ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో పుట్టి, అవిభక్త ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పేరెన్నికగన్న’పెద్దాయన’ చిలకం రామచంద్రారెడ్డి (19372021) సద్గతి పొంది నేటికి సరిగ్గా పదిరోజులు.. వారి శుభ స్వీకరణ స్మృత్యర్థం.
మూడు తరాలకు నిండు ప్రతినిధిగా, వివాదరహితుడిగా, విశిష్ట గుణాన్ని తన ఊపిరిగా 85 సంవత్సరాల పూర్ణాయుష్యు తనదిగా చేసుకుని భావితరాలకు మార్గదర్శనం చేసిన మహా ‘మనీషి’ చిలకం. తన 62 ఏళ్ళ రాజకీయ జీవితంలో విలువల్నే వలవలుగా ధరించి అందరి మెప్పు పొందటం ఒక్క రామచంద్రారెడ్డికే సాధ్యపడిందనటంలో సందేహం లేదు.
అంచెలంచెలుగా ఎదిగిన నేత
1950 వ దశకంలో మంగళం గ్రామ పంచాయితీ సర్చంచ్ (1959-64)గా, ప్రజాప్రతినిధిగా రాజకీయ ప్రస్థానం చేసి, పిచ్చాటూరు సమితి ప్రెసిడెంట్ (1982-87) గా ఎదిగి, చిత్తూరు జిల్లా ప్రథమ భా.జ.పా అధ్యక్షుడిగా (జనతా పార్టీ తదనంతరం), ఆంధ్ర రాష్ట్ర భా.జ.పా అధ్యక్షుడు (1999-2004)గా, రైతుకమీషన్ మెంబరుగా జాతీయస్థాయిలో తన ప్రతిభను చాటుకున్న అసలు సిసలైన ప్రజానాయకుడు చిలకం. పైనుండి హఠాత్తుగా ఊడిపడే నేటి తరం నాయకులకు భిన్నంగా గ్రామస్థాయి నుండి రాష్ట్ర/జాతీయ స్థాయి వరకు పైరవీలు లేకుండా పదవులు రామచంద్రారెడ్డిని వరించటం ఆయన వ్యక్తిత్వానికి తార్కాణం..
ఆయతో కలిసి ప్రజా జీవనంలో ప్రయాణం చేసిన నారాయణస్వామి మాటల్లో చెప్పాలంటే, ఎంత వివాదాస్పద సమస్యనైనా, ఎవరి మనస్సు నొప్పిoపక, తన పెద్దరికంతో సమోధ్య కుదుర్చటoలో ఆయనకు ఆయనేసాటి. అభివృదే ధ్యేయంగా, రాజకీయ కుయుక్తులకు తావివ్వకుండా, ముక్కు సూటిగా అందరి ఆమోదం పొందటం చిలకం ప్రత్యేకత. ప్రలోభాలకు లొంగటం ఆయన నిఘంటువులోనే లేదంటారు అభిమానులు. ఆయన సమితి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవికి పోటీ జరిగిన సందర్బంలో పిచ్చాటూరు బిజెపి సమితి ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నరామచంద్రారెడ్డి ఒక్క ఓటు కీలకంగా(టై)మారటంతో, ఇరు వర్గాల రాజకీయ ఒత్తిళ్ళకూ, ప్రలోభాలకూ తలవొగ్గకుండా, తటస్థంగా వుండటం పరిణిత గల ప్రజాప్రతినిధి చిత్తశుద్ధి చిలకం వారిలో చూడటం ఆరోజుల్లో అరుదైన సంఘటన.
పాదయాత్ర సంస్కృతికి ఆద్యుడు
పాదయాత్రే పరమావధిగా, రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా వ్యవహరిస్తున్న నేటి రాజకీయ పోకడలకు భిన్నంగా, సాగునీరు –త్రాగునీరు – శాంతి స్థాపనే ధ్యేయంగా రాయలసీమ ప్రాంత అభివృద్ధికై వేయిమైళ్ళ దూరాన్ని కాలినడకన దీక్ష కొనసాగించిన ధైర్యశాలి రామచంద్రారెడ్డి. ఒక విధంగా చెప్పాలంటే, ‘పాదయాత్రలకు రాష్ట్రంలో నాందీ ప్రస్తావన పలికిన ఆద్యులు చిలకమే. పాదయాత్ర మోడల్ రూప శిల్పి కూడా అని చెప్పవచ్చు.
చిలకం అధ్యక్షడిగా కొనసాగినపుడే అనంతపురం జిల్లా కదిరి ఎమ్మేల్యే, ధర్మవరం మునిసిపల్ ఛైర్మెన్, నలుగురు కౌన్సిలర్లు గెలుపొంది రాయలసీమలో బి.జె.పి గుర్తింపు తెచ్చుకుంది. అలా బి.జె.పి అభ్యర్థిగా పోటీ చేసి ఎన్నికైన ఏకైక సమితి ప్రెసిడెంట్ రామచంద్రారెడ్డి అని వేరుగా చెప్పాల్సిన అవసరంలేదు ఆరోజుల్లో.
రాజకీయాల కంటే అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగిన రామచంద్రా రెడ్డి, ఎమ్మెల్యే, ఎంపీ పదవులు లేకున్నా, సదా ప్రజా సేవలో పునీతుడైన పావనమూర్తి. హేమాహేమీలతో కలిసి పనిచేసినా ఇసుమంత గర్వం లేకుండా తన కర్తవ్యం నిర్వర్తించిన కార్య శీలి. ప్రజాశ్రేయస్సు ఆయన ఆలంబన.
నాంపల్లిలో భాజపా కార్యాలయ నిర్మాణం
చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే నవతరం ధోరణలకు విరుద్ధంగా, పార్టీ ప్రాధాన్యతే ప్రామాణికంగా, వ్యక్తిగతలాభాపేక్షలకు తావులేకుండా, భా.జ.పాకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపుతెచ్చిన రాష్ట్రస్థాయి నాయకుల్లో ప్రముఖంగా పేర్కొనదగ్గ వ్యక్తి రామచంద్రారెడ్డి. నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితో గల తన వ్యక్తిగత పరిచయాన్ని పార్టీకి ఉపయోగపడేలా హైద్రాబాద్ నడిబొడ్డున (నాంపల్లి) బి.జె.పి. రాష్ట్ర పార్టీ భవనానికి స్థల సేకరణ, భవన నిర్మాణం చిలకం కృషికి ఆనవాళ్ళు. అదీ ప్రదేశ్ కాంగ్రెసు భవనానికి ఎదురుగా. అందుకే అంటారు పరిణితి చెందిన రాజకీయ చతురులు చిలకం అని.
గత నాలుగైదేళ్ళ అతి స్వల్ప పరిచయంలోనే చిలకo మానసికంగా నాకెంతో దగ్గర కావటం, నన్నుఆప్యాయంగా ‘శీనయ్య’ అని సంబోధించటం, నన్ను ఆదరించటం నా పూర్వజన్మ సుకృతం. పార్టీ సమావేశాల్లో కలిసినపుడు, సమరసతా సేవా కార్యక్రమాలకు వారిని ఆహ్వానించిన సందర్భాల్లో, భోజన విరామం తరువాత ఇంటా, బయట తను ఎదుర్కొంటున్న సమస్యలను ఎంతో సంవేదనతో పంచుకునేవారు. అందర్నీ తన కుటుంబసభ్యులుగా భావించి మనస్సు విప్పి మాట్లాడి, మనందరం ఒక పరివారానికి చెందిన వాళ్ళమే అన్న సనాతన భావాలు కలిగి ఉన్న మహానుభావుడు అతడు. వయోభారాన్ని కూడా లెక్క చేయకుండా, స్వంత ఖర్చులతో, మనఃపూర్వకంగా పార్టీ మీటింగులకు హాజరు కావటం, ఒక సామాన్య కార్యకర్తగా పాలు పంచుకోవటం ఆయన క్రమశిక్షణకు, అంకిత భావానికి నిదర్శనం. ఏనాడూ తన దర్పాన్ని ప్రదర్శించి ఎరుగడు. పటాటోపాలను దరిచేరనీయడు. నిండు కుండ తొణకదు అన్నట్లుగా మిన్నకుండి మెదిలేవాడు నల్గురి మధ్యలో.
అదే క్రమంలో తిరుపతి వచ్చిన ప్రతి సందర్భంలో బైరాగి పట్టడిలోని సంఘ (RSS) కార్యాలయానికి వచ్చి, అందర్నీ ఆప్యాయంగా పలకరించటం వారి సంస్కారాన్ని చాటేది. కార్యాలయంలో ఏ చిన్న సమావేశానికి పిలిచినా విధిగా హజరుఅయ్యేవారు.
పార్టీ బలోపేతానికి నిరంతర కృషి
చివరిక్షణం వరకు పార్టీని బలోపేతం చేయటానికి తనవంతు బాధ్యతగా, ఏ పదవులూ లేకపోయినా తపన పడ్డ నిఖార్సైన జాతీయవాది చిలకం. తిరుపతి పార్లమెంటు ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా గత ఫిబ్రవరి నెలలో నేను వారిని ఇంటి వద్ద కలిసిన సందర్భంలో మాన్యశ్రీ నరేంద్ర మోడి దేశ ప్రధానిగా ఉన్నప్పుడే భా.జ.పా తెలుగు రాష్ట్రాల్లో అధికారాన్ని అంది పుచ్చు కొగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేయటం ముదావహం.
జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి కార్యక్రమాలలో ఎంతో చురుకుగా పాల్గొన్న నిజమైన కార్యకర్త చిలకం. ఏనాడూ పార్టీ తనను గుర్తించలేదన్న అసంతృప్తి వ్యక్తం చేసిన వ్యక్తి కాదు. ‘పార్టీఫస్ట్, పర్సనల్ నెక్స్ట్’అన్న పార్టీ మూల సిద్దాంతానికి కట్టుబడ్డ అగ్రశ్రేణి నాయకులు చిలకం. ఆయన అనుంగు శిష్యుడు నారాయణ స్వామి మాటల్లో చెప్పాలంటే ‘పార్టీ ఆయన సేవలు గుర్తించి తగు రాణింపు ఇచ్చివుంటే పదవిరీత్యా ఇంకా మరింత సేవ చేయాటానికి అవకాశం వుండేది”అన్నది వాస్తవమేమో. చిలకం వారికిదే నా అశ్రుతర్ప నివాళులు. శ్రద్ధాంజలి !
–Dr.శ్రీనివాసులు దాసరి ఐఏఎస్(రి)
‘ సంచారి‘ స్వచ్ఛంద సేవా సమితి
వ్యవస్థాపక అధ్యక్షులు