గాంధీయే మార్గం-41
తెలుగువారి స్వాతంత్ర్య ఇచ్ఛ, పోరాట పటిమను తెలియచేసే మూడు సంఘటనలు చాలా తక్కువ వ్యవధిలో దాదాపు ఒకే ప్రాంతంలో సంభవించడం గర్వకారణం. అవి పల్నాడు, చీరాల, పెదనందిపాడు ఉద్యమాలుగా పిలువబడ్డాయి.
Also read: తెలుగు నాట స్వాతంత్ర్య సమర పోరాటం
పల్నాడు పుల్లరి ఉద్యమం, కన్నెగంటి హనుమంతు బలిదానం
గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో వర్షాభావంతో తిండిగింజలు లేక పశువులకు గ్రాసం దొరకని పరిస్థితి 1920-21ల్లో ఏర్పడింది. అడవిలో పశువులు మేపుకోవడానికి ‘పుల్లరి’ (రుసుం) ప్రవేశ పెట్టడం ప్రజలకు తీవ్ర విఘాతమైంది. పల్నాడు రైతులు ఈ ఉత్తర్వులు ఉల్లంఘించి అడవులలోకి తమ పశువులను మేతకోసం వదిలారు. దానికి స్థానికులే పూర్తి నాయకత్వం వహించారు. సహాయ నిరాకరణతో అధికారులకు అన్నం దొరకలేదు, తాసిల్దారు ఇంట్లో పిల్లలకు పాలు దొరకలేదు. ప్రజలకు మద్దతు ఇస్తున్నారని ఉన్నవ లక్ష్మీ నారాయణ, వేదాంతం లక్ష్మీ నరసింహాచార్లను తమ ముందు హాజరు కమ్మని కలెక్టరు ఉత్తర్వు.
Also read: దేశాన్ని ఒక తాటిపై నడిపిన గాంధీజీపథం
మాచెర్లలో ఈ విషయం దండోరా వేయాలంటే తప్పెట్లు దొరకలేదు. చివరికి 1921 జూలై 25న కలెక్టరు ఉన్నవ, వేదాంతం ద్వయానికి ఒక సంవత్సరం పాటు శిక్ష విధించారు. దీనికి నిరసనగా దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నేతృత్వంలో వారం రోజులపాటు గుంటూరులో హర్తాళ్ అపూర్వంగా జరిగింది. ఈ సందర్భంలో కన్నెగంటి హనుమంతు నాయకత్వం వహించి, ప్రభుత్వాన్ని స్థంభింపచేశారు. నిజానికి అప్పటికీ శాసనోల్లంఘనాన్ని కాంగ్రెస్ ప్రారంభించలేదు. ఈ పరిస్థితిలో స్థానిక నాయకులు పోకచెక్కలా నలిగిపోయారు. 1922 ఫిబ్రవరి 26న కన్నెగంటి హనుమంతు పోలీసుల దాడికి గురయ్యారు, 26 బుల్లెట్లు ఆయనలో దూసుకుపోయాయి. పల్నాడు పుల్లరి ఉద్యమం, అలాగే కన్నెగంటి హనుమంతు ఆత్మత్యాగం భారతదేశంలోనే చాలా విలువైనవి.
Also read: భారత రాజకీయరంగంలో గాంధీజీ ప్రవేశం!
చీరాల-పేరాల ఉద్యమం
తెలుగువారి ఖ్యాతి చాటి చెప్పినది చీరాల-పేరాల ఉద్యమం. సామాన్య కుటుంబంలో పుట్టిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, సొంత ఆస్తిని కుదువ పెట్టి ఎడింబరో విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో ఎం.ఎ. (ఆనర్సు) పొందిన దృఢచిత్తుడు. 1821 మార్చిలో 21న బెజవాడలో కాంగ్రెస్ వార్షిక సమావేశాలు జరిగినపుడు గోపాలకృష్ణయ్య ‘రామదండు’ గొప్పగా పనిచేసి రెండో రోజు సభలు సజావుగా గొప్పగా జరగడానికి తోడ్పడింది. దాంతో దుగ్గిరాల వారి సామర్థ్యమేమిటో గాంధీతో పాటు మొత్తం దేశం గ్రహించింది. ఈ సమావేశాల్లోనే పింగళి వెంకయ్య జాతీయ జెండా రూపొందించారు.
Also read: గాంధీజీ రాక ముందు దేశరాజకీయరంగం
చేనేతకు ప్రసిద్ధి చెందిన చీరాల, పేరాల జంట గ్రామాలను కలిపి మునిసిపాలిటీగా చేసి పన్నులు ఎక్కువగా రాబట్టాలని 1920 జనవరి 12న ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో ప్రజలు పన్నులు కట్టడం మానివేశారు. ప్రభుత్వం పట్టు వదలలేదు. చీరాల-పేరాల మొత్తం జనాభా 15,326 మంది. వారిలో 13,582 మంది మూకుమ్మడిగా 1921 ఏప్రిల్ 25 అర్థరాత్రి ఇళ్ళు ఖాళీచేసి చీరాల పక్కన ఉన్న బంజరు భూమికి బయలుదేరారు. గోపాల కృష్ణయ్య రామదండు వీరికి సాయపడింది. ప్రజలు పట్టుదలగా కొనసాగారు. అయితే, ఉద్యమం నడపటానికి దుగ్గిరాలకు ధనం అవసరం అయ్యింది. 1921 సెప్టెంబరులో బరంపురం సభలో దుగ్గిరాల గొప్పగా ప్రసంగించి చీరాల-పేరాల ఉద్యమానికి సాయం కోరారు. సెప్టెంబరు 28న వారి రాజద్రోహ కేసు మీద గోపాలకృష్ణయ్యను అరెస్టు చేసి తిరుచ్చిరాపల్లి జైలుకి పంపివేశారు. ప్రజలు మాత్రం ఆ బంజరు భూముల్లో, తాటాకు గుడిసెల్లో ఎండల్లో, వానల్లో కొనసాగారు. చివరికి 1922 ఫిబ్రవరిలో నిరాశలో ప్రజలు చీరాలకు వెనుదిరిగారు. చీరాల-పేరాల ఉద్యమం నీరుగారిపోయింది, మున్సిపాలిటి ఉండిపోయింది. అయినా చీరాల-పేరాల ఉద్యమ స్ఫూర్తి అజరామరం.
Also read: గాంధీజీతో ప్రభావితమైన భారతీయ శాస్త్రవేత్తలు
పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యమం
గాంధీజీ విధించిన అన్ని షరతులను పాటించి మొట్టమొదటిసారిగా భారతదేశంలో శాసనోల్లంఘనం జరిపింది పెదనందిపాడు ఫిర్కాలోని 18 గ్రామాలలోనే! 1921 డిసెంబరులో అహ్మదాబాదులో జరిగిన కాంగ్రెస్ మహాసభలో పన్నుల నిరాకరణ తీర్మానాన్ని ఆమోదించారు. గుంటూరు జిల్లాలో నడపాలని తెలుగు ప్రాంతపు కాంగ్రెస్ కమిటీ నిర్ణయించింది. పెదనందిపాడులో ఈ ఉద్యమం మొదలయ్యే సమయానికి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, గొల్లపూడి సీతారామ శాస్త్రి, ఉన్నవ లక్ష్మీ నారాయణ, మాడభూషి వేదాంతం నరసింహాచార్యులు జైళ్ళలో ఉండగా, కొండా వెంకటప్పయ్య ఆనారోగ్యంతో ఉన్నారు.
Also read: గాంధీజీ టెక్నాలజీకి వ్యతిరేకం కాదు!
పర్వతనేని వీరయ్య
అటువంటి సమయం గ్రామీణ ప్రాంతం నుంచి గొప్ప నాయకత్వం అందించిన వారు ‘ఆంధ్ర శివాజీ’ పర్వతనేని వీరయ్య చౌదరి. ఎక్కడా హింసకు తావులేకుండా రోజూ గుర్రంపై ఐదారు ఊళ్ళు తిరుగుతూ ఉద్యమానికి శాంతి పహారా కాసినవాడు వీరయ్య. దీనికి కోపగించిన ప్రభుత్వ అధికారులు జారీచేసిన శిక్షలు, చర్యలు అమలు చేయడానికి శాసనోల్లంఘనం ప్రతిబంధకం అయ్యింది. దౌర్జన్యంగా పన్నులు రాబట్టాలని మద్రాసు నుంచి సైన్యాన్ని రప్పించారు. ప్రజలు సహనం కోల్పోలేదు, శాంతిపథం వదలలేదు. కానీ తెలుగు నాయకుల చాడీల రాజకీయాలు బాగా పనిచేశాయి. ఈ ఉద్యమం అర్థాంతరంగా ఆగిపోయినా తెలుగు ప్రజల పోరాటానికీ, సహనానికీ పెద్ద కొండ గుర్తు.
Also read: గాంధీజీ దృష్టిలో టెక్నాలజి
గౌతమి సత్యాగ్రహ ఆశ్రమం
1922 ఫిబ్రవరి 4వ తేదీన గోరక్ పూర్ ప్రాంతంలోని చౌరీచౌరాలో శాంతియుతంగా సాగే జనాన్ని పోలీసులు కవ్వించి రెచ్చగొట్టారు. అంతవరకు దేశంలో ప్రతిచోట అహింసాత్మకంగా సాగిన ఉద్యమంలో అపశృతి చోటు చేసుకుంది. ఉద్యమకారులు పోలీసు స్టేషన్ ను ముట్టడించి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో 22 మంది పోలీసులు మరణించారు. ఈ సంఘటనతో గాంధీజీ తల్లడిల్లిపోయారు. అంతేకాదు సత్యాగ్రహులకు శిక్షణ మరింత అవసరమని తలంచారు. దాంతో సహాయానిరాకరణోద్యమాన్ని అర్థాంతరంగా ఆపివేశారు. చాలామంది నాయకులకు ఇది నచ్చలేదు. కానీ గాంధీజీ దీక్ష వేరు. సత్యాగ్రహులకు శిక్షణ ఇవ్వడానికి రాజమండ్రి దగ్గర గౌతమి సత్యాగ్రహ ఆశ్రమం 1925 ఫిబ్రవరి 4న మొదలైంది.
Also read: గాంధియన్ ఇంజనీరింగ్
(తరువాయి వచ్చే వారం)
డా నాగసూరి వేణుగోపాల్, ఆకాశవాణి పూర్వ సంచాలకులు,
మొబైల్-9440732392