శ్రుతిమించిన అసభ్య పదజాలం, చింతామణిలో చిత్ర, సుబ్బిశెట్టి పాత్రధారులు
- అసభ్య దృశ్యాలూ, డైలాగులూ తొలగించాలి
- నాటకంలోని సంస్కరణవాదానికి నమస్కరించాలి
- వైశ్యసామాజికవర్గం అభ్యంతరం సమంజసమైనదే
తెలుగు పద్యనాటక రంగాన్ని శాసించిన సాంఘిక నాటకాలలో ‘చింతామణి’దే అగ్రతాంబూలం.”ఈ శతాబ్దం నాది..” అన్నట్లుగా వందేళ్లు ప్రభవించిన ఈ నాటకానికి నేడు నూరేళ్లు నిండేలా చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నాటక ప్రదర్శనను ఆంధ్రప్రదేశ్ లో రద్దు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వైశ్య సామాజిక సంఘాల విజ్ఞప్తి, ఒత్తిళ్ల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also read: వాక్సిన్ కి ఏడాది
శోకంలో పుట్టిన శ్లోకం ఆ దృశ్యకావ్యం
పరస్త్రీవ్యామోహం, వ్యభిచారంలో పడి కుటుంబాన్ని వీడి, ధనమానాలను పోగొట్టుకున్న ఎందరో జీవితాలను చూసి చలించాడు ‘మహాకవి’ కాళ్ళకూరి నారాయణరావు. ఆ శోకంలో ఒక శ్లోకం పలికె.. అన్న చందాన, ఆ వేదన నుంచి ‘చింతామణి’ కావ్యం పుట్టింది. ఇది దృశ్యకావ్యం, అంటే నాటకం. దుర్బుద్ధులకు, దుర్వ్యసనాలకు బలిగాకుండా ప్రజలను చైతన్యవంతులను చేయడానికే కంకణం కట్టుకొని కలంపట్టిన యోధుడు కాళ్ళకూరి. ఆయన రాసిన మరో రెండు సాంఘిక పద్యనాటకాలు కూడా చైతన్య ప్రబోధకాలే. అవి వర విక్రయం, మధుసేవ. కట్నకానుకలకు వరుడ్ని అమ్ముకునే దురాచారంపై రాసినది ‘వరవిక్రయం’. తాగుడు వల్ల కుటుంబాలు,బంధాలు, సమాజం ఎంత సర్వనాశనమై పోతాయో చెబుతూ చిత్రించిన నాటకం ‘మధుసేవ’. సంపూర్ణమైన సామాజిక బాధ్యతతోనే కాళ్ళకూరి నారాయణరావు రచనలు చేశారు. ‘చింతామణి’ కూడా అటువంటి రచనే. గొప్ప నాటకం. 1923కే సుమారు 446 ప్రదర్శనలను దేశవ్యాప్తంగా జరుపుకున్నట్లు సమాచారం. ఉద్దండులైన కవిపండితులు,నటులు ఈ నాటకంలో పాత్ర పోషణ చేశారు. పండితపామర రంజకంగా సాగిన ఈ నాటకం ఎందరెందరో మేధావుల ప్రశంసలను అందుకుంది. పత్రికలు వేనోళ్ల పొగిడాయి, ప్రశంసాపూర్వక సమీక్షలు గుమ్మరించాయి. 1956లో సినిమాగానూ నిర్మాణమైంది. ముఖ్యపాత్రలైన చింతామణి, బిల్వమంగళుడిగా భానుమతి, ఎన్టీఆర్ నటించారు.సుబ్బిశెట్టి పాత్రలో రేలంగి, శ్రీహరిగా రుష్యేంద్రమణి రక్తికట్టించారు. ఆశించిన స్థాయిలో సినిమా విజయం సాధించలేదు కానీ, రంగస్థల వేదికలపై ఈ నాటకం ఒక ఊపుఊపేసింది. దీనికి ప్రధానమైన ఆకర్షణలు రెండు. (1) పద్యాలు (2) హాస్య, చమత్కార భరితమైన సంభాషణలు.
