Thursday, November 21, 2024

జగన్ ఫిర్యాదుపై జస్టిస్ రమణ స్పందన కోరిన సుప్రీం చీఫ్ జస్టిస్

  • జగన్ లేఖపైన చర్యలు తీసుకుంటున్న జస్టిస్ బాబ్డే
  • తన లేఖనే అఫిడవిట్ గా దాఖలు చేసిన సీఎం
  • జస్టిస్ రాకేశ్ కుమార్ ధ్వజం వెనుక కారణాలు
  • చంద్రబాబునాయుడు, జగన్ ఆధిక్యపోరులో ఇది భాగం
  • అన్ని వ్యవస్థలనూ ప్రభావితం చేస్తున్న రాజకీయపోరాటం

హైదరాబాద్ : సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్. వి. రమణపైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భారత ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బాబ్డేకి ఫిర్యాదు చేస్తూ 6 అక్టోబర్ 2020న రాసిన లేఖపైన చర్యలు తీసుకుంటున్నారు. జగన్ చేసిన ఫిర్యాదుకు స్పందన తెలియజేయవలసిందిగా జస్టిస్ రమణను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కోరినట్టు సమాచారం.

భారత ప్రధాన న్యాయమూర్తి బాబ్డేకి జగన్ మోహన్ రెడ్డి లేఖ రాసిన తర్వాత నాలుగు రోజులకు ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయకల్లం  లేఖాంశాలను మీడియాకు విడుదల చేశారు. దానిపైన ప్రధాన న్యాయమూర్తి స్పందించారో లేదో అన్న అనుమానం కొంతకాలంగా ఉన్నది. ప్రధాన న్యాయమూర్తి స్పందించారనీ, జస్టిస్ రమణ సమాధానం కోరారంటూ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా,’ ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’ పత్రికలు ప్రముఖంగా వార్తలు ప్రచురించాయి. ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం నాయకులకు అనుకూలంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుపైన జస్టిస్ రమణ ప్రభావం వేస్తున్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరిపైనా, మరికొందరు హైకోర్టు న్యాయమూర్తులపైనా ముఖ్యమంత్రి ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి:జస్టిస్ రమణపైన సీజేఐకి జగన్ ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చీఫ్ జస్టిస్ ల బదిలీ:

ముఖ్యమంత్రి లేఖ రాసిన తర్వాతే జస్టిస్ మహేశ్వరిని సిక్కిం బదిలీ చేశారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్ ఎస్ చౌహాన్ ను ఉత్తరాఖండ్ కు బదిలీ చేశారు. జగన్ మోహన్ రెడ్డి పైన ఉన్న కేసులన్నీ ఈ రెండు హైకోర్టుల పరిధిలోనే ఉన్నాయి. ఈ బదిలీలు సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు మేరకు మామూలుగా రొటీన్ గా చేసినట్టు అప్పుడు భావించారు. వీరిద్దరితో పాటు మరి ఏడుగురు న్యాయమూర్తులను కూడా బదిలీ చేశారు. ఈ బదిలీలు రాష్ట్రపతి రామనాథ్ కోవిద్ ఆమోదం దరిమిలా గురువారంనాడు అమలులోకి వచ్చాయి. కానీ జస్టిస్ రమణ స్పందన కోరినట్టు వెల్లడైన తర్వాత భారత ప్రధాన న్యాయమూర్తి ముఖ్యమంత్రి లేఖను పట్టించుకున్నట్టు, లేఖాంశాలపై చర్యలు తీసుకుంటున్నట్టు భావించవలసి వస్తోంది. జస్టిస్ రమణ స్పందన కోరడంతో పాటు ముఖ్యమంత్రిని అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించడం కూడా భారత ప్రధాన న్యాయమూర్తి తీసుకున్న చర్యలలో భాగమే. తాను అక్టోబర్ 6వ తేదీన రాసిన లేఖనే అఫిడవిట్ గా ముఖ్యమంత్రి పంపినట్టు తెలుస్తున్నది.

