రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
మనిషి వికసించడానికి
మనసు పరిమళించడానికి
ఆధ్యాత్మికత పెంపొందడానికి
అత్యవసరం స్వాతంత్ర్యం.
భరత భూమి స్వాతంత్ర్యం
తిలక్, మహాత్మా గాంధీ,
భగత్ సింగ్, సీతారామ రాజు లాంటి
ఎందరో మహామహుల త్యాగ ఫలం
కుటుంబాలను, ఉద్యోగాలను, ఆస్తులను వదలి
ఉద్యమించారు భారత మాత సంకెళ్ళు తెంచడానికి
‘రత్నగర్భ’ భారతాన్ని వట్టిపోయిన గోవును చేసి
వెళ్లిపోయారు తెల్ల దొరలు.
స్వరాజ్యం వచ్చింది నల్ల దొరల చేతికి
పంచవర్ష ప్రణాలికలు, గరీబీ హటావోలు
ఆర్ధిక సంస్కరణలు ప్రగతి బాటలన్నారు
దేశ విదేశాల్లో ప్రశంసలు అందుకున్నారు
ఆర్ధిక అసమానతలు, పెరిగే ధరలు
ఒక వైపు తగ్గి, మరో వైపు పెరిగే సుంకాలు
జన జీవితాన్ని కకావికలం చేస్తున్నాయి
రాజులు పోయి, దోషులే రాజులైన వేళ
రక్షకులు రక్షణ మరచి బానిసలైన వేళ
న్యాయానికి నెమ్మది రోగం పట్టిన వేళ
సామాన్యుడి ఆక్రందన విని
అతని కన్నీళ్ళు తుడవడానికి
ప్రగతి రథం కదిలించడానికి
యువతరం ముందుకు రావాలి.
ఓటర్ల జాబితా మార్చే వాళ్లను
ఉచితాల పేరుతో జనాన్ని ఏమార్చే వాళ్ళను
కుతంత్రాలతో రాజకీయం నడిపేవాళ్లను
కుట్రలలో భాగస్వాములయ్యే పాత్రికేయులను
వ్యాపారం పేరుతో జన్నాన్ని మోసగించే వాళ్ళను
అధికారంతో ప్రజల్ని పీడించే వాళ్ళను
కట్టడి చేసే శక్తి సామర్ధ్యం మీకే ఉంది
రాజకీయ పార్టీల బానిసత్వం వదలి
జనహితం పరమార్ధంగా భావించి
కదలి రండి మన జనం కోసం
మీ బిడ్డల భవిష్యత్తు కోసం.
మీరు చేసే మంచితో భారతం పులకించాలి
ఆ ప్రకంపనలు విశ్వమంతా విస్తరించాలి
రండి ఈ భువిని సస్య శ్యామలం చేయండి
సౌభాగ్యవంతం చేయండి
నల్ల దొరలను దింపి
ప్రజాస్వామ్యానికి పట్టం కట్టండి
జన దీవనలందుకోండి
మీ జీవితాలకు మహత్వం చేకూర్చుకోండి
నలుగురి మంచి కోసం పనిచేయడం కంటే
గొప్ప పని మరేదీ లేదు.
Also read: “చందమామ”
Also read: “వ్యవస్థ”