Also read: ప్రపంచవ్యాప్తంగా సూర్య నమస్కారాలు
చింతామణి, బిల్వమంగళుడు, భవానీ శంకరం పాత్రలలోని పద్యాలు రసగుళికలు. సుబ్బిశెట్టి -శ్రీహరి -చిత్ర మధ్య సాగే సంభాషణలు హాస్యపు జడివానలు. పైకి చమత్కారంగా కనిపిస్తూనే, వ్యభిచారం వల్ల వచ్చే కష్టనష్టాలను ఆ పాత్రలు మన కళ్లెదుటే దర్శింపజేస్తాయి.సుబ్బిశెట్టి పాత్రలో కాళిదాసు కోటేశ్వరరావు, శ్రీహరి పాత్రలో సూరవరపు వెంకటేశ్వర్లు అద్భుతంగా నటించేవారు. చింతామణిగా బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి నటనం అపురూపం. బిల్వమంగళుడు, భవానీశంకర్, చింతామణి నోటి నుంచి వచ్చే మాటలు, పద్యాలు కన్నీళ్లు కూడా తెప్పించేవి. బిల్వమంగళుడి పాత్ర పరమ ఉదాత్తమైనది. అతనే తదనంతరం లీలాశుకుడిగా పరమయోగిగా జీవితాన్ని పండించుకుంటాడు. సునిశితమైన హాస్యం,మనోవికాసాన్ని పెంచే పాత్రచిత్రణ, అద్భుతమైన భాష, పరమాద్భుతమైన పద్యాలతో సందేశాత్మకంగా రూపొందించిన గొప్ప నాటకం ‘చింతామణి’. అది గతం.
Also read: యూపీలో బీజేపీకి టోపీ
వైశ్యుల అభ్యంతరం సమంజసం
సుమారు ఐదు దశాబ్దాల నుంచి నాటక ప్రదర్శన తీరు మారింది. అశ్లీలం తాండవించడం ప్రారంభమైంది. ముఖ్యంగా శ్రీహరి, చిత్ర, సుబ్బిశెట్టి పాత్రలలో అసభ్యత ఆకాశాన్ని తాకడం ఆరంభమైంది. ‘సుబ్బిశెట్టి’ పాత్ర పోషణ, దాని చుట్టూ నడిచే నాటకం, సంభాషణలు పరమ జుగుప్సాకరంగా తయారయ్యాయి. సంభాషణలు, హావభావాలకు తోడు రికార్డింగ్ డాన్స్ లను మించిపోయే నృత్యరీతులను ప్రవేశపెట్టారు. ‘సుబ్బిశెట్టి’ పాత్ర పోషణ,ఆ చుట్టూ తిరిగే సన్నివేశాలు వైశ్య సామాజిక వర్గానికి ఆగ్రహం తెప్పించే విధంగా, అభ్యంతరకరంగా తయారయ్యాయన్నది వాస్తవం. కుటుంబంతో కలిసి చూసే పరిస్థితి దాటి పోయింది. చూడడం సంగతి అలా ఉంచుదాం. అందులో నటించడానికి కూడా చాలామంది నటులు ముందుకు వచ్చేవారు కాదు. పలుమార్లు ప్రదర్శనలను రద్దు చేసిన సంఘటనలు, నిషేధం విధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం నుంచి పూర్తి నిషేధం పొందిన సందర్భం తాజాగా చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక, పర్యాటక, యువజన, క్రీడాశాఖ ‘చింతామణి’ నాటక ప్రదర్శనను నిషేధిస్తూ జిఓ నెంబర్ :7ను విడుదల చేసింది. ఈ పరిణామం నేడు తెలుగు ప్రజల్లో, భాషాభిమానుల్లో, పద్యనాటక ప్రియుల్లో, నాటక సమాజాలలో పెద్ద చర్చకు తెరతీసింది. రద్దు నిర్ణయానికి వైశ్య సామాజిక సంఘాలు హర్షిస్తున్నాయి. నాటకం రద్దు దిశగా ఈ సామాజిక వర్గాల నుంచి విజ్ఞప్తులు కొత్తగా వచ్చినవి కావు. ఎప్పటి నుంచో అభ్యంతరాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చర్చకు వచ్చింది. ఇప్పటికి రద్దు నిర్ణయం అమలులోకి వచ్చింది.
Also read: మౌనమే మాయావతి భాష
పూర్తిగా నాటక ప్రదర్శనను రద్దు చేయడం సరియైన చర్య కాదనే ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా సుబ్బిశెట్టి పాత్ర, దాని చుట్టూ ఉండే సన్నివేశాలు,సంభాషణలు, ఆహార్యంపై వైశ్య సామాజిక వర్గాలు అభ్యంతరం వ్యక్తం చెయ్యడం నూటికి నూరుపాళ్ళు సబబే. అయితే, మొత్తంగా ఈ నాటకంలో వచ్చిన మార్పులకు- అసలు రచనకు ఏ మాత్రం పోలిక లేదు, కాళ్ళకూరి నారాయణరావుకు – ఈ పోకళ్లకు ఏ విధంగానూ సంబంధం లేదు. ఆయన పరమ ఉదాత్తంగా ప్రతి పాత్రనూ తీర్చిదిద్దారు. సంభాషణలు, సన్నివేశాలు హుందాగా ఉంటాయి.కాళిదాసు కోటేశ్వరరావు, సూరవరపు వెంకటేశ్వర్లు… సుబ్బిశెట్టి -శ్రీహరిగా పోషించినంత కాలం హాస్యం హద్దుల్లోనే ఉండేది. ఆరవపల్లి సుబ్బారావు ‘సుబ్బిశెట్టి’ పాత్రపోషణ చేయడం దశ నుంచీ వికృత రూపం దాల్చడం మొదలైందని పరిశీలకులు చెబుతున్నారు. రానురాను అన్ని పాత్రలు దిగజారాయన్నది చేదునిజం. నాటకం మొత్తంగా అశ్లీలంగా మార్చివేశారు. దీనితో మొదటికే మోసం వచ్చింది. ప్రదర్శనను పూర్తిగా రద్దు చేసే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనకాల వైశ్య సామాజిక వర్గాల విజ్ఞప్తులే కాక,అదే సామాజిక వర్గానికి చెందిన మంత్రి ప్రభావం ఉందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. అసలే నాటకరంగం అనాదరణకు గురవుతోంది. పద్యనాటకాల పరిస్థితి కూడా అంతే.ఎందరో నటులు,కళాకారులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
Also read: లాక్ డౌన్ అనివార్యమా?
కాళ్ళకూరి చింతామణి సంస్కారవంతమైంది
నాటకాలను,కళలను బతికించడం ప్రభుత్వాల బాధ్యత. కాళ్ళకూరి నారాయణరావు రచించిన అసలు ప్రతిలో ఏముందో పరిశీలించి, యధాతథంగా ప్రదర్శించడానికి అనుమతి ఇవ్వడమే పరిష్కారం. సామాజిక వర్గాల మనోభావాలను దెబ్బతీయడం అనైతికం.అశ్లీలంతో అసభ్యకరంగా ప్రదర్శించడం అరాచకం.వీటన్నిటిపై ఉక్కుపాదం మోపాలి. ‘చింతామణి’ నాటకం రచించిన కాళ్ళకూరి నారాయణరావు చాలా గొప్పవాడు, బహుముఖ ప్రతిభామూర్తి, సంఘసంస్కర్త. నాటక ప్రదర్శనను రద్దు చేస్తే ‘మహాకవి’కాళ్ళకూరి నారాయణరావును అవమానపరచినట్లేనని భాషా ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి అభ్యంతరకరమైన అంశానికి తావు ఇవ్వకుండా ప్రదర్శనకు నాటక సమాజాలు ముందుకు వస్తే, ఆ విధంగా నిర్వాహకులు హామీ ఇస్తే, నాటక ప్రదర్శనకు అనుమతి ఇవ్వవచ్చు. ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరాలోచించాలి. పూర్తిరద్దు ఉత్తర్వులను ఉపసంహరించడమే ఉత్తమం. ‘చింతామణి’కి సంకెళ్లు వేయకుండా, పూర్వ వైభవం తేవడంలో అందరూ కలిసి వస్తారని ఆకాంక్షిద్దాం.
Also read: ఎన్నికల నగారా మోగెన్