ప్రముఖ విద్యావేత్త, మేధావి, మార్గదర్శకులు చుక్కా రామయ్య 97వ పుట్టిన రోజు శనివారంనాడు ఆత్మీయుల మధ్య జరిగింది. ఆయన పెద్ద కుమార్తె ఉమ, అల్లుడు రవి అమెరికాలో సిన్సినాటీ నుంచి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ వచ్చారు. ఉమ, బుద్ధవనం ప్రాజెక్టు స్పెషల్ ఆఫీపర్ మల్లేపల్లి లక్ష్మయ్య, పాత్రికేయులు కొండుభట్ల రామచంద్రమూర్తి, లక్ష్యయ్య కుమారుడు ఏకలవ్య, తదితరులు హాజరైన కార్యక్రమంలో రామయ్య కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మూడు రకాల మొక్కలను నాటారు. ఒకటి వేప మొక్క, రెండు గులాబీ మొక్కలు, మూడు ఉసిరి మొక్కలను నాటారు. ఔషధ లక్షణాలు కలిగిన వేప, ఉసిరి, అందమైన గులాబీ మొక్కలను స్వయంగా మాస్టారు నాటారు. సార్ ఆరోగ్యంగా చిరునవ్వుతో సరదాగా అందరితో మాట్లాడారు.
చుక్కా రామయ్య ప్రజల మనిషి. వరంగల్లు జిల్లాలో జన్మించిన చుక్కా రామయ్య తెలంగాణ సాయుధ పోరాటం నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వరకూ సకల ఉద్యమాలలో చురుకైనా పాత్ర పోషించిన పోరాటశీలి. ప్రగతిశీల ఉపాధ్యాయుడుగా ఆయన మెదక్, నల్లగొండ జిల్లాలలోనూ, హైదరాబాద్ లోనూ పని చేశారు. ఉద్యోగ విరమణ తర్వాత విద్యార్థులకు ఐఐటీ ప్రవేశ పరీక్షలో శిక్షణ ఇచ్చే వ్యవస్థను ప్రారంభించారు. వేలాది మంది విద్యార్థులు రామయ్య శిక్షణలో ఐఐటీ ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణులై ఐఐటీ చదివి, అమెరికా, బ్రిటన్ వంటి దేశాలలో పైచదువులు చదివి అక్కడే ఉద్యోగాలలో, వ్యాపారాలలో స్థిరపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా వేలాదిమంది శిష్యులు కలిగిన చుక్కా రామయ్య శిష్యుల మధ్యనే హైదరాబాద్ విద్యానగర్ లో నిరాడంబరంగా జీవిస్తున్నారు. ఐఐటీ రామయ్యగా ప్రఖ్యాతి గడించారు. ఆరేళ్ళ పాటు ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలి సభ్యులుగా ఉన్నారు. అమెరికాను అనేక సార్లు సందర్శించారు. ఇతర దేశాలలో కూడా పర్యటించారు. ఏ దేశం వెళ్ళినా అక్కడి సామాజిక స్థితిగతులనూ, విద్యావ్యవస్థ తబ్సీళ్ళనూ స్వయంగా చూసి తెలుసుకోవడం ఆయనకు పరిపాటి. విద్యారంగంలో మౌలికమైన మార్పులు రావాలని వాదించే విద్యావేత్త ఆయన. ఆదివాసీ పిల్లలకూ, దళిత యువతీయువకులకూ ఐఐటీలో ప్రవేశం కోసం ప్రత్యేక శిక్షణ ఇచ్చేవారు. అనేకమంది బడుగు కుంటుంబాలకు చెందిన యువతీయువకులను ఐఐటీ చదివించారు.
విద్యారంగానికి సంబంధించి అనేక గ్రంథాలు రచించారు. పౌరహక్కుల కోసం నిర్విరామంగా శ్రమించారు. ఎస్. ఆర్. శంకరన్, కణ్ణబీరన్, పొత్తూరి వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్ హరగోపాల్ వంటి పోరాటశీలురతో కలసి కృషి చేశారు. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ను నెలకొల్పినప్పటి నుంచీ దానికి సలహాదారుగా ఉన్నారు. వామపక్ష భావాలకు కట్టుబడి ఉన్నారు. ప్రజాసంక్షేమం కోసం ఏ కార్యక్రమం తలపెట్టినా ఆయన ముందుంటారు.
చుక్కా రామయ్య దంపతులకు నలుగురు సంతానం. ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. నలుగురూ అమెరికాలోనే స్థిరపడినారు. అందరూ ఉన్నతోద్యోగాలు చేస్తున్నారు. భార్య లక్ష్మీబాయి అగ్నిప్రమాదానికి గురై 2010లో కాలం చేశారు.
చుక్కా రామయ్య ఇంటికి రాష్ట్రమంత్రి ఎర్రబల్లి దయాకరరావు స్వయంగా వెళ్ళి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఉదయం ఫోన్ చేసి శుభాభినందనలు తెలియజేశారు. త్వరలోనే హైదరాబాద్ వచ్చి రామయ్య ఆశీస్సులు తీసుకుంటామని చెప్పారు. రామయ్య శిష్యుడు రవి అందరినీ సమీకరించారు. విద్యావేత్త బ్రహ్మం, అవార్డు పొందిన పోలీసు అధికారి నాగమల్లు, మహాత్మాగాంధీ హెల్పింగ్ ఫౌండేషన్ నిర్వాహకుడు గంటా దామోదర్, తెలంగాణ అర్చక ఉద్యోల జేఏసీ కన్వీనర్ రవీంద్రాచార్యులు, సనత్ నగర్ హనుమాన్ దేవాలయం ఈవో రాజీవ్, ప్రభుత్వ గురుకుల విద్యార్థులు రామయ్యకు శుభాకాంక్షలు తెలిపి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు.