Sunday, December 22, 2024

లాల్ బహదూర్, లోహియా దమ్మున్నోళ్లురా…

కాళోజీతో నా గొడవ – 2

మళ్లీ కాళన్న ఇంటికి చేరుకున్న. ఈసారి దేనిగురించి మాట్లాడాల్నా అని ఆలోచిస్తున్న.

కాళోజీ: మళ్లీ తయారైనావుర. సిరీశం, రా రా . ఏమో సూటు బూటు వేసినవ్. ఒక్క హ్యాటే తక్కువ. ఈ భాషరా నీది యేమి వేషమురా? ఈ భాష ఈ వేషమెవరికోసమురా…సూటు బూటు షోకుగా దొడుగ ఘనతేమి వచ్చెరా గర్వమేటికిరా?

సిరీశం: గర్వంలేదు గాని కొంచెం షోకు కాళన్నా అంతే.  అక్టోబర్ నెలలో చాన గొప్పోళ్లు పుట్టిన్రు కద.

కా: నువ్వనేది గాంధీ గురించే కద. అందరు మాట్లాడ్తర్రా గాంధీ గురించి. లాల్ బహదూర్ శాస్త్రి గురించి ఒక్కడన్న బట్టించుకున్నడా. నువ్వెప్పుడన్న జూసినావ్ర రెండో తారీకు నాడు లాల్ బహదూర్ గురించి మాట్లాడంగ.

సి: అవును అసలాయన గుర్తే ఉండడు మనోళ్లకు.

కా: గాంధీని వాడి బతుకు బతకనియ్యకపోతిమి గదర. వాడి చావును వాడిని చావనియ్యకపోతిమి. మనకోసం బతికిండు, ముసలోణ్ని పగబట్టి చంపిరి.

బ్రతికినన్నాళ్లు నిన్ను- బాపు అని పిలిచితిమి

చచ్చిపోయిన నిన్ను- జాతిపిత జేసితిమి

పెక్కుభంగుల నిన్ను చెక్కి నిలవేసితిమి

వేడ్కతో ఇంటింట- వేలాడ దీసితిమి

ఏనాడొ నిను మేము – ‘ఏసు’ గా జేసితిమి

ఎవనిచేతనొ నీవు – ఏసగుట జూచితిమి

నీ నీడగా మెలగి -నిండార వెలిగితిమి

కాళోజి మాటలకు – కడుపుబ్బ నవ్వితిమి…

సి: అవును కాళన్నా.. నిజమే.

కా: గాంధీ గుండెలో గుండ్లు దూసుకుపోతె ప్రాణం బోయిందని మనకు తెలిసె, మరి లాల్ బహదూర్ ఎట్ల చనిపోయిండొ దెలుసార?

సి: తాష్కెంట్ లో  మనకు పాకిస్తాన్ కు మధ్య శాంతి ఒప్పందం మీద సంతకం చేసిన రాత్రే చనిపాయిండని విన్న.

కా: ఆ విషయం తెలియందెవడికి. నక్కలగుట్టలో పోరడు గూడ జెప్తడు. సంతకం చేసింతరువాత ఎట్ల చనిపోతడ్రా? ఎవరన్న జంపింరంటవ?

సి: మనకెట్ల తెలుస్తది?

కా. ఎవడు చంపిండో తెలవదేమొగాని చనిపోయినోడి ప్రాణం ఎట్లబోయిందో చెప్పడానికి శవపరీక్ష చేయాలె. మరి చేసిన్రా? చేసిన్రా అని ఎవరన్న అడిగిన్రా?

సి: తాష్కెంట్ లో గవన్ని ఎట్లడుగుతరు?

కా. వాడు మనదేశానికి ప్రైమ్ మినిస్టర్రా. మామూలోడా. పాకిస్తాన్ వాడొక వైపు రష్యావాడొకవైపు ఉండంగ ఇండియా ప్రధానమంత్రి చనిపోవుడేంది, వీళ్లెవరు నోరిప్పకపోవుడేంది. ఆరోజు మీ నాయన నాదగ్గర కొచ్చి, నాకేదో అనుమానంగ ఉన్నది కచ్చితంగా చంపేసే ఉంటరని నాతో అనబట్టె. అదేరోజు రేడియో వార్త వినంగనె అనుమానమొచ్చిందిరా ఎం ఎస్ ఆచార్యకు. ప్రధాని తాష్కెంట్ లో చనిపోయిండనంగనే దిగ్గున లేచిండు. నన్నడిగె. అప్పుడు నేనేం జెప్పాలె. నాకేం దెలుసని? ఏదో కుట్ర ఉందనైతె అనిపించిన మాట నిజమే. కాని ఇక్కడ వరంగల్లు లో కూచుని, తాష్కెంట్ గురించి మనమేంజెప్తమ్రా. 

సి: మరి ఇప్పుడన్న అడగాలె …

కా: అవున్రా, ఇప్పుడడుగుతున్న, శవపరీక్ష చేసిన్రా?

సి: నాకు తెలిసే అవకాశమే లేదు.

కా: పేద్ద పెన్ను బట్టుకుని తిరుగుతరు. జర్నలిస్టునని జెప్పుకుంటరు. ఆనాటి మనదేశ ప్రధానికి శవపరీక్ష చేసిన్రాలేదా అని అడగడం చేతగాకపాయె. ఏం  మనుషులంరా మనం.

సి: నేనప్పుడు పిల్లోణ్ని.

కా: ఇప్పడిసంగతేంది? ఇప్పుడుగూడ నోట్లో వేలుజీకుతున్నావ్ ర. తెలుసుకోవాలన్న బుద్ది ఉండొద్దా? అప్పుడు గాకపోతె ఇప్పుడన్న అడగాలె గద.

సి: ఆ మధ్య ఎవరో ఆర్టీఐ కింద అడిగిండట.

కా: నీకన్న నయమె. వాడన్న అడిగిండు. ఎవడన్న జవాబిచ్చెనా?

సి: లేదు.

కా: మరి ఆర్టీఐ కింద సమాచారం అడిగితె ఇవ్వాలని చట్టం చేసిండంటివి గదర.

సి. అవును కాని తప్పించుకుంటున్నరు. ఆయన కొడుకు గూడ అడిగిండు కాళన్నా.

కా: లాల్ బహదూర్ భార్య కూడా అడిగిందిరా. కాని వినెటొడెవడు. పిఎంను రష్యాలో జంపేస్తె అడిగే దిక్కు లేని దేశమైపాయె గదర మన దేశం. (గద్గద స్వరంతో ..కళ్లనీళ్లు పెట్టుకుంటూ)

సి. మనం రష్యాలో శవపరీక్ష చేసిన్రా లేదా అని ఎట్లడుగుతం, మనం అడిగితె వాడెందుకుజెప్తడు?

కా. లా పాయింట్ బాగనే దీసినవులే. అది సరే. అక్కడినుంచి లాల్ బహదూర్ శవాన్ని ఇండియాకు దెచ్చిన్రా, అక్కడే అన్నీ గానిచ్చిన్రా.

సి. డిల్లీకి దీసుకొచ్చిన్రు.

కా: డిల్లీలో విమానం దిగిన తరువాతనన్నా లాల్ బహదూర్ కు శవపరీక్ష చేసిన్రటనా?

సి. లేదు జేయలేదు.

కా: నీకెట్ల దెలిసె.

సి. ఆర్టీఐ కింద అడిగినోళ్లు తాష్కెంటులో జేయకపోతె మానె, డిల్లీలో ఎందుకు జేయలేదని అడిగిన్రు. దానికి జవాబు రాలే. కాని ఇక్కడ కూడా పోస్ట్ మార్టం జరగలేదనైతే అర్థమైంది.

కా. అవున్నిజమే. నీ బుర్ర బాగనె పనిజేస్తున్నదిరో.

సి. లాల్ బహదూర్ తాష్కెంట్ బోతె వెంట జర్నలిస్టు కులదీప్ నయ్యర్  పి ఎంకు ప్రెస్ సెక్రటరీగ ఉండెనట. ఆయన తరువాత ఏదో పత్రికలో వ్యాసం రాసి అనుమానాలన్నీ బయటబెట్టిండు.

కా: పాకిస్తాన్ నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటె  ‘‘హం గాలీకా జవాబ్ గాలీసే దేంగే అవుర్ గోలీ కా జవాబ్ గోలీసే’’ అన్నోడ్రా, వాడు పొట్టిగున్నడు గాని గట్టోడు. గాంధీని మనదేశంలో ఎవడో జంపినట్టే వాడిని ఇంకోడెవడో జంపే ఉంటడని నా అనుమానం. అయినా అడుగుతునే ఉండాలె. ఇంకో మాట జెవ్త విను. ఓసారి ఆయూబ్ ఖాన్ మనోడితో నువ్వు పొట్టిగుంటవ్ అనకుండనే నీకెప్పుడైన ఏమైన కష్టాలొచ్చినయా అని అడిగి ఎక్కిరిద్దామనుకున్నడు. లాల్ బహదూర్ ఊరుకున్నడనుకున్నవా. ‘‘ఎప్పుడూ ఏ ఇబ్బందీలేదు’’ అన్నడు,  కాని లాభం ఉందన్నడు. వాడాశ్చర్యబోయి నోరెళ్ల బెట్టె. ‘‘నేను ఎవ్వడితోనైనా సరే తలెత్తుకు మాట్లాడ్త. నా ముందు ఎవడైనా సరే తలదించుకు మాట్లాడాలె’’ అన్నడు. నీకు దెలుసా వాడు అప్పుడు తలదించుకుని శాస్త్రిని జూస్తున్నడు. వాడురా నాయకుండంటె. ఎంత గుండెబలం ఉంటె అంతగట్టిగ జెప్తడంటవు?

సి: అవును కాళన్నా…

కా. గాంధీ శాస్త్రి గాక ఇంక చాలా మంది ఉన్నర్రా…అక్టోబర్ లో పుట్టినోళ్లు.

సి. అక్టోబర్ 10 న రేఖ పుట్టిందట, 11న అమితాబ్ పుట్టిన రోజు.

కా. వాళ్లెవర్రా? మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నం నువ్వెవరి పేరు దీస్తున్నవు? రంగులు బూసుకుని తైతక్కలాడెటోళ్ల గురించి నీకెందుకు నాకెందుకు?

సి, అంటే వాళ్లు కూడా పాపులర్ కదా…..

కా. ఇట్ల పాడైపోతిరి గదర. అక్టోబర్ 11నాడు జయప్రకాశ్ నారాయణ్ పుట్టిన రోజని దెలవదా? వీడెవడ్రా అమితాబ్ అట అమితాబ్. వాడేనా హరివంశ్ రాయ్ బచ్చన్ కొడుకు…

సి. అవునవును.

కా. నాకెందుకు దెలవద్రా. ఇంకేదో పేరుజెబితివి, రేఖ. ఆమె పూర్తిపేరు నీకు దెల్సా.

సి. అదీ అదీ…

కా. భానురేఖ రా. జెమినీ గణేశన్ కూతురు. మళ్లి నువ్వు సావిత్రి కూతురా అనడగకు. కాదు.

సి. మీ కెట్ల దెల్సు కాళన్నా..

కా. జనరల్ నాలెడ్జి లేనోళ్లు జర్నలిస్టులెట్లయితర్రా. జయప్రకాశ్ నారాయణ్ అక్టోబర్ 11న పుట్టిండురా. నీకింకో విషయం దెల్సా. జెపి చనిపోయింది అక్టోబర్ ఎనిమిదోతారీకు. అప్పుడేగద నేను మూడు వాక్యాల కవిత రాసింది.  పుటక నీది, చావునీది, బతుకు దేశానిది. అని…

సి: అవును కాళన్నా…

కా: నీకింకో విషయం దెల్సార?  అక్టోబర్ 12 గురించి.

సి. ఆర్టీఐ దినోత్సవం. ఆరోజే రైట్ టు ఇన్ఫర్మేషన్ వచ్చింది 2005లో.

కా: మనం మనుషులగురించి గదర మాట్లాడేది. కానూన్ ముచ్చటెట్ల చెప్తివి?

సి. అవునవును., మరి…

కా. అది రాంమనోహర్ లోహియా పుట్టిన రోజురా.  సోషలిస్టు లోహియాను మరిచిపోయే దేశం అదేం దేశం ర. అటువంటోడు మళ్లీ దొరుకుతడా? ఐన్ స్టీన్ ఇంటికి బోయి ఏం చెప్పిండో దెల్సా. లోకంలో జనమంతా గాంధీ గురించి నీ గురించే మాట్లాడుకుంటున్నరని జెప్తె ఐన్ స్టీన్ సంతోష పడ్డడు. తర్వాతేమన్నడో తెల్సా. అహింస గురించి సత్యాగ్రహం గురించి ప్రపంచానికి బతకడం గురించి గాంధీ పాఠాలు జెప్తుంటె, నువ్వేమో దేశాలకు దేశాలనే నాశనం జేసె బాంబులు కనిపెడ్తుంటివి అన్నడు. వాడిముఖాన నెత్తురు చుక్కలేదు. అదిరా ధైర్యమంటే. దమ్మున్నోడు లోహియా..

సి. చాలా సంగతులు తెలిసినై కాళన్నా నీ దగ్గరికొచ్చుడు మంచిదయింది.

కా. అవున్రా. తెలవకపోతే తెలుసుకోవాలనుకోవాలె ఎవడైనా. అటువంటోళ్లు తక్కువైపోతున్నరు. నువ్వు కనీసం అడిఃగి తెలుసుకుంటున్నవ్. మంచిదే..

Also read: కాళన్నతో కాకతీయం

సిరీశం 15.10.2021

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles