27న అవనిగడ్డలో మండలి వెంకట కృష్ణారావు స్మారకోపన్యాసం
అదే రోజు తెనాలిలో గాంధీ పుస్తకావిష్కరణ
మహాత్మాగాంధీ అహింసా సిద్ధాంతాలతో ప్రభావితులైన మహనీయులు మన దేశంలోనే కాక, విదేశాల్లో కూడా గణనీయంగా ఉన్నారు. ఆ మాటకు వస్తే, మన దేశంలో కంటే పాశ్చాత్య దేశాలైన యూరప్ లోనూ, అమెరికాలోనూ, మహాత్మాగాంధీ సిద్ధాంతాలపై ఇప్పటికీ ఎంతో లోతుగా అధ్యయనం, పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ విధంగా మహాత్మాగాంధీపై అధ్యయన పరిశోధనలను నిర్విరామంగా నిర్వహిస్తూ, జీవితాంతం ఆయన ఆదర్శాల ఆచరణకు కృషి చేస్తున్న మహనీయులలో జర్మనీ దేశస్తుడైన మిస్టర్ క్రిస్టియన్ బార్ డాల్ఫ్ (Mr. Christian Bartolf’)గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి.
క్రిస్టియన్ బార్ డాల్ఫ్ ప్రముఖ విద్యావేత్త, రాజనీతి శాస్త్రజ్ఞుడు. జర్మనీలోని ఫ్రీ బెర్లిన్ విశ్వవిద్యాలయం నుంచి రాజనీతి శాస్త్రం, విద్యా విషయాలు – రెండింటిలోనూ 1986, 1987 సంవత్సరాలలో డిప్లొమాలను పొందారు. ఈ విశ్వవిద్యాలయంతో ఈయనకు ప్రగాఢమైన అనుబంధం వుంది. ఈయన 1985, 1998 సంవత్సరాలలో భారతదేశాన్ని, 1989-97 సంవత్సరాలలో ఇజ్రాయిల్ దేశాన్ని, 1991-95, 2000 సంవత్సరాలలో రష్యా దేశాన్ని, వీటితో పాటు అనేక యూరప్ దేశాలను సందర్శించారు. ఈయన బెర్లిన్-స్పాందో ప్రొటెస్టెంట్ చర్చి డిస్ట్రిక్ట్ లో 1991-99 మధ్య ఋజువర్తన (conscientiousness), పీస్ ఎడ్యుకేషన్ విభాగానికి డైరెక్టర్ గా వ్యవహరించారు. 2000 సంవత్సరం నుంచి చర్చికి సంబంధించిన “జీవావరణం,” “శాంతి,” “వసుధైక కుటుంబకం” శాఖలలో కూడా పనిచేస్తున్నారు.
ఈయన గాంధీజీపై విస్తృతంగా పరిశోధన చేశారు. అనేక గ్రంథాలను, పరిశోధనా వ్యాసాలను ప్రచురించారు. ఈయన జర్మనీలోని బెర్లిన్ లో సామాన్య జనానికి విద్యావిషయకమైన లబ్దిని చేకూర్చే సంస్థ “గాంధీ ఇన్ఫర్మేషన్ సెంటర్” (Research and Education of Non-violence) కు అధ్యక్షులుగాను, బెర్లిన్ లోని అహింసాత్మక ప్రతిఘటనకు సంబంధించిన ఇరవైకి పైగా ప్రదర్శనశాలలకు, యుద్ధ వ్యతిరేక మ్యూజియం (Anti-war Museum) (Gandhi, Tolstoy, Thoreau, Ruskin, Schweitzer, Huxleyet.al.) కు క్యూరేటర్ గాను పనిచేస్తున్నారు. గాంధీజీ తన సమకాలీనులతో జరిపిన ఉత్తరప్రత్యుత్తరాలపై అనేక పుస్తకాలను (జీవిత చరిత్రలు, లఘు గ్రంథాలు) ప్రచురించారు. గాంధీజీతో పాటు ఈయన ప్రసిద్ధ రష్యన్ రచయిత టాల్ స్టాయ్ పై కూడా లోతుగా పరిశోధనలు చేశారు. టాల్ స్టాయ్, గాంధీ – అహింసాత్మక ప్రతిఘటనపై ఈయన వ్రాసిన పుస్తకాలు బహుళ
ప్రాచుర్యాన్ని పొందాయి. టాల్ స్టాయ్ రచనలతోనే గాంధీజీ కూడా అహింసా సిద్ధాంతం పట్ల ప్రభావితుడైన విషయం మనమిక్కడ గుర్తించాలి.
ఈయన చేసిన అనేక రచనల్లో “Tolstoy and Gandhi (Non-violent Resistance)” పుస్తకం బహుళ ప్రాచుర్యాన్ని పొందింది. ఆంగ్లంలో వ్రాసిన ఈ చిరుపొత్తం లియో టాల్ స్టాయ్ అహింసా సిద్ధాంతం, అహింసాయుత విధానంపై గాంధీజీ అభిమతం మరియు అహింసాత్మక ప్రతిఘటన (సత్యాగ్రహం) పై ఈయన వ్రాసిన పరిచయాత్మక వ్యాసం ఈనాడు అహింసా విధానంపై, అహింసకు సంబంధించిన నైతిక విలువలపై అధ్యయనం చేసే వారికి ఎంతో ఉపయుక్తంగా వున్నాయి. వీటితో పాటు ఈయన మరొక రచన టాల్ స్టాయ్ (1828-1910) బెంగాలీ సామాజిక శాస్త్రవేత్త తారక్ నాథ్ దాస్ (1884-1958) కు వ్రాసిన లేఖ “Letter to a Hindoo – Taraknath Das, Leo Tolstoy and Mahatma Gandhi (1997)” కూడా మంచి ప్రాచుర్యం పొందింది.
“ఋజువర్తన”, “పౌరశాంతి” అంశాలపై ఈయన ఈ క్రింది అంతర్జాతీయ సమావేశాలలో పాల్గొన్నారు:
బెల్జియం (1991), ఫ్రాన్స్ (1992), టర్కీ (1993), రష్యా (1994), గ్రీస్ (1995), బెలారస్ (1995), బెల్జియం (1996), ఇటలీ (1997). వీటితో పాటు లియో టాల్ స్టాయ్, మహాత్మాగాంధీలపై (టాల్ స్టాయ్ సొసైటీ మాస్కో, ఇన్ స్టిట్యూట్ అఫ్ ఫిలాసఫీ, రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్స్, మాస్కో, రష్యా)
అంతర్జాతీయ సెమినార్లలో పత్ర సమర్పణ చేశారు. 1995లో “East, West – a Dialogue between Civilizations” అనే అంశంపై (Russian peoples’ friendship University, Moscow, Russia)లో పత్ర సమర్పణ చేశారు. 1998 లో “Gandhi and 21st Century” (Gandhi Peace Foundation, Gujarat Vidyapeet, Institute of Gandhian Studies, Delhi/ Wardha, India), 2000 వ సంవత్సరంలో “Tolstoy and World Literature” (Leo Tolstoy Estate Museum, Yasnaya Polyna, Russia) పత్ర సమర్పణ చేశారు.
ఆయన చేసిన అనేక రచనలు ఇంగ్లీష్, జర్మన్ భాషలలోకి ప్రచురించబడ్డాయి. క్రిస్టియన్ బార్ డాల్ఫ్ ప్రస్తుతం భారతదేశ పర్యటనలో ఉన్నారు. సెప్టెబర్ 27న కృష్ణాజిల్లా అవనిగడ్డలో అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో మాజీ మంత్రి, శుద్ధగాంధేయవాది మండలి వెంకట కృష్ణారావు వర్థంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. మండలి వెంకట కృష్ణారావు స్మారకోపన్యాసం ఇస్తారు. గాంధీమార్గంపైన ఆయన ప్రసంగిస్తారు. అనంతరం అదే రోజు సాయంత్రం తెనాలిలో మహాత్మాగాంధీపైన ఒక పుస్తకం ఆవిష్కరణ సభలో కూడా పాల్గొంటారు. ఆయన మండలి బుద్ధప్రసాద్ అతిథిగా ఉంటారు.