జస్టిస్ మహేశ్వరి సుదీర్ఘమైన స్పందన:

జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలపైన స్పందించవలసిందిగా జస్టిస్ రమణతో పాటు జస్టిస్ మహేశ్వరిని  కూడా జస్టిస్ బాబ్డే కోరినట్టు సమాచారం. జస్టిస్ మహేశ్వరి సుదీర్ఘమైన లేఖను తన స్పందనగా జస్టిస్ బాబ్డేకి పంపగా జస్టిస్ రమణ ఏమి చేశారో తెలియరాలేదు. జగన్ లేఖపైన చర్యలు ఆరంభించే ముందు జస్టిస్ బాబ్డే కొందరు సహచర న్యాయమూర్తులతో చర్చించినట్టు తెలుస్తోంది. జగన్ చేసిన ఫిర్యాదులను లోతుగా పరిశీలించవలసి ఉంటుందని సహచర న్యాయమూర్తులు సలహా చెప్పారు.

అమరావతి భూకుంభకోణం:

అమరావతి భూముల కుంభకోణంలో మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ తో పాటు జస్టిస్ రమణ కుమార్తెల పేర్లను కూడా ఏసీబీ (యాంటీ కరప్షన్ బ్యూరో) హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొన్నది. అఫిడవిట్ లోని అంశాలకు సంబంధించి ఎటువంటి వార్తలూ ప్రచురించకూడదనీ, ప్రసారం చేయకూడదనీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ‘గ్యాగ్ ఆర్డర్’ జారీ చేసింది. అమరావతి భూకుంభకోణంపైన దర్యాప్తును సైతం హైకోర్టు నిలిపివేసింది. అదే సమయంలో జస్టిస్ రమణ నాయకత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ ప్రస్తుత ఎంపీలపైనా, ఎంఎల్ఏలపైనా, మాజీ ఎంపీలపైనా, ఎంఎల్ఏలపైనా ఉన్న క్రిమినల్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయవలసిందిగా ఉన్నత న్యాయస్థానాలను ఆదేశించింది. ఈ ఆదేశం ప్రకారం చాలా క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న జగన్ మోహన్ రెడ్డిపైన కూడా త్వరితగతిన విచారణ జరగవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భారత ప్రధాన న్యాయమూర్తకి లేఖ రాశారు. అనంతరం గ్యాగ్ ఆర్డర్ ను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గ్యాగ్ ఆర్డర్ పైన సుప్రీంకోర్టు స్టే మంజూరు చేసింది. మరి రెండు పిటిషన్లపైన కూడా సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చాయి.

ఇదీ చదవండి:జగన్ పై ఇద్దరు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీం

రాజ్యాంగపాలనకు విఘాతమా?

ఇది ఇలా ఉండగా, సుమారు డజన్ హెబియస్ కార్పస్ పిటిషన్లను విచారిస్తూ జస్టిస్ రాకేశ్ కుమార్ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన పాలనకు విఘాతం కలిగిందేమో తెలుసుకునేందుకు సాక్షులను విచారించాలనీ, ఇందుకు సహకరించాలనీ కోరుతూ ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ఆదేశించారు. ఆ పని ఈ కోర్టు పరిధిలోకి రాదని న్యాయవాది వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా ఈ వ్యాఖ్యాను ఖండిస్తూ సుప్రీంకోర్టులో రాష్ట్రప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యాలపైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాబ్డే నాయకత్వంలోని ధర్మాసనం విస్మయం వెలిబుచ్చింది. మీ జివితంలో ఎన్నడైనా ఇటువంటి వ్యాఖ్యా ఒక న్యాయమూర్తి నోట విన్నారా అంటూ డిఫెన్స్ లాయర్ ను ధర్మాసనం ప్రశ్రించింది. హైకోర్టు ఉత్తర్వు తమను ‘కలతపరిచింది’ (డిస్టర్బ్ డ్) అంటూ ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. కేసును సెలవల అనంతరం విచారణకు వాయిదా వేశారు.

ఆవేశపరుడైన న్యాయమూర్తి:

ఈ లోగా, రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన పాలనకు విఘాతం కలిగిందేమోనంటూ వ్యాఖ్యానించిన జస్టిస్ రాకేశ్ కుమార్ పదవీ కాలం ముగింపు దశకు చేరుకున్నది. ఏడాది కిందట పట్నా నుంచి బదిలీపైన అమరావతి వచ్చిన జస్టిస్ రాకేశ్ కుమార్ కు ఆవేశపరుడనే పేరు ఉంది. పట్నా నుంచి బయలుదేరడానికి ముందే వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి అక్కడ సంచలనం సృష్టించారు. ఆయన 31 డిసెంబర్ 2020న పదవీ విరమణ చేశారు. మర్నాడు అమరావతి నుంచి బయలుదేరి వెళ్ళారు. ఆయనకు గొప్పగా వీడ్కోలు చెప్పడానికి అమరావతి రైతులను తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున సమీకరించి నాటకీయంగా కథ నడిపించింది. పదవీ విరమణకు ఒక రోజు ముందు జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ రమేష్ తో కూడిన బెంచ్ ముందుకు వచ్చిన కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలైన కేసులను విచారించే క్రమం నుంచి తనకు తానుగా తప్పుకోవాలని (రెక్యూజ్ కావాలని) జస్టిస్ రాకేశ్ కుమార్ తో ప్రభుత్వం తరఫు న్యాయవాది అన్నారు. అంటే, ఒక విధంగా ఆ న్యాయమూర్తి పట్ల ప్రభుత్వ న్యాయవాది అవిశ్వాసం ప్రకటించినట్టు భావించాలి.

జస్టిస్ రాకేశ్ కుమార్ ధ్వజం:

అప్పుడు జస్టిస్ రాకేశ్ కుమార్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపైన విరుచుకుపడుతూ పరుషమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన జైలులో ఉన్నప్పుడు ఖైదీ నంబర్ ఫలానా ఉన్నదంటూ వ్యాఖ్యానించారు. జగన్ మోహన్ రెడ్డి రాజ్యాంగ వ్యవస్థలపైన దాడికి దిగుతున్నారనీ, మూడు రాజధానుల విధానాన్ని సమర్థించలేదని రాజ్యాంగ వ్యవస్థ అయిన శానసమండలిపైన దాడి చేశారనీ, ఆ తర్వాత మరో రాజ్యాంగ వ్యవస్థ అయిన ఎన్నికల  కమిషనర్ పైన దాడి,  హైకోర్టుపైనా, సుప్రీంకోర్టు పైన కూడా దాడులకు దిగుతున్నారనీ వ్యాఖ్యానించారు. జగన్ పైన 11 సిబీఐ కేసులూ, ఆరు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పెట్టిన కేసులూ, 18 పోలీసులు పెట్టిన కేసులూ ఉన్నాయని వెల్లడించారు.

వైఎస్ మృతితో ఆరంభమైన రాజకీయ క్రీడ:

అవిభక్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2 సెప్టెంబర్ 2009న హెలికాప్టర్ ప్రమాదంలో దివంగతులైన క్షణం నుంచి ఆయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డికీ ఇతర రాజకీయ నాయకులకూ మధ్య ఆధిక్యపోరు నడుస్తోంది. ఓదార్పుయాత్రలను జిల్లా కేంద్రాలకే పరిమితం చేయమంటూ సలహా చెప్పిన కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీపైన తిరుగుబాటు చేసిన జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి సొంత పార్టీ వైఎస్ ఆర్ సీపీ ని స్థాపించారు. అధినేతను ధిక్కరించిన జగన్ మోహన్ రెడ్డిపైన సీబీఐ దర్యాప్తు చేయించి పదహారు మాసాలు జైలు నిర్బంధంలో ఉంచారు. ఈ వ్యవహారంలో అహ్మద్ పటేల్, చిదంబరం, చంద్రబాబునాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి తదితరుల భాగస్వామ్యం ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. అప్పటి నుంచి జగన్ మోహన్ రెడ్డికీ, చంద్రబాబునాయుడికీ మధ్య ఆదిక్య పోరు కొనసాగుతోంది.

అసాధారణమైన రాజకీయ పరిణామాలు:

జగన్ మోహన్ రెడ్డి జైలులో ఉన్నప్పుడు ఆయన సోదరి షర్మిల పాదయాత్ర చేశారు. 2014 ఎన్నికలకు కొద్ది మాసాల ముందే జగన్ జైలు నుంచి బయటకు రావడంతో ఎన్నికల ప్రచారం అనుకున్నంత విస్తృతంగా జరగలేదు. తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. 2019 ఎన్నికలకు ముందుగా పద్నాలుగు మాసాల సుదీర్ఘ పాదయాత్ర చేసి జగన్ మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో పాగా వేశారు. ఎన్నికలలో 175 స్థానాలలో 151 స్థానాలు గెలుచుకొని విజయపతాకను ఎగురవేశారు. కానీ ఆయన ముందరి కాళ్ళకు హైకోర్టు నిర్ణయాలు ఎప్పటికప్పుడు బంధాలు వేస్తున్నట్టు ప్రజలకు తెలుస్తూనే ఉంది. ప్రభుత్వం చేసిన తప్పులు లేకపోలేదు. హైకోర్టు వెలువరించిన తీర్పులన్నీ కావాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇచ్చినవి కావు. కానీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మరికొందరు న్యాయమూర్తులూ  పనిగట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాలు జారీ చేస్తున్నారనీ అభిప్రాయం ప్రజలలో ఏర్పడింది. అరవైకి పైగా కేసులలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు ఆదేశాలు వచ్చాయి. చివరికి అమరావతి భూముల కుంభకోణంలో ఏసీబీ దాఖలు చేసిన అఫిడవిట్ గురించి ప్రచారం, ప్రసారం చేయకూండదని ‘గ్యాగ్ ఆర్డర్’ జారీ చేయడం, కుంభకోణంపైన విచారణను నిలిపివేయడంతో ముఖ్యమంత్రి భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడంతో పాటు సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు.

ఇది ఆధిక్యపోరు:

జస్టిస్ రాకేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలలో శాసనమండలినీ, ఎన్నికల కమిషనర్ నీ, హైకోర్టునూ, సుప్రీంకోర్టునూ ప్రస్తావించారు. శాసనమండలిలో తెలుగుదేశంపార్టీ ఆదిక్యం ఉన్నది. ఎన్నికల కమిషనర్ ని చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా నియమించారు. హైకోర్టు నిర్ణయాలను జస్టిస్ రమణ ప్రభావితం చేస్తున్నారని జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. అంటే, జగన్, చంద్రబాబునాయుడు మధ్య దాదాపు పదేళ్ళుగా సాగుతున్న ఆధిక్య పోరు కేవలం రాజకీయాలకే పరిమితం కాలేదు. రాజ్యవ్యవస్థలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగాలైన చట్టసభలూ,పరిపాలన వ్యవస్థ, న్యాయవ్యవస్థ, మీడియా వ్యవస్థలు కూడా ఈ ఆధిక్యపోరాటంలో భాగస్వాములైనాయి. అన్ని వ్యవస్థలలోనూ ఇరువురిలో ఎవరో ఒకరిని సమర్థించే శక్తులు ఉన్నాయి. కనుక ఇది అసాధారణ పరిస్థితి. ఒకరిని మాత్రమే నిందించి ప్రయోజనం లేని చిత్రమైన స్థితి. రాజకీయాలలో జగన్ మోహన్ రెడ్డి 2019లో తన ఆధిక్యాన్ని చాటుకున్నారు. పరిపాలనపైన పట్టు సాధించారు. కేంద్రప్రభుత్వంతో స్నేహసంబంధాలు నెరపుతున్నారు. ప్రింట్ మీడియాలో చీలిక అట్లాగే ఉన్నది కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రాతికూల్యం తెలంగాణ ముఖ్యమంత్రి చర్యల వల్ల కొంత తగ్గింది. న్యాయవ్యవస్థలో చాలాకాలం తర్వాత జగన్ మోహన్ రెడ్డికి కొంతలో కొంత అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నది ఇప్పుడే. ఇంతవరకూ జరిగిన కథ ఇది. జరగబోయే కథను తెరమీద చూడవలసిందే.

ఇదీ చదవండి: న్యాయమూర్తులకూ, నాయుడికీ ఉన్న బంధాలను వెల్లడించిన ఏబీకే ప్రసాద్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles