

మరల నా తండ్రి అచటికి ఏతెంచినాడా? నా తల్లితండ్రులు ఇరువురూ సంతోషముగా కలసినారుకదా!

రాముడు వారి ఆతిథ్యమును స్వీకరించెనా? నా తల్లిదండ్రులు రామునకు ఫలపుష్పాదులొసగినారుకదా!

ఇలా ఒకదానివెంట మరొక ప్రశ్న సంధిస్తూ వెడుతున్న శతానందులవారికి విశ్వామిత్రమహర్షి చిరునవ్వుతో ఒకే ఒక సమాధానం చెప్పారు.

“నాయనా, జరుగవలసిన వెల్ల జరిగినవి. నా కర్తవ్యము నేను నిర్వహించితిని.”

Also read: అహల్య శాపవిమోచనం

ఆ మాటలు విన్న శతానందుడు…

ధన్యుడనయితిని ఓ రామచంద్రా నీవు నా తలితండ్రులకు, కుటుంబమునకు చేసిన మేలు మరువలేనిదయ్యా!

నీవుకూడా ధన్యుడవయితివయ్యా! అనితర సాధ్యమైన బ్రహ్మర్షిపదాన్ని స్వయం కృషితో అందుకున్న ఈ మహాతేజోసంపన్నుడైన విశ్వామిత్రుని శిష్యరికము నీకు లభించినది. ఈయన సామాన్యుడనుకున్నావా! కాదు, కాదు! ఈయన ఒక్కడే!(unique). చరిత్రలో మరొకరులేరు.

ఒక సామాన్య రాజుగా జన్మించి రాజర్షియై, ఋషియై, మహర్షియై, బ్రహ్మర్షి అయిన ఈయన చరిత్ర అత్యంత స్ఫూర్తి దాయకం, ఆదర్శవంతము. ఒక లక్ష్యము కోసము పట్టువిడవక వేల ఏండ్లు తపస్సు చేసి సాధించిన మహోన్నతమయిన వ్యక్తి విశ్వామిత్రమహర్షి!  తపస్సు ద్వారా మనస్సులోని మలినములు ఒక్కొక్కటిగా తొలగించు కుంటూ మనస్సును అత్యంత పరిశుద్ధమైన మానససరోవరంగా మార్చుకున్న వాడయ్యా ఈయన! ఈయన చరిత్ర మానవాళికి అందించే పాఠం అత్యంత విలువైనది! ఈ చరిత్ర కార్యసాధకుడైన ప్రతి వ్యక్తి హృదయంలో స్ఫూర్తి రగిలిస్తుంది!

Also read: భగీరథయత్నం, గంగావతరణం

రామచంద్రా ఈ బ్రహ్మర్షిగూర్చి నీకు వివరించ ప్రయత్నం చేస్తాను.

అంటూ శతానందులవారు విశ్వమిత్రమహర్షి చరిత్ర చెప్పటం మొదలుపెట్టారు!

బ్రహ్మదేవుని కుమారుడు కుశుడు, ఆయన కుమారుడు కుశనాభుడు, ఆయన కుమారుడు గాధి. గాధి కుమారుడు విశ్వామిత్రుడు!  విశ్వామిత్రుడు ఒక రాజు.

ఒక సారి ఈయన తన సైన్యాన్ని వెంటపెట్టుకుని విహారానికి బయలుదేరాడు!

అలా వెడుతూ, వెడుతూ అరణ్యమధ్యములో ఉన్న వశిష్ట మహర్షి ఆశ్రమం చేరుకున్నాడు. ఒకరినొకరు కుశలప్రశ్నలు వేసుకొన్న తరువాత వశిష్ట మహర్షి కౌశికునితో ‘‘నీకు, నీ సైన్యానికి ఆతిధ్యం ఇస్తాను స్వీకరించు’’ అని అన్నాడు! అప్పుడు విశ్వామిత్రుడు మీరిచ్చిన కందమూలఫలములు నాకు తృప్తికలిగించినవి ఇక వేరే ఆతిధ్యమెందులకు మహర్షీ వలదు నాకు అని వినయంగా బదులు పలికాడు.

(ఒక అక్షౌహిణీ సైన్యానికి విందు ఇవ్వటం మాటలుకాదు! ఆశ్రమాలలో ఉండే మునుల వద్ద అంత వ్యవస్థ ఉండదు కాబట్టి మహర్షిని ఇబ్బంది పెట్టడం ఎందుకని వద్దు అన్నాడు మహర్షి).

Also read: కపిల మునిపై సగరుల దాడి

వశిష్ట మహర్షి పట్టిన పట్టు వదలక విందు స్వీకరించాల్సిందే అని అన్నాడు. అప్పుడిక తప్పనిసరి పరిస్థితుల్లో సరేనన్నాడు విశ్వామిత్రుడు! క్షణాలలో అంత సైన్యానికీ కూడా  పంచభక్ష్య పరమాన్నాలతో ,షడ్రసోపెతమైన విందు ఏర్పాటు చేశారు మహర్షి వశిష్ఠుడు. అంతకుముందెన్నడూ అంత అద్భుతమైన వంటకాలను రాజుగాని ఆయన పరివారం గాని రుచిచూసి ఉండలేదు! ఆశ్చర్యం కలిగింది విశ్వామిత్రునకు!

ఇది ఎలా సాధ్యం ? ముక్కుమూసుకుని మూలన కూర్చున్న మునులకు ఇంత వ్యవస్థ ఎలా సమకూరింది?  ఉండబట్టలేక ఆ విషయాన్ని వశిష్ట మహర్షి వద్ద ప్రస్తావించాడు! అందుకు జవాబుగా ఆయన తన ఆశ్రమంలోని ఒక “ఆవు” ను చూపించాడు.

Also read: మారీచ, సుబాహుల సంహారం

ఈ ఆవా? ఎంతో అమాయకంగా ఉన్న ఈ ప్రాణా? నమ్మబుద్దికాలేదు విశ్వామిత్రుడికి!

అప్పుడు వశిష్ఠమహర్షి చెప్పారు! దీని పేరు “శబల.” ఇది దివ్యధేనువు! దీనికున్న శక్తులు అపారం!

శబలను చూసి ముచ్చటపడ్డాడు విశ్వామిత్రుడు! మహర్షీ ఈ ఒక్క ఆవును నాకిచ్చేయి నీకు లక్ష గోవులను ఇస్తాను అని అన్నాడు విశ్వామిత్రుడు.అందుకు ఒప్పుకోలేదు వశిష్ఠుడు.

లక్షగోవులతో పాటు నీవు కోరినంత ధనమిస్తానని చెప్పాడు కౌశికుడు, అందుకూ ఒప్పుకోక, ‘‘రాజా నా ఆశ్రమ వ్యవస్థ మొత్తానికీ ఇది ఒక్కటే ఆధారం దీనిని నేను ఎలా వదులుకోను! దయచేసి ఆ ఆలోచన విరమించుకో’’ అని బదులు పలికాడు వశిష్ట మహర్షి!

Also read:తాటకి వధ

వాయు భక్షణ చేస్తూ దొరికిన కందమూల ఫలాలు భక్షించే మీ వద్ద ఇంత అమూల్యమైన వస్తువులెందుకు?

రాజ్యంలో శ్రేష్టమైన వన్నీ రాజు వద్దనే కదా ఉండాలి! అయినా నిన్నడిగేది ఏమిటి? నా రాజ్యంలో ఉన్నవన్నీ నావే! అని బలవంతంగా ఆ ఆవుని ఈడ్చుకుపోసాగాడు  విశ్వామిత్రుడు!

అప్పుడు శబల అతని బంధనాలనుండి తప్పించుకొని మహర్షి వద్దకు వచ్చి ‘‘హే భగవన్! నీవు నన్ను అతనికి ఇచ్చివేశావా!’’ అని అడిగింది ! …‘‘లేదు! నిన్ను నేను ఎవరికీ ఇవ్వలేదు’’ అని చెప్పారు మహర్షి!

 అమ్మా శబలా నీ రక్షణ నీవే చూసుకో అని అనుమతించారు మహర్షి!

ఆ అనుమతి రావడమే తరువాయి! అప్పటివరకూ అమాయకంగా అగుపించిన శబల  ఒక్కసారిగా “సబల” అయ్యింది. ఆవిడ కంట నిప్పుల వర్షం కురిసింది! ఆవిడ శరీరంలోని ప్రతి భాగం నుండి అసంఖ్యాక మైన వీరులు పుట్టుకొచ్చారు!

Also read: విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులు

ఆవిడ హుంకారం నుండి”పహ్లవులు,” ‘‘కాంభోజులు,’’ పొదుగునుండి శస్త్ర పాణులైన బర్బరులు,శకృత్ ప్రదేశమునుండి శకులు( పృష్ఠ భాగము..వెనుక ప్రదేశం) యవనులు పుట్టలో నుండి బయటకు వచ్చే చీమలబారుల్లాగా జన్మించి క్షణాలో విశ్వామిత్రుడి సైన్యాన్ని నాశనం చేశారు!

అది చూసిన ఆయన కొడుకులు నూర్గురు సాయుధులైన వారు వశిష్ఠుడి మీదికి దండెత్తగా, మహర్షి చేసిన హుంకారానికి ఒక్కడు తప్ప అందరూ హతులయ్యారు.

అప్పుడు విశ్వామిత్రుడు ఎలా ఉన్నాడంటే అలలు ఆగిపోయిన సముద్రంలాగ, కోరలు పీకిన పాములాగ, గ్రహణం పట్టిన సూర్యుడిలాగా ఉన్నాడు!

నిర్వేదంతో రాజ్యాన్ని బ్రతికి ఉన్న కొడుకుకు అప్పగించి అడవులకు వెళ్ళి శివుడిగూర్చి తీవ్రమైన తపస్సుచేసి లోకంలో ఉన్న సకల అస్త్రములు తన స్వాధీనం లోకి వచ్చేటట్లుగా వరం పొందాడు విశ్వామిత్రుడు.

ఆ అస్త్రబలం చూసుకొని మరల వశిష్టాశ్రమం మీద దండెత్తాడు!

Also read: యాగరక్షణకు రాముని తనతో అడవులకు పంపమని దశరథుడిని కోరిన విశ్వామిత్రుడు

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles