Sunday, December 29, 2024

చైనా వక్రదృష్టి

కరోనా వైరస్ సృష్టికర్త అనే చెడ్డపేరును ప్రపంచ దేశాల ముందు మూటకట్టుకున్నా చైనా వైఖరిలో ఎటువంటి మార్పు లేదు. సరిహద్దుల్లో యుద్ధవాతావరణానికి చరమగీతం పాడుదామని బాస చేసినా  ఆ నైజం మారడం లేదు. ఇటీవల బంగ్లాదేశ్ ను కూడా ఇబ్బంది పెట్టాలని చూసింది. అన్ని ఉపాయాలనూ ప్రయోగించి ముందుగా సరిహద్దు దేశాలను, ఆ తర్వాత మిగిలిన దేశాలను తనకిందకు తెచ్చుకొని, అగ్రరాజ్యంగా అవతరించాలనే యావ పోవడం లేదు. భారత్ విషయానికి వస్తే  చైనా ఎన్నిసార్లు మాట తప్పిందో లెక్కేలేదు.

Also read: సందేహాలను నివృత్తి చేసిన మోదీ

సరిహద్దుల్లో యుద్ధవిన్యాసాలు

కొంతకాలం నుంచి ఉద్రిక్తవాతావరణం కాస్త చల్లబడిందని అనుకుంటున్న వేళ  ఇప్పుడు మళ్ళీ సరిహద్దుల్లో యుద్ధ విన్యాసాలకు చైనాకు సిద్ధమయ్యింది. చైనా వంకర బుద్ధి మారలేదని చెప్పడానికి తాజా పరిణామాలు అద్దం పడుతున్నాయి. తూర్పు లడాఖ్ కు ఎదురుగా ఉన్న తన వైమానిక స్థావరాల వద్ద ఆధునాతన యుద్ధ విమానాలతో భారీ విన్యాసాలు చేపట్టింది. సుమారు 22 యుద్ధ విమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నట్లు సమాచారం. లడాఖ్ ప్రాంతంలోని వాస్తవాధీన రేఖకు అటువైపుగా కొన్ని రోజుల నుంచి చైనా ఈ భారీ ప్రదర్శన చేపట్టిందని రక్షణశాఖ వర్గాలు చెబుతున్నాయి. చైనా విధానాల పట్ల విశ్వాసాన్ని కోల్పోయిన భారతదేశం అప్రమత్తంగానే ఉంది. ఆ దేశపు కదలికలను మన సైనిక దళాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. గత సంవత్సరపు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మన నిఘా విభాగం మరింత చురుకుగా పనిచేస్తోంది. అన్ని రకాల విమానాలను దింపడానికి వీలుగా చైనా అన్ని ఏర్పాట్లు చేసుకుంది. అయితే  ఆ విమానాలన్నీ ప్రస్తుతానికి గగనతలంలోనే ఉన్నాయని మన రక్షణ వర్గాలు గుర్తించాయి. పోయిన సంవత్సరం ఇరుదేశాల సైనికుల మధ్య అనేకసార్లు ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.

Also read: కారామాస్టారి కథ కొనసాగుతుంది

మన పహారా పెరిగింది

ఈ నేపథ్యంలో, మనం కూడా వాయుసేన గస్తీని పెంచాము. మిగ్ మొదలైన ఫైటర్ జెట్లు అక్కడ పహారా కాస్తున్నాయి. అత్యాధునిక రఫెల్ యుద్ధ విమానాలు కూడా అక్కడ అందుబాటులోనే ఉన్నాయి. రెండు దేశాల మధ్య అనేకసార్లు చర్చలు జరిగాయి. బలగాలను వెనక్కి తీసుకోవడానికి, శాంతి స్థాపనకు రెండు దేశాలు అంగీకారానికి వచ్చాయి. దీనిలో భాగంగా, ఇరు దేశాలు బలగాలను ఉపసంహరించుకున్నాయి. అయితే, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ను చైనా అక్కడ నుంచి తరలించలేదని సమాచారం. చైనా తరచూ ఒప్పందాలను ఉల్లంఘన చేస్తూనే వుందని తాజా పరిణామాలు చెబుతున్నాయి. కొన్ని నెలల క్రితం పాంగాంగ్ సరస్సు వద్ద వెనుతిరిగినా  గాగ్రా పోస్ట్, హాట్ స్ప్రింగ్స్, దెమ్ చోక్ మొదలైన ప్రాంతాల్లో చైనా దళాలు కొనసాగుతూనే ఉన్నాయి. అత్యంత వ్యూహత్మకమైన డెప్సాంగ్ ప్రాంతంలో భారత దళాలు పెట్రోలింగ్ నిర్వహించకుండా చైనా దళాలు అడ్డుకుంటున్నాయి. అంతే కాక, ఈ ప్రాంతాలకు సమీపంలో ఉన్న శిబిరాల్లోకి అత్యాధునిక ఆయుధాలను మొహరిస్తూనే ఉంది. చైనాకు దీటుగా భారత్ కూడా మొహరింపులు చేసిందని మన ఆర్మీ చీఫ్ ఎం ఎం నరవాణే పదిహేను రోజల క్రితమే వివరించారు. రెండు దేశాల మధ్య చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందనే విశ్వాసాన్ని ఆయన ఇటీవలే వ్యక్తం చేశారు. చైనా దుందుడుకు చర్యలు లడాఖ్ ప్రాంతానికే పరిమితం కాలేదు. టిబెట్ ముసుగులో అరుణాచల్ ప్రదేశ్ భూభాగాలకు చేరువగానూ వస్తోంది.

Also read: సప్తప్రతిభాశాలి బాల సుబ్రహ్మణ్యం

జిమ్ వచ్చిన తర్వాత పెరిగిన దుందుడుకుతనం

2012లో జిన్ పింగ్ అధికారంలోకి వచ్చిన తర్వాత సరిహద్దుల అభివృద్ధి, కొత్త గ్రామాల నిర్మాణంపై ఎక్కువ దృష్టి పెట్టింది. హైవేల నిర్మాణం, విమానాశ్రయాల స్థాపనకు ఎక్కువ బడ్జెట్ ను కేటాయించింది. ఏది ఏమైనా  చైనా దృష్టంతా దురాక్రమణపైనే ఉన్నది. ముఖ్యంగా భారత్, అమెరికాపై కక్ష కట్టింది. ఏదో రూపాల్లో భారత్ లో అలజడి, అశాంతిని సృష్టించాలనే దుష్ట ఆలోచనలతోనే ఉంది. మిగిలిన సరిహద్దు దేశాలు లొంగినట్లుగా భారత్ లొంగడం లేదు. ఇది చైనాకు మింగుడు పడడం లేదు. కరోనా వైరస్ ద్వారా దెబ్బతీయాలని చూసింది. రష్యాతో బంధాలను పూర్తి చెడగొట్టాలని చూస్తోంది. పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్ మొదలైన సరిహద్దు దేశాలన్నింటినీ భారత్ వైపు ఉసిగొల్పింది. బంగ్లాదేశ్ – భారత్ మధ్య బంధాలు ఈ మధ్య మరింతగా దృఢపడుతున్నాయి. ఈ అంశం కూడా చైనాకు ఏమాత్రం ఇష్టం లేదు. క్వాడ్ దేశాల పేరుతో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా ఏకమయ్యాయి. దీనిని బద్దలు కొట్టాలని చైనా చూస్తోంది. కానీ కుదరడం లేదు. ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అమెరికా నేపథ్యంలో  చైనా వ్యతిరేక దేశాలన్నీ మరింతగా ఏకమవుతాయానే భయాలు పట్టుకుంటున్నాయి. తన ఉనికిని వ్యతిరేక దేశాలకు చాటి చెప్పడానికి పన్నుతున్న వ్యూహాల్లో భాగమే లడాఖ్ ప్రాంతంలో నేటి పరిణామాలని భావించాలి.

Also read: సమాఖ్య స్ఫూర్తికి సమాధి?

యుద్ధవాతావరణం చైనా ధ్యేయం

నిజంగా, యుద్ధం చేయడానికి సుముఖత ఉన్నట్లు కనిపించడం లేదు. యుద్ధ వాతావరణం కల్పించడం, అలజడిని సృష్టించడమే చైనా లక్ష్యం. కరోనా కట్టడి కార్యాచరణలో నిమగ్నమై ఉన్న భారతదేశపు నైతికబలాన్ని కూడా దెబ్బతీయాలని చైనా చూస్తోంది. రక్షణ రంగంలో, భారతదేశం గతంలో కంటే మరింత బలమైన దేశంగా నిర్మాణమై ఉంది. ప్రపంచ దేశాల మద్దతు కూడా ఎక్కువగా భారత్ వైపే ఉంది. యుద్ధం మన గమ్యం కాదు. శాంతి స్థాపనే మన లక్ష్యం. ఇరుగుపొరుగు దేశాలతో సోదరభావంతో మెలగడమే మన విధానం. చైనా వంకర బుద్ధికి ప్రపంచ దేశాలే బుద్ధి చెబుతాయి. చైనా – భారత్ మధ్య కాలుతున్న ఈ రావణకాష్టంకు ముగింపు ఎన్నడో?

Also read: కరోనా చైనా చేతబడేనా?

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles